స్పీకర్ వ్యక్తిగత కక్షలకు అధికారుల సహకారం

గుంటూరు: వ్యక్తిగత కక్షలు తీర్చుకునేందుకు స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు, ఆయన కుమారుడు శివరామకృష్ణ చేస్తున్న అరాచకాలకు అధికారులు సహకరించటం దారుణమని ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చెప్పారు. అధికార పార్టీ ఒత్తిడి మేరకే నల్లపాటి లక్ష్మీనారాయణ అపార్టుమెంట్‌ భవన నిర్మాణం కూల్చివేత పని చేపట్టారని తెలిపారు.  అపార్టుమెంట్‌ నిర్మాణంలో పురపాలకశాఖ అధికారులు ఇచ్చిన నోటీసులపై హైకోర్టు స్టే ఇచ్చి నిర్మాణం చేసుకోవచ్చని ఆదేశాలున్నా మున్సిపల్‌ అధికారుల దౌర్జన్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు. సోమవారం పట్టణంలోని రామిరెడ్డిపేటలో ప్రముఖ న్యాయవాది నల్లపాటి లక్ష్మీనారాయణ నిర్మిస్తున్న అపార్టుమెంట్‌ను కూల్చివేతకు వచ్చిన అధికారులను నిలువరించినందుకు ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డితో పాటు జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, గుంటూరు నగర అధ్యక్షుడు లేళ్ళ అప్పిరెడ్డి, గురజాల నియోజకవర్గ సమన్వయకర్త కాసు మహేష్‌రెడ్డిలను బలవంతంగా అదుపులోకి తీసుకొని ఫిరంగిపురం పోలీస్టుస్టేషన్‌కు తరలించారు.


ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోపిరెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ రోడ్డు విస్తరణకు ప్రైవేటు స్థలం ఇవ్వాలంటే ల్యాండ్‌ అక్విజేషన్‌ చేసుకొని నష్టపరిహారం చెల్లించాల్సి ఉందన్నారు. ఈ మేరకు అధికారులకు హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. హైకోర్టులో మున్సిపల్‌ అధికారులు తప్పు తమదే అంటూ నోటీసులను వెనక్కు తీసుకున్నారని వెల్లడించారు. ఇప్పుడు అపార్టుమెంట్‌ నిర్మాణానికి ప్లాన్‌ అప్రూవల్‌ లేదంటూ నోటీసులు ఇచ్చామని అధికారులు చెబుతున్నారన్నారు. ఒకవైపు రోడ్డు వైడెనింగ్‌ అంటున్నారని, మరోవైపు భవన నిర్మాణానికి అనుమతిలేదని పొంతనలేని సమాధానాలు చెబుతున్నారని పేర్కొన్నారు. నిజానికి ఆన్‌లైన్‌ ద్వారా అనుమతి తీసుకున్న తర్వాతనే నిర్మాణం చేపట్టారని స్పష్టం చేశారు. సోమవారం డిమాలిషన్‌ నోటీసు ఇచ్చారన్నారు. నోటీసు ఇచ్చిన తర్వాత యజమాని తన జవాబు చెప్పుకునేందుకు కనీసంగా వారం రోజుల సమయం ఉంటుందన్నారు.  అధికార పార్టీ ఒత్తిళ్ల మేరకు నడుచుకుంటున్న  మున్సిపల్‌ అధికారులను వదిలిపెట్టబోమని హెచ్చరించారు. కోర్టులో వారు సంజాయిషీ చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. ఈ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదని, అధికారులు చేస్తున్న పనులను ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం మారిన తర్వాత ఏపీలోనే ఈ అధికారులు పనిచేయకుండా ప్రజలు చేస్తారని ధ్వజమెత్తారు. 
Back to Top