చంద్రబాబు నిర్లక్ష్యం వల్లే రాష్ట్రానికి అన్యాయం

హైదరాబాద్, 29 నవంబర్ 2013:

టీడీపీ అధ్యక్షుడు సీఎంగా ఉన్న సమయంలో నిర్లక్ష్యం వహించిన కారణంగానే కృష్ణానదిపై కర్నాటకలో అక్రమంగా పలు ప్రాజెక్టులు కట్టారని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే జి. శ్రీకాంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. 1997 నుంచి 2003 వరకూ అక్రమ ప్రాజెక్టులను కర్ణాటక నిర్మించిన విషయాన్ని శ్రీకాంత్‌రెడ్డి గుర్తు చేశారు. ఆయన హయాంలో కృష్ణా నదిపై కర్నాటక అక్రమంగా ఎన్నో ప్రాజెక్టులు కడుతుంటే నోరు మెదపలేదని విమర్శించారు. కృష్ణానది నీటి పంపకాల విషయంలో బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ శుక్రవారం తుది తీర్పు వెలువరించిన నేపథ్యంలో శ్రీకాంత్‌రెడ్డి పార్టీ కేంద్ర కార్యాలయం ఆవరణలో మీడియాతో మాట్లాడారు. నీటి కేటాయింపుల విషయంలో న్యాయపోరాటానికైనా తాము సిద్ధం అన్నారు. ఇప్పటికైనా నీటి కోసం పోరాటానికి కలిసి రావాలని టీడీపీకి విజ్ఞప్తి చేశారు.

నీటి కోసం రైతులు కష్టపడుతున్న చోటల్లా దివంగత మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారని శ్రీకాంత్‌రెడ్డి గుర్తుచేశారు. ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయిన తరువాత నికరజలాలు కేటాయించాలని ఆయన ఆలోచన చేశారన్నారు. చంద్రబాబు హయాంలో పట్టుమని పది వేల కోట్లు కూడా సాగునీటి ప్రాజెక్టులపై ఖర్చు చేయలేదని, మహానేత వైయస్ఆర్‌ మాత్రం ఐదేళ్ళలోనే పది రెట్ల నిధులు వెచ్చించారని అన్నారు.

చంద్రబాబు నాయుడు 2003లో రాష్ట్ర సీఎంగా ఉంటూ.. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతూ కర్నాటక రాష్ట్రం ప్రాజెక్టులు నిర్మించుకోవడానికి పూర్తి సహాయ సహకారాలు అందించారని శ్రీకాంత్‌రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు అప్పటి తీరు కారణంగా ఆయన ఆంధ్రప్రదేశ్‌ నాయకుడా? లేక కర్నాటకలో పుట్టిపెరిగిన నాయకుడా? అనే అనుమానాలు తలెత్తాయని అన్నారు. చంద్రబాబు నిర్లక్ష్యం కారణంగానే కర్నాటక పలు ప్రాజెక్టులు నిర్మించుకుని నికర జలాలు సాధించుకున్నదన్నారు. 519 అడుగులున్న ఆల్మట్టి డ్యాంను 524 అడుగులకు పెంచుకోవడం వల్ల  దాదాపు 170 టీఎంసీల నీటిని కర్నాటకల ఎక్కువగా నిల్వ చేసుకుంటున్న విషయం తెలిపారు. ఆల్మట్టిడ్యాం నిర్మాణం చంద్రబాబు నాయుడి హయాంలోనే జరిగిందన్నారు. చంద్రబాబు నిర్లక్ష్యం చేయడమే కాకుండా ఇప్పుడు టీడీపీ నాయకులు ఎదుటి వ్యక్తులపై ఎదురుదాడి చేస్తున్నారని నిప్పులు చెరిగారు.

నీటి పంపకాల విషయంలో రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందనే వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి జీరో డిగ్రీల ఉష్ణోగ్రతలో కూడా ఢిల్లీలో జలదీక్ష చేసిన వైనాన్ని శ్రీకాంత్‌రెడ్డి గుర్తుచేశారు. తద్వారా ప్రభుత్వాన్ని మేల్కొల్పాలని ఆయన ప్రయత్నం చేశారన్నారు. సాగునీటి రంగంపై చంద్రబాబు, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి నిర్లక్ష్యం చేయడం వల్లే ఇప్పుడు ఇలాంటి పరిస్థితి దాపురించిందని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ప్రాజెక్టులన్నీ పూర్తిచేసి ఉంటే ఈ దుస్థితి వచ్చేది కాదన్నారు.

Back to Top