మూడేళ్లుగా పింఛను అందడంలేదు


బింగిదొడ్డి (మహబూబ్ నగర్ జిల్లా): ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పాలనలో తమకు పింఛన్ కూడా అందడంలేదని అంధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల పాలమూరు జిల్లాలోని బింగిదొడ్డి గ్రామంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో అంధులు తమ గోడును వెళ్లబోసుకున్నారు.

      వైయస్ రాజశేఖరరెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ప్రతి నెలా తాము 500 రూపాయలు పింఛన్ తీసుకున్నామని ఇంటర్మీయట్ సెకండ్ ఇయర్ చదువుతున్నఅంధురాలు పద్మ చెప్పారు. కానీ గత మూడేళ్లుగా పింఛన్ రాక పోవడంతో ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులు లేక చదువుకోవడం భారంగా మారిందని షర్మిల దృష్టికి తీసుకు వచ్చారు. పెద్దలు సహకరిస్తే ఉన్నత చదువులు అభ్యసిస్తామని, అందుకు తగిన చర్యలు తీసుకోవాలని విద్యార్థినీ పద్మ విజ్ఞప్తి చేశారు.

     బింగిదొడ్డి గ్రామంలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, పారిశుద్ధ్యం పనులు కూడా సవ్యంగా జరగక పోవడంతో తీవ్ర ఇబందులు ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. గ్రామంలో తాగు, సాగు నీటితోపాటు విద్యుత్ సమస్యను పరిష్కరించేందుకు ఎవరూ ముందుకు రావడంలేదని అన్నారు. పావలా వడ్డీ రుణాలు కూడా ఇవ్వడం లేదన్నారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ,  వైయస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం రాష్ర్టంలో పాలన అస్తవ్యస్తంగా మారిందన్నారు. రాజన్న రాజ్యం వస్తే సమస్యలన్నీ తొలగిపోతాయని షర్మిల హామీ ఇచ్చారు.

Back to Top