ఫిబ్రవరి ఆరు నుంచి మరో ప్రజాప్రస్థానం

హైదరాబాద్, 30 జనవరి 2013: 

జగనన్న వదిలిన బాణం.. శ్రీమతి వైయస్ షర్మిల మరో ప్రజాప్రస్థానం ఫిబ్రవరి ఆరో తేదీన తిరిగి ప్రారంభం కానుంది. దివంగత మహానేత తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిల రంగారెడ్డి జిల్లా ఇంజాపూర్ గ్రామం నుంచి యాత్రను పునఃప్రారంభిస్తారు.  వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ బుధవారం విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు.  డిసెంబర్ 14న బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం బస్సు దిగుతున్న సందర్భంలో తూలిపడిన శ్రీమతి షర్మిల మోకాలికి గాయమైన సంగతీ, శస్త్ర చికిత్స చేయించుకున్న విషయమూ తెలిసిందే. చికిత్స అనంతరం ఆరువారాలు విశ్రాంతి తీసుకున్న ఆమె ఫిజియోథెరపీ అనంతరం.. పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. అక్టోబరు 18న వైయస్ఆర్ జిల్లా ఇడుపులపాయలో మరో ప్రజాప్రస్థానాన్ని ప్రారంభించిన శ్రీమతి షర్మిల  58 రోజులలో 822 కిలోమీటర్లు నడిచారు. వైయస్ఆర్, అనంతపురం, కర్నూలు, మహబూబ్‌నగర్,  రంగారెడ్డి జిల్లాల్లో పాదయాత్ర సాగింది. డిసెంబర్ 19న ఆమెకు శస్త్ర చికిత్స నిర్వహించారు.

     శ్రీమతి షర్మిల ఆరువారాలపాటు పట్టుదలతో ప్రయత్నించడం వల్ల పాదయాత్రకు సిద్ధమయ్యారని వాసిరెడ్డి పద్మ విలేకరులకు తెలిపారు. ప్రజలకు భరోసా ఉండాలనే ధ్యేయంతో యాత్ర సాగుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీనీ దాన్ని రక్షించే టీడీపీని చూసి ప్రజలు నిరాశకు గురికాకుండా 'మంచిరోజులొస్తాయి.. జగనన్న వస్తాడు.. అన్ని పథకాలు అమలుచేస్తాడు' అనే భరోసా కల్పించడానికి ఆమె ఉద్యుక్తులవుతున్నారని పేర్కొన్నారు.  ప్రజలు తీవ్ర కష్టాల్లో ఉన్న సమయంలో ప్రతిపక్షనేతగా ఉండాల్సిన చంద్రబాబు కాంగ్రెస్ పక్ష నేతగా మారిపోయారని ఎద్దేవా చేశారు. ఆ పార్టీ నుంచి అనేకమంది ఎ మ్మెల్యేలు వైదొలగుతున్నారనీ, రాష్ట్రం అత్యంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ చంద్రబాబు ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట అనడం లేదనీ చెప్పారు. ఇంతటి విషమ పరిస్థితులలోనూ ఆయన పాదయాత్ర చేసుకుంటున్నారు తప్ప ఈ ప్రభుత్వంపై అవిశ్వాసం పెడతాననే హామీని ప్రజలకు ఇవ్వడం లేదన్నారు. ఈ ప్రజాకంటక ప్రభుత్వాన్ని కొనసాగేలా చూడాలని ఆయన నిర్ణయించుకున్నారన్నారు. 'ఓ పక్క ప్రభుత్వం ప్రజలపై భారాలామీద భారాలు వేస్తోంది. కక్ష గట్టినట్లు వ్యవహరిస్తోంది. ప్రజలకు అండగా నిలవాల్సింది పోయి చంద్రబాబు ప్రభుత్వానికి ఊతమిస్తున్నారని' ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన అవసరముందన్నారు. పార్టీ అధ్యక్షుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర చేసినన్ని రోజులూ ప్రజలలో తిరిగి వారికి భరోసా కల్పించారని పేర్కొన్నారు. కష్టాలు తీరుస్తారనే ధైర్యం ప్రజలకు ఉండేది. అక్రమ కేసులు పెట్టి ఆయనను జైలు పాలుచేసిన కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కును కొనసాగిస్తూ బెయిలు రాకుండా మోకాలొడ్డుతున్నారని పద్మ చెప్పారు. ఆయన ప్రతినిధిగా.. జగనన్న వదిలిన బాణంలా శ్రీమతి షర్మిల యాత్రను కొనసాగించనున్నారని చెప్పారు. వైయస్ఆర్ కుటుంబాన్ని తెలంగాణ ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారనడానికి ఆ జిల్లాల్లో శ్రీమతి షర్మిలకు లభించిన ఘనస్వాగతమే  తార్కాణమని చెప్పారు. తెలంగాణ ప్రజలు ముందు మాదిరిగానే షర్మిలకు బ్రహ్మరథం పడతారని పద్మ స్పష్టంచేశారు.
     ఇడుపులపాయ ప్లీనరీలో తెలంగాణపై ఏం చెప్పామో దానికే కట్టుబడి ఉన్నామని ఓ ప్రశ్నకు ఆమె బదులిచ్చారు. తెలంగాణ ప్రాంతంలో శ్రీమతి షర్మిలను అడ్డుకుంటారనే ఊహలకు అర్థం లేదన్నారు.  ఒకవేళ ఎవరైనా అలా ఆలోచిస్తే.. వారు ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. అఖిలపక్ష సమావేశం పెట్టినపుడు తెలంగాణపై కాంగ్రెస్ తన అభిప్రాయాన్ని చెప్పాలని కోరామన్నారు. అలా చెప్పకపోవడం వల్లే ప్రస్తుత పరిస్థితి ఉత్పన్నమైందని పద్మ అభిప్రాయపడ్డారు. ఆనాడే కాంగ్రెస్ తన అభిప్రాయాన్ని చెప్పి ఉంటే ఇప్పుడు మూడు ప్రాంతాల నేతల్ని, పీసీసీ అధ్యక్షుణ్ణి, ముఖ్యమంత్రిని కూర్చోబెట్టి మాట్లాడవలసిన అవసరం వచ్చి ఉండేది కాదని వివరించారు. ఈ కారణంగానే ఇప్పుడు కాంగ్రెస్ తప్పించుకోవడానికి అవకాశం ఏర్పడిందన్నారు.

Back to Top