నేతన్నలకు సర్కారు వేధింపులు

కర్నూలు:

చేనేతల సంక్షేమానికి మహానేత వై.యస్ రాజశేఖర్ రెడ్డి కృషి చేస్తే కిరణ్ సర్కారు మొండిచెయ్యి చూపిందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్‌ రెడ్డి సోదరి వైయస్ షర్మిల ధ్వజమెత్తారు. చేనేతల కోసం రాజశేఖర్ రెడ్డి రూ. 312 కోట్లు కేటాయిస్తే, ఇప్పటి వరకు ఆ నిధులు మంజూరు చేయకుండా ప్రభుత్వం నేతన్నలను వేధిస్తోందని ఆమె ఆరోపించారు. ‘మరో ప్రజా ప్రస్థానం’ పాదయాత్రలో భాగంగా జిల్లాలో పర్యటిస్తున్న షర్మిల శుక్రవారం పెద్ద కడుబూరు మండలం హెచ్. మురవణి నుంచి ఎమ్మిగనూరు వరకు 13 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా ఎమ్మిగనూరులోని సోమప్ప సర్కిల్‌లో స్థానిక ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆమె ప్రసంగించారు. ఎమ్మిగనూరులో చేనేత కుటుంబాలు అధికంగాఉన్న నేపథ్యంలో నేతన్నలకు కిరణ్ సర్కారు చేస్తున్న ఆన్యాయాన్ని వివరించారు.

నేతన్న నేసే వస్త్రంపై వైయస్ఆర్ నవ్వు కనిపిస్తుంది

     ‘చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేనేత కార్మికులు వందల సంఖ్యలో ఆత్మహత్యలు చేసుకున్నారు. చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకోమని రాజశేఖర్ రెడ్డి కోరినా అప్పట్లో బాబు పట్టించుకోలేదు. కానీ రాజశేఖర్ రెడ్డి సీఎం అయిన వెంటనే ఆత్మహత్య చేసుకున్న నేత కార్మికుల కుటుంబాల వారికి ఒక్కొక్కరికి లక్షన్నర పరిహారం చెల్లించారు. చేనేతల కార్మికులకు 50 ఏళ్లకే పింఛన్లు అందేలా కృషి చేశారు. నేతన్నలు నేసిన దుస్తులనే ధరించిన రాజశేఖర్ రెడ్డికి వారంటే ఎంతో ప్రేమ. ఇప్పుడు ఆయన మరణించినా... నేతన్నల తయారు చేసే ప్రతీ వస్త్రంపైన ఆయన చిరునవ్వు కనిపిస్తుంది’ అని షర్మిల ఉద్వేగంగా చెప్పారు.

ఎల్‌ఎల్‌సీ ఆధునికీకరణ ఏమైంది..?

     తుంగభద్ర దిగువ కాలువ (ఎల్‌ఎల్‌సీ) ఆధునికీకరణకు రాజశేఖర్ రెడ్డి రూ. 150 కోట్లు కేటాయించినా మూడేళ్లుగా పనులు పూర్తికాలేదని షర్మిల విమర్శించారు. పులికనుమ, గురు రాఘవేంద్ర ప్రాజెక్టుల విషయంలో కూడా కిరణ్ ప్రభుత్వం అదేరీతిన వ్యవహరిస్తోందన్నారు. ప్రభుత్వానికి రైతుల పట్ల చిత్తశుద్ధి లేకపోవడం వల్లనే ఈ సమస్య అని ఆమె పేర్కొన్నారు. సాగునీరు లేక అప్పుల్లో మునిగిపోయిన రైతులు తమను ఆదుకునే వాడే లేడని బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Back to Top