పాడి పశువులను అమ్ముకోవాల్సిన దుస్థితి వచ్చింది

పెంజర్ల (మహబూబ్‌నగర్ జిల్లా), 11 డిసెంబర్‌ 2012: పాలసేకరణకు హాలిడే ప్రకటించడంతో తాము పాడి పశువులను అమ్ముకోవాల్సిన దుస్థితి ఎదురైందని మహిళలు, రైతులు శ్రీమతి షర్మిల ముందు వాపోయారు. పాలమూరు జిల్లా షాద్‌నగర్‌ నియోజకవర్గంలోని పెంజర్లలో మంగళవారం ఆమె నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో వారంతా తమ గోడు వినిపించి ఆవేదన చెందారు. మిల్కు హాలిడే ప్రకటించి పాలసేకరణ ధరను తగ్గించారన్నారు. ఎరువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని, అయినా ఏదో విధంగా కొని పంటలు పండించాలని చూస్తే మార్కెట్‌లో దొరకడంలేదన్నారు. ఈ కారణంగా పంటలు కూడా వేయడం మానుకోవాల్సి వచ్చిందని విలపించారు. అటు పాడి పరిశ్రమ నష్టాల్లో కూరుకుపోయి, ఇటు వ్యవసాయమూ లేక తమ బతుకులు దుర్భరంగా మారిపోయాయని శ్రీమతి షర్మిల వద్ద వాపోయారు. పావలా వడ్డీ రుణాలు ఇవ్వడంలేదని మహిళలు చెప్పారు. ఆరోగ్యశ్రీ పథకం అందుబాటులో లేదని పెంజర్ల గ్రామస్తులు గోడు వెళ్లబోసుకున్నారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ త్వరలోనే జగనన్న వస్తారు, రాజన్న రాజ్యం తెస్తారన్నారు. అందరి సమస్యలూ పరిష్కరిస్తారని భరోసా ఇచ్చారు. అంతవరకూ ఓపిక పట్టండని కోరారు.
Back to Top