గవర్నర్ దృష్టికి నోటు పాట్లు

  • క్యాష్‌లెస్‌..యూజ్‌లెస్‌
  • ముందు చూపు లేకుండా నోట్ల రద్దు 
  • మోడీ నిర్ణయంపై అధ్వాని సైతం అసంతృప్తి
  • నోట్ల కష్టాలు ఇలాగే కొనసాగితే ప్రజా ఉద్యమం తప్పదు
  • మంత్రులు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి
  • వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి తమ్మినేని సీతారాం
హైదరాబాద్‌: పెద్దనోట్ల రద్దుతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారని, ప్రత్యామ్నయ చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి తమ్మినేని సీతారాం మండిపడ్డారు. ప్రజల ఇబ్బందులు తొలగించే చర్యలు తీసుకోకుండా ఏపీ సీఎం చంద్రబాబు క్యాష్‌ లెస్‌ అంటూ యూజ్‌లెస్‌ వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. పార్టీ అధినేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నేతృత్వంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్‌ నాయకులు అంతా గవర్నర్‌ను కలిసి పరిస్థితిని వివరిస్తామని ఆయన చెప్పారు. శనివారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో తమ్మినేని సీతారాం మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం దేశ ఆర్థిక మూలాలను కుదిపేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. సామాన్యులు నగదు కోసం తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పనులు మానుకొని ప్రజలు బ్యాంకుల వద్ద పడిగాపులు కాస్తున్నారని, క్యూలో నిలబడి మృత్యువాత పడుతున్నారని తెలిపారు. 

సామాన్యుల ఇళ్లలో వివాహాలకు రూ.2.50 లక్షలు ఇప్పిస్తామంటున్న కేంద్రం ప్రభుత్వం.... పెద్ద నాయకుల బిడ్డల వివాహాలకు కోట్లు ఖర్చు పెట్టడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. ఇటీవల గాలి జనార్ధన్‌రెడ్డి తన కూతురు వివాహం అంగరంగ వైభవంగా నిర్వహించారని, అలాగే కేంద్ర మంత్రి గడ్కారి బిడ్డ పెళ్లి, మరో కేంద్ర మంత్రి కుమారుడి వివాహం ఎలా చేశారని నిలదీశారు. నల్ల కుభేరుల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని చెబుతున్న నేతలు, ఆ వివరాలు వెల్లడించాలని పట్టుబట్టారు. ఇటీవల పార్లమెంట్‌లో ఓ ఎంపీ నల్ల కుభేరుల జాబితా అడిగితే తనకు తెలియదని కేంద్ర ఆర్థిక మంత్రి చెప్పారంటే..నోట్లు రద్దు నిర్ణయం కూడా చీకట్లో బాణంలా ఉందని ఎద్దేవా చేశారు. ముందు చూపు లేకుండా నోట్లు రద్దు చేసిందని, కేంద్రం తక్షణమే పరిస్థితిని సమీక్షించాలని సీతారాం డిమాండ్‌ చేశారు.

బాబు శ్వేతపత్రం విడుదల చేయాలి
ఆంధ్రప్రదేశ్‌కు కొత్త కరెన్సీ ఎంత వచ్చిందో, ఏయే బ్యాంకులకు దాన్ని పంపారో చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయాలని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత తమ్మినేని సీతారాం డిమాండ్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్‌ మంత్రులు దొంగల ముఠాలా పంచుకు తింటున్నారని ఆయన ఆరోపించారు. టీడీపీ, బీజేపీ నాయకులు ఎక్కడా కూడా నగదు కోసం బ్యాంకుల వద్ద క్యూలో నిలబడలేదని తెలిపారు. లక్షల ఎకరాల భూములను పందారం చేస్తూ కోట్లు దండుకుంటున్నారన్నారు. నిరుపేదలకు ఎప్పుడైనా సెంటు భూమి ఇచ్చారా అని ప్రశ్నించారు. ఇక రాష్ట్ర మంత్రులు నోరు అదుపులో పెట్టుకోవాలని, అడ్డగోలుగా మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. నోట్ల ఇబ్బందులు ఇలాగే కొనసాగితే ఈనెల 31 తర్వాత ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడతామని తమ్మినేని సీతారాం హెచ్చరించారు. 
 
 
Back to Top