పేదల పక్షాన నిలవని సర్కారిది

హెచ్ మురవని(మంత్రాలయం):

మరో ప్రజాప్రస్థానం ముప్పయ్యవ రోజు పాదయాత్ర ప్రారంభాన్ని పురస్కరించుకుని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైయస్ షర్మిల శుక్రవారం ఉదయం మంత్రాలయం నియోజకవర్గంలోని హెచ్. మురవనిలో గ్రామస్థులతో మాట్లాడారు. గ్రామస్థులు తమ కష్టాలను ఆమెకు చెప్పుకున్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సంక్షేమ పథకాలు అందటం లేదని మొరపెట్టుకున్నారు. వైయస్ హయాంలో తమకు ఉపాధి హామీ పథకంలో 120 రూపాయలు వేతనం అందేదనీ,  ఇప్పుడు 40 రూపాయలు మాత్రమే ఇస్తున్నారనీ వారు చెప్పారు. వృద్ధాప్య పింఛన్లు అందటం లేదనీ, రేషన్ సక్రమంగా ఇవ్వడం లేదనీ షర్మిలకు విన్నవించారు.
     ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ కొద్దికాలం ఓపిక పట్టాలని వారిని కోరారు. త్వరలో జగనన్న ముఖ్యమంత్రి అవుతారని అప్పుడు రాజన్న రాజ్యం ఆవిష్కృతమవుతుందని ఆమె భరోసా ఇచ్చారు. అందరికీ మేలు ఒనగూరుతుందని పేర్కొన్నారు. ప్రస్తుత సర్కారు వైయస్ కుటుంబంతో సహా ప్రజలను కూడా వేధిస్తోందని ఆరోపించారు. పేదల పక్షాన నిలబడని ప్రభుత్వమిదని ఆమె ధ్వజమెత్తారు. రెండు గంటలు కూడా కరెంటు ఇవ్వలేకపోతోందని విమర్శించారు. నేటి పాలకుల హయాంలో పేదలకు రుణాలు కూడా రావడం లేదన్నారు. ఎమ్మెల్యేలు టి. బాలనాగిరెడ్డి, భూమా శోభా నాగిరెడ్డి, గౌరు వెంకటరెడ్డి, గౌరు చరిత ఆమె వెంట ఉన్నారు.

Back to Top