() లంక భూముల మీద మొదటి నుంచీ కన్ను() పక్కాగా వ్యూహం అమలు చేసిన మంత్రులు() చంద్రబాబు చక్రం తిప్పటంతో కోట్ల రూపాయిల ఆస్తులు
ఆనాడు రావణాసురుడు సీతమ్మను చెరబట్టే ప్రయత్నం చేస్తే.. ఈనాటి రావణాసురులు భూమాతపై కన్నేశారు. కృష్ణా నదిలోని లంకలన్నింటినీ స్వాధీనం చేసుకోవడానికి వ్యూహాత్మకంగా పావులు కదిపారు. అడుగడుగునా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. రాజధాని భూసమీకరణ పరిధి నుంచి ఏకంగా లంకలను తప్పించేశారు. ఎలాంటి పరిహారం ఇవ్వకుండా ప్రభుత్వం ఆ భూములను లాక్కుంటుందంటూ బడుగులను భయపెట్టారు. దళిత పేద రైతులను దిక్కుతోచని దుస్థితిలో కూరుకుపోయేలా చేశారు. ఈ సమయంలో పచ్చ రాబందులు లంకలపై వాలాయి. ఎకరం కనిష్టంగా రూ.5 లక్షల నుంచి గరిష్టంగా రూ.35 లక్షల చొప్పున కొనుగోలు చేశారు. అస్మదీయుల భూదోపిడీ ముగిశాక లంక భూములను సమీకరిస్తున్నట్లు.. పరిహారం ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడం గమనార్హం. నోటిఫికేషన్‌లో తప్పించేశారు!రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల పరిధిలో 13 లంకలు ఉన్నాయి. ఈ లంకల్లో 574.93 ఎకరాలు అసైన్డు భూమి కాగా 1,584.24 ఎకరాలు లంక భూమి. మొత్తం 2159.17 ఎకరాలను 1954 నుంచి 1976 వరకూ ప్రభుత్వం దళిత పేద రైతులకు 77 సెంట్ల నుంచి ఎకరం లోపు పంపిణీ చేస్తూ వచ్చింది. ఆ భూములను దళిత పేద రైతులు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల్లో భూసమీకరణకు జనవరి 1, 2015న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల్లో పట్టా, అసైన్డు భూములను మాత్రమే సమీకరిస్తున్నట్లు పేర్కొంది. లంక భూముల ప్రస్తావన ఆ ఉత్తర్వుల్లో కన్పించకుండా సీఎం చంద్రబాబునాయుడు చక్రం తిప్పారు.
లంకల్లో రాబందులురాజధాని భూసమీకరణ సమయంలో మంత్రులు పి.నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావులు మూణ్నెళ్లపాటు తిష్ట వేసి.. గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు. ప్రధానంగా లంక భూములు ఎంత ఉన్నాయన్నది ఆరా తీశారు. భూసమీకరణ ఉత్తర్వులు, నోటిఫికేషన్‌లో లంక భూములను చేర్చని వైనాన్ని అనుచరుల వద్ద ప్రస్తావిస్తూ.. ప్రభుత్వం పరిహారం ఇవ్వకుండా ఆ భూములను లాక్కుంటుందంటూ వాటి లబ్ధిదారులను బెదరగొట్టాలని సూచించారు. దాంతో 13 గ్రామాల్లోనూ తిష్ట వేసిన మంత్రుల అనుచరులు.. లంక భూములు సాగుచేసుకుంటోన్న వారి ఇళ్ల వద్దకు వెళ్లి బెదరగొట్టారు. ప్రభుత్వం ఉత్తినే లాక్కుంటే బతకలేమని ఆందోళన చెందిన లబ్ధిదారులు.. ఆ భూములను తెగనమ్మేయడానికి సిద్ధపడ్డారు. ఇదే అంశాన్ని మంత్రులకు వారి అనుచరులు చేరవేశారు. దాంతో రియల్ ఎస్టేట్ బ్రోకర్లను రంగంలోకి దించి.. ఒక్కో లంకలో ఒక్కొక్కరు చొప్పున భూములు కొనుగోలు చేశారు. ఉద్దండరాయునిపాలెం, లింగాయపాలెం లంకల్లో సీఎం తనయుడు లోకేష్, మంత్రి ప్రత్తి పాటి, తాళ్లాయపాలెం, వెంకట పాలెం లంకల్లో మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు, మరో మంత్రి ప్రత్తిపాటి, రాయపూడి లంకల్లో మంత్రి నారాయణ, మందడం, ఉండవల్లి లంకల్లో హిందూపురం ఎమ్మెల్యే, బాలకృష్ణ వియ్యంకుడు భూములను కొనుగోలు చేశారని ఆ లంకలకు చెందిన దళిత పేద రైతులు చెప్పారు.
