వైయస్‌ఆర్‌సీపీలోకి వలసల వెల్లువ

 హైదరాబాద్‌: బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ప్రజాసమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తూ.. ప్రజల వెంట నడుస్తున్న వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి వలసలు వెల్లువెత్తుతున్నాయి. గత నెలలో తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్, ఆ తరువాత రోజు బీజేపీ రాష్ట్ర నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, మరో రెండు రోజులకు మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి మనవడు కాసు మహేష్‌రెడ్డి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిపోయారు. ఆ తరువాత కూడా ఆయా నియోజకవర్గాల్లో టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు  పలువురు నాయకులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెంట నడిచేందుకు ముందుకొచ్చారు. మాజీ మంత్రి, దివంగత నేత కోటగిరి విద్యాధరరావు తనయుడు కోటగిరి శ్రీధర్‌ కూడా ఈ నెల 29న వైయస్‌ఆర్‌సీపీలో చేరనున్నారు. పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో నిర్వహించే బహిరంగ సభలో ఆయన పార్టీలో చేరబోతున్నారు. తాజాగా చిత్తూరు జిల్లా పలమనేరుకు చెందిన కాంగ్రెస్‌ నాయకుడు, డీసీసీ వైస్‌ ప్రెసిడెంట్‌ విజయభాస్కర్‌రెడ్డి మంగళవారం వైయస్‌ఆర్‌సీపీలో చేరారు. పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో విజయభాస్కర్‌రెడ్డితో పాటు పలువురు ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, సింగిల్‌ విండో డైరెక్టర్లు వైయస్‌ఆర్‌సీపీలో చేరగా, వారికి పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కండువాలు వేసి సాదారంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారికి వైయస్‌ జగన్‌ సమక్షంలో పార్టీ స్వభ్యత్వాన్ని అందజేశారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ..విజయభాస్కర్‌రెడ్డి చేరికతో వైయస్‌ఆర్‌సీపీ బలోపేతమవుతుందన్నారు. చిత్తూరు జిల్లాతో పాటు పలమనేరు నియోజకవర్గంలో పార్టీకి తిరుగు ఉండదన్నారు. వచ్చే ఎన్నికల్లో పలమనేరు నియోజకవర్గంలో వైయస్‌ఆర్‌సీపీ విజయబావుట ఎగురవేయడం ఖాయమని జోస్యం చెప్పారు. అందరం ఐక్యమత్యంతో పనిచేస్తామని చెప్పారు. విజయభాస్కర్‌రెడ్డికి పార్టీలో సముచిత స్థానం ఉంటుందని, పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అందర్ని ఆదరిస్తారని పెద్దిరెడ్డి పేర్కొన్నారు.

Back to Top