కరెంటు కోతలు షురూ..!

జిల్లాల్లో అనధికారికంగా పవర్ కట్‌లు
పెరుగుతున్న డిమాండ్, తగ్గనున్న ఉత్పత్తి
రోజుకు 15 ఎంయూలకుపైగా పెరిగిన డిమాండ్
రబీ పంట భవిష్యత్తుపై రైతుల ఆందోళన


విజయవాడ: రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్ క్రమంగాపెరుగుతోంది. నిరంతరం విద్యుత్తు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఈ విషయంలో అన్న మాటను నిలబెట్టుకునే పరిస్థితులు కనిపించడం లేదు. ఈ దిశగా ప్రభుత్వం ముందస్తుగా సరైన కసరత్తులు చేసినట్లుగా కనిపించడం లేదు. రాష్ర్టంలోని వివిధ విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాల్లో డిమాండ్‌కు సరిపడా విద్యుత్తు ఉత్పత్తి అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. దీనికితోడు థర్మల్ కేంద్రాల్లో తగ్గుతున్న బొగ్గునిల్వలు ఆందోళనను రెట్టింపు చేస్తున్నాయి.  ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అనధికారిక కోతలు ప్రారంభమయ్యాయి కూడా. ఇప్పుడున్న పరిస్థితుల్లో రబీపంటలను కాపాడాలన్నా, వేసవి సమీపించిన దృష్ట్యా గృహావసరాలకు అనుగుణంగా విద్యుత్తు డిమాండ్‌ను తీర్చాలన్నా విద్యుత్తు కొనుగోలు చేయక తప్పని పరిస్థితులు నెలకొనేలా ఉన్నాయి.


అనూహ్యంగా పెరిగిన డిమాండ్...!


గత రెండువారాల్లో ఏకంగా రోజుకు 15 మిలియన్ యూనిట్ల (ఎంయూల)కుపైగా వాడకం పెరిగింది. విద్యుత్తు లభ్యత, వినియోగం మధ్య ప్రస్తుతం మిలియన్ యూనిట్లకుపైగా తేడా కనిపిస్తోంది. దీంతో జిల్లాల్లో అప్రకటిత కోతలు అమలు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో కోతల తీవ్రత మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల ఉష్ణోగ్రతలు పెరగడం, రైతులు రబీకి ఉపక్రమిస్తుండటంతో విద్యుత్తు వినియోగం అనూహ్యంగా పెరుగుతోంది. ఈ  నెల మొదటి వారంలో 125 ఎంయూలున్న డిమాండ్ ఆదివారం నాటికి 144 ఎంయూలకు చేరింది. మరోవైపు థర్మల్ విద్యుత్తు కేంద్రాల్లోనూ ఉత్పత్తి తగ్గుతోంది. రాష్ట్రంలో 2,810 మెగావాట్ల సామర్థ్యం గల థర్మల్ విద్యుత్తు కేంద్రాలున్నాయి. ఇవి సక్రమంగా పనిచేస్తే రోజుకు 70 ఎంయూల విద్యుత్తు ఉత్పత్తి జరుగుతుంది. ప్రస్తుతం 64 మిలియన్ యూనిట్ల కన్నా ఎక్కువ రావడంలేదు. రోజుకు 44 మిలియన్ యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి చేయాల్సిన విజయవాడ ఎన్టీటీపీఎస్‌లో దాదాపు పది మిలియన్ల లోటు కనిపిస్తోంది. రాయలసీమ థర్మల్ విద్యుత్తు కేంద్రం (ఆర్టీపీపీ)లోనూ ఇదే పరిస్థితి. రోజుకు 26 మిలియన్ యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి కావాల్సిన ఆర్టీపీపీలో 22 ఎంయూలకు మించడం లేదు. జల విద్యుత్తు జాడ లేదు. ఇప్పటికైతే కొనుగోలుపైనే ఆశలు పెట్టుకున్నారు. వేసవిలో థర్మల్ విద్యుత్తు కేంద్రాలకు విపరీతమైన బొగ్గు కొరత ఏర్పడే పరిస్థితి ఉంది. అన్ని కేంద్రాల్లోనూ ప్రస్తుతం రెండు రోజులకు మించిన నిల్వలు లేకపోవడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తున్నాయి. మహానది కోల్‌ఫీల్డ్స్ (ఎంసీఎల్)లోని కొన్ని యూనిట్లను వేసవిలో నిలిపేస్తారు. దీంతో మరింత బొగ్గు కొరత తప్పదు. ఈ నెలాఖరు నుంచి ఏప్రిల్ వరకు రాష్ట్రంలో వ్యవసాయ విద్యుత్తు వినియోగం పెరుగుతుంది. గృహ, వాణిజ్య వినియోగం మార్చి ఆఖరు నుంచి రెట్టింపయ్యే అవకాశం ఉంది. దీంతో మార్చి ఆఖరుకు రాష్ట్రంలో విద్యుత్తు వాడకం 160 నుంచి 170 ఎంయూలకు చేరే వీలుంది. నిరంతర విద్యుత్తు ఇస్తామని చెప్పే ప్రభుత్వం దీన్ని ఎలా అధిగమించాలనే దానిపై కసరత్తు చేస్తోంది.
 నాలుగు జిల్లాల్లో కోతలు..

  • కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, జిల్లాల్లో పగలు విద్యుత్తు కోతలు విధిస్తున్నారు.
  • కృష్ణా జిల్లాల్లో గ్రామాల్లో రెండు గంటలు, మండల కేంద్రాల్లో గంట కోతలు అమలవుతున్నాయి.
  • నెల్లూరు జిల్లా పొదలకూరు, ఉదయగిరి, రాపూరు, ఆత్మకూరు, సూళ్లూరుపేట, ప్రాంతాల్లో పగలు 3-4 గంటల కోతలు అమలవుతున్నాయి.
  • ప్రకాశం జిల్లాలోని యర్రగొండపాలెం, మార్కాపురం, గిద్దలూరు, అద్దంకి, సంతమాగులూరు ప్రాంతాల్లోనూ కోతలు అమలవుతున్నాయి.
  • గుంటూరు జిల్లాలో రోజూ అరగంట నుంచి గంట వరకు విద్యుత్తు కోత విధిస్తున్నారు.

Back to Top