కాంగ్రెస్‌తో కుమ్మక్కై అవినీతిపై పోరాటమా?

నల్లజెర్ల (గోపాలపురం నియోజకవర్గం) 19  మే  2013: ఒక పక్క కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోకుండా కాపాడుతూ ఇంకో పక్క అవినీతిపై పోరాటం చేస్తానంటున్న చంద్రబాబును ఏమనాలి? అని శ్రీమతి వైయస్ షర్మిల ప్రశ్నించారు. చంద్రబాబు చరిత్రహీనుడుగా మిగిలిపోతారని ఆమె వ్యాఖ్యానించారు. చిరంజీవి 'ప్రజారాజ్యం' పార్టీని రాసిచ్చినట్లుగానే చంద్రబాబు కూడా టీడీపీని కాంగ్రెస్ పార్టీకి రాసిచ్చేశారని ఆమె వ్యంగ్యంగా అన్నారు.

'మరో ప్రజాప్రస్థానం'లో భాగంగా ఆదివారం సాయంత్రం పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం నల్లజెర్లలో జరిగిన ఒక భారీ బహిరంగసభలో శ్రీమతి షర్మిల ప్రసంగించారు. 

చంద్రబాబు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని  కాపాడుతున్నారని ఆమె ఆరోపించారు. అవిశ్వాస తీర్మానానికి టీడీపీ మద్దతిచ్చివుంటే ప్రభుత్వం పడిపోయేదని, అప్పుడు ప్రజలకు చార్జీల మోత తప్పేదని ఆమె అన్నారు. అన్ని రంగాల్లోనూ విఫలమైన కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ప్రజల నెత్తిన చార్జీల పెంపుతో మోయలేని భారం మోపిందని శ్రీమతి షర్మిల విమర్శించారు. ఇలాంటి ప్రజావ్యతిరేక ప్రభుత్వం కొనసాగుతున్న పాపం చంద్రబాబుదేనన్నారు. దివంగత మహానేత రాజశేఖర్ రెడ్డిగారి హయాంలో ఒక్క రూపాయి కూడా చార్జీలేవీ పెంచకుండానే అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేసి చూపించారన్నారు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం ప్రజాకంటకంగా మారిందన్నారు.

"కరెంటు చార్జీలు అమాంతం పెంచారు. ఎక్కడా కరెంట్ లేదు. వ్యవసాయానికి మూడు గంటలే కరెంటు ఇస్తున్నారు. గ్రామాలకు నాలుగైదు గంటలు కూడా కరెంటు లేదు. పరిశ్రమలకైతే సగం రోజులు పవర్ కట్. వేల కొద్దీ పరిశ్రమలు మూతబడ్డాయి. లక్షలాది మంది ఉద్యోగాలు పోయాయి. అక్కడికి తామేదో బ్రహ్మాండంగా కరెంటు ఇస్తున్నట్లు రూ. 30 వేల కోట్లని కరెంట్ చార్జీల రూపంలో ప్రజల నెత్తిన మోపారు"  అని శ్రీమతి షర్మిల విమర్శించారు. వ్యవసాయానికి నీరు లేక వేసిన ప్రతిపంట వల్లా నష్టం వస్తోందని ప్రతి రైతూ బాధపడుతున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ దుర్మార్గపు పాలనకు నిరసనగా ప్రతిపక్షాలన్నీ కలిసి అవిశ్వాసం పెడితే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అయి ఉండి కూడా చంద్రబాబు  ప్రభుత్వంపై ఈగ కూడా వాలకుండా విప్ జారీ చేసి మరీ కూలిపోకుండా కాపాడారన్నారు. అసెంబ్లీలో బలం లేక కిరణ్ ప్రభుత్వం మైనారిటీలో పడిందని ఆమె అన్నారు. ప్రభుత్వానికి కావాల్సిన బలం 148 కాగా కిరణ్ కుమార్ రెడ్డి సర్కారుకు ఉన్న మద్దతు 146 మంది ఎమ్మెల్యేలేనన్నారు. "మరి మైనారిటీలో ఉన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా కొనసాగుతోంది? చంద్రబాబు మద్దతుతో కాదా?" అని శ్రీమతి షర్మిల ప్రశ్నించారు. అసెంబ్లీలో అవిశ్వాసతీర్మానం వచ్చిన రెండు సార్లూ చంద్రబాబు నాయుడు ఈ ప్రభుత్వాన్ని కాపాడారన్నారు. 

తన అక్రమాలపై విచారణ జరగకుండా ఉండాలనే చంద్రబాబు నిస్సిగ్గుగా కాంగ్రెస్ ప్రభుత్వంతో కుమ్మక్కయ్యారని  ఆమె ఆరోపించారు. పైగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్‌తో కుమ్మక్కు అయిందంటూ చంద్రబాబు అసత్యపు ఆరోపణలు చేస్తున్నారన్నారు. నిజంగానే కాంగ్రెస్ పార్టీతో వైయస్ఆర్ కాంగ్రెస్ కుమ్మక్కయివుంటే జగన్ జైల్లో ఉండేవారా? అని ఆమె ప్రశ్నించారు. శ్రీ జగన్ కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కయి ఉంటే ఏ కేంద్ర మంత్రో, ముఖ్యమంత్రో అయి ఉండేవారన్నారు. ఒక పక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలిపోకుండా కాపాడుతూ ఇంకో పక్క అవినీతిపై పోరాటం చేస్తానంటున్న చంద్రబాబును ఏమనాలి? అని ఆమె నిలదీశారు.

కాంగ్రెస్ పార్టీలో ఉన్న చంద్రబాబు నాయుడు అది ఓటమి పాలయ్యాక అధికారంలో ఉన్న టీడీపీలోకి దూకితే, పలువురు ఎమ్మెల్యేలు, నేతలు నేడు శ్రీ జగన్ విశ్వసనీయత చూసి అధికారంలో లేని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి చేరుతున్నారని శ్రీమతి షర్మిల అన్నారు. చంద్రబాబుకు విశ్వసనీయత కొరవడినందు వల్ల ఎమ్మెల్యేలు మనస్సాక్షిని చంపుకోలేక, విలువలకు కట్టుబడి టీడీపీని వీడుతున్నారన్నారు.

శ్రీ జగన్ బయటకు వచ్చి రాజన్నరాజ్యం దిశగా నడిపిస్తారని ఆమె భరోసా ఇచ్చారు. వికలాంగులకు, వృద్ధులకు, విద్యార్థులకు సంక్షేమ పథకాలు అమలు చేస్తారని ఆమె హామీ ఇచ్చారు.
Back to Top