ఫలించిన వైయస్‌ఆర్‌సిపి 'జలం కోసం జాగరణ'

అనంతపురం : వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ చేసిన 'జలం కోసం జాగరణ' పోరాటానికి ఫలితం వచ్చింది. పిఎబిఆర్ డ్యాం నుంచి ధర్మవరం కుడి‌ కాలువకు ప్రభుత్వం నీరు విడుదల చేసింది. దీనితో ప్రజల తాగు, సాగునీటి కోసం తమ పార్టీ చేసిన పోరాటానికి ఫలితం దక్కిందని పార్టీ సిఇసి సభ్యుడు వై. విశ్వేశ్వరరెడ్డి హర్హం వ్యక్తం చేశారు. పిఎబిఆర్‌ నుంచి నీరు విడుదల కావడంతో ప్రజలు, రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు.

 పిఎబిఆర్ డ్యాం నుంచి కుడి కాలువకు‌ ప్రభుత్వం రెండేళ్లుగా నీరు విడుదల చేయకుండా నిర్లక్ష్యం చేసిందని విశ్వేశ్వరరెడ్డి అన్నారు. దీంతో 43 చెరువులు ఎండిపోయి, వేలాది ఎకరాల ఆయకట్టు భూములు బీళ్లుగా మారాయన్నారు. బోర్లలో నీరు అడుగంటిపోవడంతో రైతులు పంటలు సాగు చేసుకోలేకపోయారని, తాగునీటి సమస్య తలెత్తిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రజల పక్షాన నిలిచి, కుడి కాలువకు నీటిని విడుదల చేయాలని,‌ గత డిసెంబర్ 15వ తేదీన పిఎబిఆర్ డ్యాం వద్ద పెద్ద ఎత్తున ‘జలం కోసం జాగరణ’ కార్యక్రమం నిర్వహించిందన్నారు. దీంతో దిగివచ్చిన ప్రభుత్వం ‌జనవరి 5న కుడి కాలువకు నీరు విడుదల చేసిందన్నారు. కాగా, తుంగభద్ర డ్యాం నుంచి పిఎబిఆర్ డ్యాంకు కేటాయింపుల మేరకు నీటిని విడుదల చేయించేందుకు మంత్రులు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. ప్రస్తుతం కుడికాలువకు కేటాయించిన 0.5 ‌టిఎంసి నీరు కాకుండా మరో టిఎంసి నీటిని విడుదల చేయాలని కోరారు.

చెరువులన్నింటినీ పూర్తి స్థాయిలో నీటితో నింపాలని విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. నామమాత్రంగా నీరు వదిలి చేతులు దులుపుకుంటే మళ్లీ పోరాటం చేస్తామని‌ ఆయన హెచ్చరించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో పోరాటానికి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సిద్ధంగా ఉందన్నారు.
Back to Top