ముస్లింలకు రిజర్వేషన్లు వైయస్ఆర్ చలవే

పంగులూరు:

రాష్ట్రంలో ముస్లిం మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డికే దక్కుతుందని అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ కొనియాడారు. పంగులూరు మండలంలోని అలవలపాడు గ్రామంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రవికుమార్ మాట్లాడారు. అలవలపాడు గ్రామంలో ఐదు వందలకు పైగా ముస్లిం కుటుంబాలు ఉన్నాయన్నారు.  గ్రామంలో సుమారు కోటి రూపాయల నిధులతో పలు అభివృద్ధి పనులు చేపట్టడం ఆనందంగా ఉందన్నారు.
     మహానేత స్ఫూర్తితోనే స్థానిక హైస్కూల్లో 12 అదనపు తరగతి గదులు నిర్మించామని రవికుమార్ అన్నారు. ఆర్‌ అండ్‌ బీ రోడ్డు నుంచి హైస్కూల్ వరకు 10 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు నిర్మాణం, 10 లక్షల రూపాయలతో ఉర్దూ పాఠశాల భవన నిర్మాణం చేపట్టామన్నారు. అదే విధంగా గ్రామంలోని పేదలకు ఇళ్లస్థలాలు పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు. అందుకు సహకరించిన అధికారులు, గ్రామస్తులను అభినందించారు. ముందుగా నూతనంగా నిర్మించిన ఉర్దూ పాఠశాల భవనం, సీసీ రోడ్డును రవికుమార్ ప్రారంభించారు.

Back to Top