కేంద్రంపై మార్చి 21న అవిశ్వాస తీర్మానం

* హోదా ఛాంపియ‌న్ వైయ‌స్ఆర్‌సీపీనే
* బాబుకు తెలిసిపోయే కొత్త‌రాగం అందుకున్నారు
* ఆయ‌న‌ను ఎవ‌రూ న‌మ్మే ప‌రిస్థితి లేదు
* బీజేపీ క‌లిసి ఉండ‌మంటున్నా ఆ పార్టీని బాబు వ‌ద‌ల‌డం లేదు
* ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు అంత సీన్ లేదు
విజయవాడ: ఎవ‌రు ముందుకు వ‌చ్చినా.. రాక‌పోయినా తాము మాత్రం కేంద్ర ప్ర‌భుత్వంపై మార్చి 21న అవిశ్వాస తీర్మానం పెడ‌తామ‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి స్ప‌ష్టం చేశారు. బుధ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ చంద్ర‌బాబు నాయుడు, ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇద్ద‌రూ దొంగ‌నాట‌కాలు ఆడుతున్నార‌న్నారు. ప్ర‌త్యేక హోదా కోసం మొద‌టి నుంచి పోరాడుతున్న‌ది వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీనేన‌ని, ఈ విష‌యం చంద్ర‌బాబుకు ఇప్ప‌టికి అర్థ‌మై ఇప్పుడు కొత్త‌రాగం అందుకున్నార‌న్నారు. ప్ర‌త్యేక హోదా వ‌స్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంద‌ని, అందుకు ప్ర‌స్తుతం హోదా క‌లిగిన రాష్ట్రాలే సాక్ష్యం అన్నారు. గ‌త నాలుగేళ్లుగా ప్ర‌త్యేక ప్యాకేజీ జ‌పం చేసిన చంద్ర‌బాబుకు ఇప్పుటికి జ్ఞానోద‌యం అయిన‌ట్లుంద‌ని, ఇప్పుడు ప్ర‌త్యేక హోదా కావాలంటూ కొత్త రాగం అందుకున్నార‌న్నారు. చంద్ర‌బాబు ఏమీ చేసినా అత‌న్ని ప్ర‌జ‌లు న‌మ్మే పరిస్థితి లేద‌న్నారు. ప్ర‌త్యేక హోదా ఛాంపియ‌న్ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీనేన‌ని పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. గ‌తంలో కిర‌ణ్‌కుమార్ రెడ్డి కూడా చివ‌రి వ‌ర‌కు  రాష్ట్రం విడిపోదంటూ ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించార‌ని, చంద్ర‌బాబు కూడా నాలుగేళ్లుగా ప్యాకేజీ అని, ఇప్పుడు హోదా అన్నా బాబు మాట‌లు ఎవ‌రూ న‌మ్మ‌ర‌న్నారు. మీతో కలిసి ఉండ‌మ‌ని బీజేపీ తెగేసి చెబుతున్నా లేదు..లేదు మీరు నాతోనే ఉండాలంటూ సిగ్గులేకుండా ప్రాధేయ‌ప‌డుతున్నార‌న్నారు. చంద్ర‌బాబు నాయుడినే ఒప్పించ‌లేద‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇక ఇత‌ర రాష్ట్రాల ఎంపీల‌ను ఎలా ఒప్పించ‌గ‌ల‌డ‌ని ప్ర‌శ్నించారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు అంత సీన్ లేద‌ని పేర్కొన్నారు. 
Back to Top