చంద్రబాబుకు ప్రజల శ్రేయస్సు పట్టదా?

హైదరాబాద్ :

ప్రధాన ప్రతిపక్ష నేతగా బాధ్యతగా వ్యవహరించాల్సిన చంద్రబాబు నాయుడు ప్రజల శ్రేయస్సు గురించి పట్టించుకోరా? అని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి సూటిగా ప్రశ్నించారు. రెండు ప్రాంతాల్లో టీడీపీ బతకాలంటారే తప్ప, ప్రజల శ్రేయస్సు కోసం రెండు ప్రాంతాలు కలిసి ఉండాలని ఒక్క మాట కూడా ఎందుకు చెప్పడం లేదని ఆయన నిలదీశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద‌ పార్టీ ఎమ్మెల్యేలు ధర్మాన కృష్ణదాస్, గొల్ల బాబూరావు, టి.బాలరాజు, శ్రీకాంత్‌రెడ్డి, కె.శ్రీనివాసులు, కాపు రామచంద్రారెడ్డి, కాటసాని రామిరెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిలతో కలిసి మంగళవారంనాడు విలేకరులతో భూమన మాట్లాడారు.

రాష్ట్ర విభజన వల్ల రెండు ప్రాంతాలకు తీరని నష్టం వాటిల్లుతుందని తెలిసినప్పటికీ తన రాజకీయ భవిష్యత్తు కోసం తెలుగు ప్రజలకు ద్రోహం చేస్తున్నారని చంద్రబాబుపై భూమన మండిపడ్డారు. ఓట్లు, సీట్ల కోసం కాంగ్రె‌స్ పార్టీ మాదిరిగా చంద్రబాబు కూడా ఇంత ఘోరంగా దిగజారడం చూసి ప్రజలు కూడా అసహ్యించుకుంటున్నారని చెప్పారు. తాము మాత్రం ప్రజల తరఫునే నిలబడ్డామని, రాజకీయంగా నష్టపోయినా ఫర్వాలేదని సమైక్యంగా ఉంచాలనే డిమాండ్ చేస్తున్నట్లు వివరించారు. రాష్ట్ర విభజనను అడ్డుకుంటానని బీరాలు పలికి, చివరకు విభజనకు తలుపులు బార్లా తెరిచిన సీఎం కిర‌ణ్‌కుమార్‌రెడ్డి చరిత్రహీనుడిగా మిగిలిపోతారని హెచ్చరించారు.

బీఏసీకి ఎందుకు హాజరు కాలేదు?:
ప్రధాన ప్రతిపక్షస్థానంలో ఉన్న చంద్రబాబు బీఏసీ సమావేశానికి హాజరు కాకపోవడాన్ని ఏ సిద్ధాంతం అంటారో ఆయనే చెప్పాలని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. బీఏసీకి కూడా బాబు ఇరు ప్రాంత నేతలను పంపించి ద్వంద్వ వైఖరిని అవలంబించారని దుయ్యబట్టారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top