'నిజమైన నాయకుడైతే అవిశ్వాసం పెట్టాలి'


తిమ్మాపురం (గుంటూరు జిల్లా)
, 11 మార్చి 2013 : రాష్ట్ర ప్రజలు పడుతున్న కష్టాలపై ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు అవగాహన లేదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్ రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల విమర్శించారు. చంద్రబాబు నిజమైన నాయకుడే అయితే ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న రాష్ట్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని ఆమె సవాల్ ‌చేశారు.

ప్రజాకంటక కాంగ్రెస్‌ ప్రభుత్వం, దానితో అంటకాగుతూ స్వార్థం కోసం మద్దతుగా నిలుస్తున్న చంద్రబాబు తీరుకు నిరసనగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్ రెడ్డి తరఫున ఆయన సోదరి శ్రీమతి షర్మిల నిర్వహిస్తున్న మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర చేస్తున్నారు. పాదయాత్రలో భాగంగా శ్రీమతి షర్మిల సోమవారం గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలోని తిమ్మాపురంలో పర్యటించారు. ఈ సందర్భంగా తిమ్మాపురంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో శ్రీమతి షర్మిల మాట్లాడారు.

విద్యుత్‌ చార్జీల పేరుతో ముఖ్యమంత్రి కిరణ్ కుమా‌ర్ రెడ్డి ‌రాష్ట్ర ప్రజలపై రూ.35 వేల కోట్లు భారం మోపారని శ్రీమతి షర్మిల తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రచ్చబండలో స్థానిక మహిళల నుంచి శ్రీమతి షర్మిల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పన్నుల పేరుతో పేదలపై పెను భారం వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ గ్రామాల్లో రోజుకు కేవలం మూడు గంటలు మాత్రమే కరెంటు సరఫరా చేస్తున్నారని, బిల్లులు మాత్రం రూ. 500 పైచిలుకు వస్తున్నాయని రచ్చబండ కార్యక్రమంలో స్థానిక మహిళలు శ్రీమతి షర్మిల ముందు వాపోయారు. మంచినీళ్ళు ఉండడంలేదని, రోడ్లు బాగోలేదన్నారు. శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే తమ బతుకులు బాగుపడతాయన్న ఆశాభావాన్ని వారు వ్యక్తం చేశారు. శ్రీమతి షర్మిల పాదయాత్ర విజయవంతం కావాలని స్థానికులంతా అభిలషించారు. టిడిపి, కాంగ్రెస్‌ పార్టీలు రాష్ట్ర ప్రజలను నిలువునా మోసం చేశాయని స్థానిక వృద్ధురాలు ఒకరు నిప్పులు చెరిగారు.
Back to Top