టెండర్లు, లావాదేవీల మీద విచారణకు సిద్ధమా..!

హైదరాబాద్) అసత్యపు ఆరోపణలు చేస్తున్న మంత్రి దేవినేని ఉమ కు పబ్లిక్ అకౌంట్స్
కమిటీ ఛైర్మన్, వైయస్సార్సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బహిరంగ సవాల్
విసిరారు. మంత్రి పదవి స్వీకరించినప్పటి నుంచి ఇప్పటిదాకా జరిగిన టెండర్లు, ఇతర
లావాదేవీలకు సంబంధించి సమగ్ర విచారణకు సిద్దమా అని సూటిగా ప్రశ్నించారు. బయట
వారిని పక్కన పెట్టేస్తే, స్వయంగా తెలుగుదేశం ఎంపీ సీఎం రమేష్ అవుకు టెండర్ల లో 44
కోట్ల రూపాయిల గోల్ మాల్ జరిగిందని ఆరోపించారన్న విషయాన్ని గుర్తు చేశారు.
హైదరాబాద్ లోటస్ పాండ్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
మీడియాతో మాట్లాడారు.

        కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం చెరువుపల్లిలో తాను భూములు ఆక్రమిస్తున్నట్లు ఆరోపిస్తున్నారని, ఆ భూముల వ్యవహారం ప్రస్తుతం కోర్టులో ఉందని ఆయన చెప్పారు. ప్రభుత్వం చట్ట ప్రకారం వ్యవహరిస్తే భూములు ఇవ్వడానికి తాము సిద్ధమని చెప్పారు.  కాలవల తవ్వకాలకు తాను
అడ్డుపడుతున్నట్లు మంత్రి దేవినేని ఉమ చెప్పటాన్ని ఎమ్మెల్యే రాజేంద్రనాథ్ రెడ్డి
ఖండించారు. భూమిని ఇచ్చేందుకు అక్కడ అంతా సిద్ధమే అని, అయితే ఆ ప్రక్రియ
న్యాయబద్దంగా ఉండాలని, నిబంధనలు పాటిస్తూ చట్టబద్దంగా స్వాధీనం చేసుకోవాలని మాత్రమే
తాము కోరుతున్నామని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు కోర్టులో దాఖలైన అఫిడవిట్లు
చదువుకోవాలని ఆయన సూచించారు. నిబంధనల ప్రకారం పరిహారం చెల్లించి, స్వాధీనం
చేసుకొంటే ఎవరూ అభ్యంతరం చెప్పరని పేర్కొన్నారు. అంతేగానీ, నిబంధనలకు తూట్లు
పొడిచి, భూములు లాక్కొనే ప్రయత్నాల్ని తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. ఇది
సామాన్య పౌరులందరికీ రాజ్యాంగబద్దంగా ఉన్న హక్కు అని ఆయన గుర్తు చేశారు. భూములు
లాక్కోవటం ఏ రకంగా జరుగుతోందో తెలుసుకోవాలంటే రాజధాని ప్రాంతాన్ని కానీ, భోగాపురం
ఎయిర్ పోర్టు ప్రాంతాన్ని కానీ సందర్శిస్తే తెలుస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.
అసలు ఇన్ని ఆరోపణలు చేస్తున్న మంత్రి దేవినేని ఉమకు ఒకే ఒక్కసవాల్ ఇస్తున్నానని,
ఆయన పదవి స్వీకరించినప్పటి నుంచీ ఇప్పటిదాకా జరిగిన లావాదేవీల మీద విచారణకు
సిద్ధమా అని సూటిగా ప్రశ్నించారు.

        దేవినేని ఉమ బాధ్యతలు
స్వీకరించినప్పటి నుంచీ కాలువ గట్టుల మీద నిద్ర అంటూ హడావుడి చేస్తున్నారని ,
అయితే అక్కడ జరుగుతున్నది మరొకటి అని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విశ్లేషించారు.
పదే పదే కర్నూలు జిల్లాకు మంత్రి దేవినేని ఉమ పర్యటనలు పెడుతుంటే దిగువ ఉన్న
అధికారులు అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు. తాగునీటి బాటిళ్లు, ఆహార పదార్థాలు
సరఫరా చేయలేక సతమతం అవుతున్నారని అధికారులు తమతో ఆవేదన వెలిబుచ్చారని చెప్పారు. అంతెందుకు
మంత్రి దేవినేని ఉమ ఇంట్లోనే ఆరడుగుల స్థలాన్ని రోడ్ల విస్తరణ పేరుతో నిబంధనలు
పాటించకుండా బుల్ డోజర్లతో వచ్చి కూల్చేస్తే ఏం చేస్తారని ప్రశ్నించారు. బాధ్యతగల
పదవిలోఉండి బాధ్యతా రాహిత్యంగా విమర్శలు చేయటం సరికాదని బుగ్గన రాజేంద్రనాథ్
రెడ్డి హితవు పలికారు.  మంత్రి దేవినేని ఉమా అవినీతి గురించి గంటల కొద్దీ మాట్లాడొచ్చని.. ఒకవైపు ఆయన ప్రజల భూములు ఆక్రమిస్తూ తనపై ఆరోపణలు చేస్తారా అని నిలదీశారు.

Back to Top