పాదయాత్రకు నీరా‘జనం’

మంగళగిరి: వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి జైలు నుంచి విడుదల కావాలని కోరుతూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మేరుగ నాగార్జున, ఆర్కే చేపట్టిన పాదయాత్రకు మంగళగిరిలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. అమృతలూరు మండలం కూచిపూడి నుంచి గుణదల మేరీమాత ఆలయం వరకు చేపట్టిన పాదయాత్ర మంగళవారం రాత్రి ఆత్మకూరులో విడిది చేసిన సంగతి తెలిసిందే. బుధవారం ఉదయం గ్రామం నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. ఈ సందర్భంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మాట్లాడుతూ రాజకీయ కక్షతోనే జగన్‌ను అరెస్టు చేశారన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి త్వరలో బెయిల్‌పై విడుదలవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. జననేతను అప్రజాస్వామిక పద్ధతిలో జైల్లు పెట్టారని ఆరోపించారు. రాష్ట్రంలో పాలన అగమ్యగోచరంగా మారిందన్నారు. సమస్యలు చుట్టుముడుతున్నా కాంగ్రెస్ సర్కారు మిన్నకుండిపోయిందని విమర్శించారు. పంచాయతీ కార్యాలయం వద్ద వైయస్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. దళితవాడ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం భారీ ర్యాలీగా పాదయాత్ర కొనసాగింది. వీవర్స్ కాలనీ, ద్వారకానగర్, వడ్లపూడి సెంటర్ (రాజీవ్ సెంటర్) చేరుకుంది. బాప్టిస్టుపేట, మిద్దెసెంటర్, మెయిన్ బజార్ గుండా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం చేరుకుంది. పార్టీ నేతలు ఆర్కే, మేరుగ నాగార్జున, ఈపూరి అనూప్ శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో పూజలు నిర్వహించారు.

దైవబలం తోడు కావాలి: ఆర్కే
ఉపఎన్నికల్లో ప్రజాతీర్పు జగన్‌మోహన్‌రెడ్డికి అనుకూలంగా వచ్చిందని, న్యాయస్థానం తీర్పు కూడా అదే విధంగా ఉంటుందన్నారు. జగన్ బెయిల్‌పై విడుదల కావాలని కోరుతూ వేమూరు నుంచి గుణదల మేరిమాత ఆలయం వరకు అన్ని మతాల దేవుళ్లను ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. ప్రజాబలంతోపాటు దైవబలం కూడా జగన్ పొందాలని ఈ పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు చెప్పారు. న్యాయవ్యవస్థపై తమకు అపారమైన నమ్మకం ఉందన్నారు. తమకు తప్పక న్యాయం జరుగుతుందని విశ్వాసం వ్యక్తంచేశారు. మేరుగ నాగార్జున మాట్లాడుతూ, జగన్‌మోహన్‌రెడ్డికి ఉన్న ప్రజాబలాన్ని తట్టుకోలేక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జననేతను అణగదొక్కేందుకు తప్పుడు కేసుల్లో ఇరికించాయని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తొత్తుగా మారిన సీబీఐ మూడునెలలకు ఒక చార్జిషీటు దాఖలు చేస్తోందన్నారు. న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందని, ఈనెల 28న సుప్రీం కోర్టు జగన్‌కు బెయిల్ మంజూరు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం బస్టాండ్ సెంటర్ చేరుకుని జగ్జీవన్‌రామ్, వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు, అంబేద్కర్ సెంటర్‌లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పాదయాత్ర ముందుకు సాగింది.
జగన్ కోసం ప్రత్యేక ప్రార్థనలు..
విజయవాడ: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను అమలుపరిచే సత్తా ఉన్న నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి అని వైయస్ఆర్ సీపీ గుంటూరు జిల్లా నాయకుడు మేరుగ నాగార్జున చెప్పారు. జగన్ అక్రమ అరెస్టుకు నిరసనగా, ఆయన విడుదల కోరుతూ గుంటూరు జిల్లా నాయకులు నాగార్జున, ఆర్కే మంగళవారం వేమూరు నియోజకవర్గం నుంచి చేపట్టిన పాదయాత్ర బుధవారం గుణదలలోని మేరీమాత పుణ్యక్షేత్రంలో ముగిసింది. ఈనెల 28న వెలువడే కోర్టు తీర్పు జగన్‌కు అనుకూలంగా రావాలనే ఉద్దేశంతో దాదాపు 60 కిలోమీటర్ల దూరం పాదయాత్ర నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం వారు మేరీమాత ప్రధానాలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పుణ్యక్షేత్ర రెక్టర్ ఫాదర్ ఎం.చిన్నప్ప, ఫాదర్ ప్రసాద్ తదితర గురువులు పాదయాత్ర నిర్వాహకులను, వైయస్ఆర్ సీపీ నాయకులను, కార్యకర్తలను ఆశీర్వదిస్తూ ప్రార్థనలు చేశారు. జగన్‌మోహన్‌రెడ్డి త్వరలో విడుదల కావాలని కోరుతూ దీవించారు.

పాదయాత్రగా నగరానికి వచ్చిన నాయకులకు విజయవాడ ప్రకాశం బ్యారేజి వద్ద ఘనస్వాగతం లభించింది. ఏలూరు రోడ్డులోని పార్టీ జిల్లా కార్యాలయంలో వైయస్ విగ్రహానికి పూలమాలలు వేశారు. మాచవరం దాసాంజనేయస్వామి ఆలయం వద్ద వీరికి పార్టీ రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్ ఎం.వి.ఎస్.నాగిరెడ్డి, నాయకుడు పూనూరు గౌతమ్‌రెడ్డి, ఆలయ చైర్మన్ సుధాకర్ తదితరులు స్వాగతం పలికారు. ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు.

Back to Top