రాష్ట్రంలో జగన్‌ పర్యటన : పార్టీ ఎమ్మెల్యేలు

హైదరాబాద్ :

వైయస్ఆర్ కాంగ్రె‌స్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి బెయిల్‌పై రావడంతో రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయని, రాష్ట్రమంతా పండుగ వాతావరణం నెలకొందని పార్టీ ఎమ్మెల్యేలు చెప్పారు. శ్రీ జగన్ రాష్ట్రమంతా పర్యటించాలని, తమ బాగోగులు చూడాలని ప్రజలు కోరుకుంటున్నారని, కోర్టు అనుమతితో తమ పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర పర్యటన చేపడతారని వారు వివరించారు. రాష్ట్ర సమైక్యత‌ కోసం అన్ని ప్రాంతాల ప్రజలు శ్రీ వైయస్ జగ‌న్‌పై ఎంతో నమ్మకంతో విశ్వాసంతో ఉన్నారని చెప్పారు. ప్రజల కష్టసుఖాలు, మనోభావాలు తెలిసిన వ్యక్తిగా శ్రీ జగన్ రాక‌ కోసం రాష్ట్రమంతా వేయికళ్లతో ఇన్నాళ్లూ ఎదురుచూసిందన్నారు. అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, ప్రసన్నకుమార్‌రెడ్డి, అమర్‌నాథ్‌రెడ్డి, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, వెంకటరామిరెడ్డి, గొట్టిపాటి రవికుమార్, గుర్నాథరెడ్డి, బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, మద్దాలి రాజేష్‌కుమార్, జోగి రమేష్‌ మంగళవారం మీడియాతో మాట్లాడారు.

‘శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి బయటకు రావడంతో రాష్ట్రంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ రాష్ట్రానికి గట్టి నాయకత్వం కోసం ప్రజలంతా ఎదురుచూస్తున్నారు. అలాంటి నేత శ్రీ జగనేనని రాష్ట్రమంతా విశ్వసిస్తోంది. ప్రజల మనోభావాలు తెలిసిన వ్యక్తిగా, తమ కష్టాలను తీర్చే నేతగా వారంతా శ్రీ జగన్‌నే కోరుకుంటున్నారు’ అని శ్రీకాంత్‌రెడ్డి చెప్పారు. రాష్ట్రంలోని సమస్యలు సరిదిద్ది ప్రజల కోసం పాటుపడే వ్యక్తి రావడం సంతోషకరమని వ్యాఖ్యానించారు.

టిడిపి, కాంగ్రెస్ పార్టీలు కుట్ర‌ పన్ని శ్రీ జగన్‌పై అక్రమ కేసులు మోపి జైలు పాలు చేశాయని, ఏనాటికైనా సత్యం, ధర్మమే జయిస్తాయని నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రం ఇప్పుడు ఈ దుస్థితికి చేరడానికి సోనియా గాంధీ ఇతర ఢిల్లీ పెద్దలతో చంద్రబాబు చేసుకున్న చీకటి ఒప్పందాలే కారణమని దుయ్యబట్టారు. వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ తొలి‌ నుంచీ రాష్ట్ర సమైక్యతకే కట్టుబడి ఉందని స్పష్టంచేశారు.

తెలంగాణలో వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ చెక్కుచెదరలేదని బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పారు. కాగా,‌ శ్రీ జగన్‌కు బెయిల్ రా‌వడంతో అసెంబ్లీ ఆవరణలో వైయస్ఆర్‌ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇతర ‌నాయకులతో మంగళవారం సందడి నెలకొంది. వైయస్ఆర్ కాంగ్రె‌స్ ఎమ్మెల్యేలు ‌మిఠాయిలు పంపిణీ చేసి ఆనందాన్ని పంచుకున్నారు.

తాజా వీడియోలు

Back to Top