ప్రజల్ని కొనలేవు చంద్రబాబూ..!

() కరువు, ఇతర సమస్యల మీద ఉద్యమ కార్యాచరణ

() సీఎమ్ఎస్ సర్వే ఒక బూటకం

() అన్నీ సవ్యంగా ఉంటే ఎన్నికలకు వెళదామా

() చంద్రబాబుకి వైఎస్సార్సీపీ ప్రతినిధి అంబటి రాంబాబు సవాల్

హైదరాబాద్) కోట్ల రూపాయిలతో ఎమ్మెల్యేలను కొనగలరేమో కానీ, ప్రజల్ని కొనలేరని
వైఎస్సార్సీపీ అధికారప్రతినిధి అంబటి రాంబాబు అభిప్రాయ పడ్డారు. చంద్రబాబు బంధువుల
సంస్థ అయిన సీఎమ్ఎస్ చేసిన సర్వే సత్య దూరం అని ఆయన విశ్లేషించారు. హైదరాబాద్ లోని
పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

సమస్యల మీద పోరుబాట

 కరవు సహా రాష్ట్ర ప్రజలు
ఎదుర్కొంటున్న ప్రాథమిక సమస్యల మీద ఉద్యమాన్ని నిర్మించేందుకు వైఎస్సార్సీపీ సమాయత్తం
అవుతోంది. ఈ మేరకు ఈ నెల 19న పార్టీలో జిల్లా అధ్యక్షులు, ఇన్ ఛార్జీలతో
అధ్యక్షులు వైఎస్ జగన్ అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేసుకొన్నట్లు   అంబటి
రాంబాబు వెల్లడించారు. సమస్యలు తీర్చకుండా ప్రభుత్వం... ప్రజల ద్రష్టిని పక్కకు
మళ్లించే పనులు చేపడుతోందని ఆయన వివరించారు. ఉద్యమానికి సంబంధించిన కార్యాచరణ
ప్రణాళిక ఈ నెల 19 న ఖరారు అవుతుందని అంబటి వివరించారు.

సీఎమ్ఎస్ సర్వేకు విశ్వసనీయత లేదు

ఇటీవల సర్వే చేశామని చెబుతున్న సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ సంస్థ చంద్రబాబు
బంధువులకు సంబంధించినది అని అంబటి చెప్పారు. అందులో చంద్రబాబుకి ప్రత్యామ్నాయం
లేదని, ఆయన పనితీరు బ్రహ్మాండం అని రాయించుకోవటంలో తప్పేమీ లేదని అన్నారు. ఇదంతా
ప్రజలకు భ్రాంతి కల్పించటం మాత్రమే అని ఆయన వివరించారు. అటువంటప్పుడు మా
పార్టీలోకి రండి రండి అని ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ఆహ్వానించటం ఎందుకు అని ఆయన
సూటిగా ప్రశ్నించారు. ఇదే సీఎమ్ ఎస్ సంస్థ 2004 ఎన్నికలకు ముందు సర్వే చేసి
ఫలితాలు ప్రకటించిందని గుర్తు చేశారు. మూడోసారి కూడా చంద్రబాబు ముఖ్యమంత్రి
కాబోతున్నాడని, బాబు హ్యాట్రిక్ చేయబోతున్నాడని డబ్బా కొట్టిందని, దీన్ని బట్టి ఆ
సంస్థ చేసే సర్వేల విశ్వసనీయత అర్థం అవుతుందని చెప్పారు.

అవినీతి పరంపర

          భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి
చేయని విధంగా నైతిక విలువల్ని మంట కలుపుతున్నారని అంబటి మండిపడ్డారు. సీఎం
కార్యాలయంలోనే పచ్చ కండువాలు కప్పి ఆహ్వానిస్తున్నారని చెప్పారు. ప్రత్యామ్నాయమే
లేని ముఖ్యమంత్రి అయితే ఈ తతంగం ఎందుకు అని ప్రశ్నించారు. డీఎస్సీ నుంచి డీజీపీ
దాకా అంతా సొంత మనుషులే అని, అవినీతి ద్వారా కోట్లు సంపాదించారని అంబటి చెప్పారు.
గూడ్సు రైళ్లతో పంపించుకోగలిగినంత సొమ్ముల్ని కూడబెట్టకొన్నారని అంబటి ఎద్దేవా
చేశారు. నిజంగా అంతటి పలుకుబడి ప్రజల్లో ఉంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామాలు
చేయించి ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు. ప్రజల్లోకి వెళితే గెలిచే ధైర్యం
లేదన్న సంగతి తెలుసు కాబట్టే చంద్రబాబు మాట్లాడటం లేదని వ్యాఖ్యానించారు. ప్రజలకు
ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, జనానికి ఉపయోగపడే కొత్త పథకాలేవీ తీసుకొని రాలేదని
అంబటి విశ్లేషించారు. అటువంటప్పుడు అంతా తన వైపే ఉన్నారని సర్వేలు చేయించి, లీకులు
ఇవ్వటం భ్రాంతికి గురిచేయటం మాత్రమే అని ఆయన అన్నారు.

          ధైర్యం ఉంటే పార్టీ మారిన
ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి సైకిల్ గుర్తు మీద పోటీ చేయించాలని డిమాండ్ చేశారు.
ఎమ్మెల్యేలను కొనగలరేమో కానీ ప్రజల్ని 
కొనలేరని ఆయన వ్యాఖ్యానించారు.

          

Back to Top