నెల్లూరుకు నారా శఠగోపం

అన్ని జిల్లాలను ముంచినట్టే దొంగ హామీల్లో ముంచెత్తారు. అసెంబ్లీ సమావేశాల్లోనూ ముఖ్యమంత్రి జిల్లాల వారీగా ఇచ్చిన హామీల్లో వీటిని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ నాలుగేళ్ల కాలంలో కనీసం ఒక్క హామీ కూడా అందులో అమలుకు నోచుకోలేదు. వాటిలో ముఖ్యమైనవి ఇవి. 

చంద్రబాబు హామీల చిట్టా.

విసిఐసి మరియు బిసిఐసి వాడలు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. వాటికి సంబంధించి ఏ పనీ మొదలు కాలేదు. ఆటో మొబైల్ హబ్ అన్నాడు. జిల్లాను స్మార్ట్ సిటీ చేస్తానన్నాడు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్ మెంట్ ఏర్పాటు చేస్తానన్నాడు. మెరైన్ ఇనిస్టిట్యూట్ అన్నాడు. సముద్ర తీరం ఉన్న ప్రతి జిల్లాకూ ఇచ్చినట్టే నెల్లూరుకూ మెరైన్ ఇనిస్టిట్యూట్ అని, ఆ తర్వాత యధా విధిగా ఆ విషయాన్ని వదిలిపెట్టేశాడు. దుగరాజపట్నం పోర్టు అన్నాడు. కృష్ణ పట్నం పోర్టుకు ప్రాధాన్యత ఇచ్చి రాజకీయం మొదలెట్టాడు. వీటిలో ఏ ఒక్క హామీకి సంబంధించి ఈరోజు వరకూ ఒక్క మాటైనా మాట్లాడలేదు ముఖ్యమంత్రి. 

పరిశ్రమల ఊసే లేదు

పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఎరువుల కర్మాగారం ఏర్పాటు చేస్తామని, వివిధ ప్రైవేటు పరిశ్రమలను తీసుకువస్తానని చంద్రబాబు చెప్పిన మాట ఈ రోజుకీ నెరవేరలేదు. స్వర్గీయ మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు హయాంలో రాచర్లపాడు వద్ద ఇఫ్కో ఫ్యాక్టరీ మంజూరైంది. కానీ కొన్ని అవాంతరాల వల్ల అది నెరవేరలేదు. మహానేత వైఎస్ హయాంలో ఇఫ్కో ఫ్యాక్టరీకి సేకరించిన భూముల్లో కిసాన్ సెజ్ ను ఏర్పాటు చేసారు. ఆయన ఆకాల మరణం తర్వాత ఇఫ్కో భూములన్నీ అలాగే ఖాళీగా ఉన్నాయి. ఇక బాబుగారి మరో వాగ్దానం ఆటో మొబైల్ హబ్ గా జిల్లాని మారుస్తాననడం. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే తడ సమీపంలోనే శ్రీసిటీ రూపుదిద్దుకుంది. ఇప్పటికే అక్కడ ఎన్నో ఆటో మొబైల్ కంపెనీలు ఉన్నాయి. ఇక కొత్తగా బాబు ఏ ఆటో మొబైల్ హబ్ ను ఏర్పాటు చేస్తారో ఆయనకే తెలియాలి. 

ఇతర హామీలూ గాలికే

చెన్నై  వైజాగ్ పారిశ్రామిక కారిడార్ విషయంలోనూ ఎలాంటి ప్రగతీ లేదు. హోటల్ మేనేజ్ మెంట్ కేంద్రం గత ప్రభుత్వం సమయంలోనే మంజూరైంది. నిర్మాణం కూడా మొదలైంది. దాన్ని పూర్తి చేసే పని కూడా చంద్రబాబు చేయలేకపోయారు. పులికాట్ సరస్సును పర్యాటక కేంద్రం మార్చడం విషయంలో బాబు తీసుకున్న చర్యలు శూన్యం. రాష్ట్రంలో చంద్రబాబు 10 స్మార్ట్ సిటీలు ప్రకటించాడు. వాటిలో పొట్టిశ్రీరాములు నెల్లూరు కూడా ఒకటి. అవెలా ఈ నాలుగేళ్లలో సైలెంట్ సిటీల్లా ఉన్నాయో...నెల్లూరు కూడా అలాగే ఎదుగుబొదుగూ లేకుండా ఉంది. 

ఎయిర్ పోర్టు కోసం వైఎస్సార్ కాంగ్రెస్ ఉద్యమం

నెల్లూరు జ్లిలా దగదర్తి వద్ద ఎయిర్ పోర్టు నిర్మాణం కోసం ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో పని చేస్తూనే ఉంది. ఎయిర్ పోర్టు నిర్మాణం కోసం ప్రజా ఉద్యమానికి కూడా సిద్ధమని ప్రభుత్వాన్ని హెచ్చరించింది. నెల్లూరులో ఎయిర్ పోర్టు లేదని, దాని నిర్మాణాన్ని మరో ప్రాంతానికి తరలిస్తున్నామంటూ బాబు అధికారులతో ప్రకటనలు చేయించడాన్ని ప్రతిపక్ష పార్టీ వ్యతిరేకించింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి నెల్లూరు జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి ఎయిర్ పోర్టు ప్రతిపాదనలు సిద్ధం చేసారు. కానీ వైఎస్ ఆకాల మరణం తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ తర్వాత వచ్చిన టిడిపి ప్రభుత్వం కూడా ఈ ప్రతిపాదనను పక్కన పెట్టారు. చంద్రబాబు తన హామీల్లో ఎయిర్ పోర్టు నిర్మాణం చేస్తామని ప్రకటించి తర్వాత పట్టించుకోవడం మానేశారు. అసెంబ్లీలో ఎన్నో సార్లు దీనిపై ప్రతిపక్షం ప్రశ్నించడంతో చంద్రబాబు సర్కారు భూసేకరణ అడ్డంకులున్నాయంటూ కుంటిసాకులతో తప్పించుకోజూసింది. ఎయిర్ పోర్టు కోసం ప్రజా ఉద్యమానికి సైతం సిద్ధపడటంతో భూసేకరణ నిమిత్తం 130 కోట్లు విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. అయితే ఎయిర్ పోర్టు కోసం ముందు ప్రతిపాదించిన 3500 ఎకరాలు కాకుండా, 1352 ఎకరాలను మాత్రమే సేకరించాలని నిర్ణయించారు. ఆ పనులింకా పూర్తి కాలేదు. ఎన్నికలు సమీపిస్తుండటంతో బాబు భూసేకరణ, నిధుల విడుదల నాటకం ఆడుతున్నాడని, మాటలు తప్ప ఎయిర్ పోర్టు కోసం జరుగుతున్న పనులేమీ లేవని కుండ బద్దలు కొడుతున్నారు నెల్లూరు వాసులు. 

జిల్లాల వారీగా హామీలంటూ అసెంబ్లీ సాక్షిగా చెప్పిన బాబు, ఆ శాసన సభనే కించపరిచేలా తన హామీలను జిల్లాల వారీగా పూడ్చిపెట్టాడు. ముఖ్యమంత్రి అయ్యిన దగ్గరనుండీ తమను పట్టించుకోని చంద్రబాబుపై రానున్న ఎన్నికల్లో తమ వ్యతిరేకతను ఓటు పోటుతో తెలియజేస్తామంటున్నారు నెల్లూరు ప్రజానీకం. 
Back to Top