కాంగ్రెస్‌తో కుమ్మక్కైతే జైల్లో ఎందుకుంటారు?

హైదరాబాద్:

వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీతోనో లే‌క ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతోనో కుమ్మక్కయితే 18 నెలల పాటు జైలులో ఎందుకు ఉంటారని పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి అన్నారు. కాంగ్రెస్‌తో శ్రీ జగన్‌ కుమ్మక్కయ్యారని విమర్శలు చేసే ముందు టీడీపీ నాయకులు ఆత్మవిమర్శ చేసుకోవాలని ఆయన సూచించారు. ‘కాంగ్రెస్ పార్టీలో‌నే ఉండి ఉంటే శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి సీఎం లేదా కేంద్రమంత్రి అయ్యేవార'ని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి గులాంనబీ ఆజాద్ చెప్పిన విషయం గుర్తులేదా? అని అన్నారు. ఆజాద్ మాట‌లను బట్టే శ్రీ జగన్ కాంగ్రె‌స్‌ను ఎదిరించారన్న విషయం అర్థం కావడం లేదా? అని ప్రశ్నించారు. వీటన్నింటినీ ప్రజలు అర్థం చేసుకుంటున్నా టీడీపీకి అర్థం కావడం లేదా? అని ప్రశ్నించారు.

సహచర శాసనసభ్యులు కాపు రామచంద్రారెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, గొల్ల బాబూరావు, కాటసాని రామిరెడ్డి, మేకపాటి చంద్ర శేఖరరెడ్డి, ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి, తెల్లం బాలరాజు, కొరుముట్ల శ్రీనివాసులు, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డితో కలిసి గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో భూమన మాట్లాడారు. విభజన బిల్లు సమయంలో ఇరువైపులా ఎమ్మెల్యేలతో డ్రామాలు ఆడిస్తున్న చంద్రబాబు తన వైఖరిని ఏ విధంగా సమర్థించుకోవాలో తెలియని స్థితిలో తమ అధినేత శ్రీ జగన్‌పై విమర్శలు చేయిస్తున్నారని దుయ్యబట్టారు.

Back to Top