ఒక్క మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాత్రమే తన బినామీ గుమ్మడి సురేష్ పేరుతో 96.4 ఎకరాల లంక భూములను కొనుగోలు చేశారు. ఇందులో వెంకటపాలెం లంకలో 1.01 ఎకరాల కొనుగోలు చేసిన భూమిని మాత్రమే మంగళగిరి సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. తక్కిన భూములను రిజిస్టర్ చేయడానికి అధికారులు నిరాకరించడంతో.. అగ్రిమెంట్లు చేసుకున్నారు. మిగతా మంత్రులు కూడా లంక భూములను కొనుగోలు చేసినట్లు లబ్ధిదారులతో ఒప్పందాలు మాత్రమే చేసుకోవడం గమనార్హం. దళిత నిరుపేద రైతుల నుంచి లంక భూములు కొన్న పచ్చ గద్దలు.. సంబంధిత రైతుల నుంచి పట్టాదారు పాసుపుస్తకాలు, అసైన్‌మెంట్ చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన పత్రాలతోసహా ఆ భూములకు సంబంధించిన అన్ని ఆధారాలను ముందు జాగ్రత్తగా స్వాధీనం చేసుకోవడం గమనార్హం. రూ.2,500 కోట్లకుపైగా దోపిడీచంద్రబాబు తనయుడు, టీడీపీ నేతలు లంక భూములను కొనుగోలు చేశాక తొలి విడతగా రాయపూడి గ్రామ పరిధిలోని ఆరు లంకల్లో 1093 ఎకరాలు, ఉండవల్లి లంకలో 162.50 ఎకరాల సమీకరణకు డిసెంబరు 6న నోటిఫికేషన్ జారీ చేసింది. కానీ.. సర్వే నెంబర్లు, రైతుల వారీగా నోటిఫికేషన్ జారీ చేస్తే.. టీడీపీ నేతల భూదోపిడీ అధికారికంగా బహిర్గతమవుతుందనే భయంతో నామమాత్రపు నోటిఫికేషన్ జారీ చేయడం గమనార్హం. ఇది నిబంధనలకు విరుద్ధమని సీఆర్‌డీఏ అధికారులే స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం లంక భూముల సమీకరణకు అంగీకరించడంతో ఎకరం భూమి రూ.1.75 కోట్లకుపైగా పలుకుతోంది. లంక భూముల లబ్ధిదారులకు కాకుం డా.. వాటిని కొనుగోలు చేసిన అధికారపార్టీ నేతలకు ప్రయోజనం చేకూరేలా చట్టాన్ని సవరించాలంటూ ఇటీవల సీఎం చంద్రబాబునాయుడు సీసీఎల్ (భూపరి పాలన కమిషనర్) అధికారులను ఆదేశిం చారు. తద్వారా తన తనయుడు, అస్మదీయులకు రూ.2,500 కోట్లకుపైగా విలువైన లంక భూములపై యాజమా న్య హక్కులు కల్పించి, ప్రయోజనం చేకూర్చడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆంజనేయులు ‘వాటా’ 4.69 ఎకరాలు!రాజధాని ప్రకటనకు ముందే తుళ్లూరు ప్రాంతంలో రాజధాని వస్తుందని తెలుసుకున్న టీడీపీ నేతలు రైతులను మోసగించి తక్కువ ధరలకు భూములు కొట్టేసిన వైనం ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు చేరారు. ఆయన తన కుటుంబ సభ్యుల పేర్లతోపాటు, బినామీ పేర్లతో భారీ ఎత్తున భూములను కొనుగోలు చేశారు. కోర్ క్యాపిటల్‌లోని తుళ్లూరుకు అతి దగ్గరగా ఉండే ఐనవోలు గ్రామంలో 4.69 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. సర్వే నెంబరు 77-2లో 2.26 ఎకరాలు, 121-7 లో 0.97 ఎకరాలు, 137-2లో 1.46 ఎకరాలు చొప్పున తన కుమార్తె గోనుగుంట్ల లక్ష్మీసౌజన్య పేరుతో 2014లో రిజిస్టర్ చేయించుకున్నారు. అప్పట్లో ఎకరం రూ. 3.9 లక్షలు చొప్పున 4.69 ఎకరాలను రూ. 18.29 లక్షలకే కొనుగోలు చేశారు. ఐనవోలులో ప్రస్తుత మార్కెట్ విలువ రూ. 2 కోట్లు ఉన్నట్లు చెబుతున్నారు. అంటే ఏడాది కాలంలో జీవీ ఆంజనేయులు భూములకు 50 రెట్లకుపైగా ధర పెరిగింది. జిల్లాలో ప్రజా రాజధాని నిర్మాణం ప్రజల అదృష్టమని చెప్పే జీవీ రైతుల భూములను అతి తక్కువ ధరకే కొట్టేసి వారికి తీవ్ర అన్యాయం చేయడం ఎంత వరకు సమంజసమో ఆయనే చెప్పాల్సి ఉంది. ధూళిపాళ్ల ఆగలేదు...గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరు గ్రామంలో వాగు పోరంబోకు భూములను కాజేసిన పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అంతటితో ఆగలేదు. ముందుగానే రాజధాని నిర్మాణం తుళ్లూరులో జరుగబోతుందని తెలుసుకుని కోర్ క్యాపిటల్‌కు అతి దగ్గరగా ఉండే ఐనవోలు గ్రామంలోని సర్వేనెంబరు 69-1లో 0.72 ఎకరాలు, 69-2లో 2.86 ఎకరాల భూమిని తన పెద్దకుమార్తె ధూళిపాళ్ల వీరవైష్ణవి పేరుతో కొనుగోలు చేశారు. ఈ భూమిని 2014లో ఎకరా రూ. 3.80 లక్షలకు కొనుగోలు చేసినట్లు సమాచారం. అంటే మొత్తం 3.58 ఎకరాలను రూ. 13.60 లక్షలకు కొనుగోలు చేయగా, ప్రస్తుతం ఆగ్రామంలో ఎకరం భూమి ధర రూ. 2 కోట్ల వరకు పలుకుతుంది. ఇలా రాజధాని ప్రాంతంలో 50 ఎకరాలకు పైగా బినామీ పేర్లతో ధూళిపాళ్ల నరేంద్ర కొనుగోలు చేసినట్లు సమాచారం.