మహానేత ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తి

పటాన్‌చెరు:

పటాన్‌చెరు పారిశ్రామిక ప్రాంతంలో మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి మౌలిక సౌకర్యాలు కల్పించారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మ చెప్పారు. మెదక్ జిల్లా పటాన్‌చెరులో గురువారం రాత్రి నిర్వహించిన బహిరంగా సభలో ఆమె ప్రసంగించారు. ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తి కాబట్టే సంక్షేమం కోసం తపించారన్నారు. పటాన్‌చెరులో వంద పడకల ఆస్పత్రి ఆయన చలవేనని పేర్కొన్నారు. సింగూరు జలాల కోసం 150 కోట్ల రూపాయలు కేటాయించారని తెలిపారు. ప్రస్తుత కిరణ్ సర్కారుకు ప్రజల సంక్షేమం పట్టడం లేదన్నారు. పల్లెలతో పాటు హైదరాబాద్‌ను అదే స్థాయిలో అభివృద్ధి చేసిన ఘనత దివంగత సీఎం  రాజశేఖరరెడ్డికే దక్కుతుందని అన్నారు. సభకు పార్టీ మెదక్ జిల్లా కన్వీనర్ బట్టి జగపతి అధ్యక్షత వహించారు. మెదక్ జిల్లాలో సాగు, తాగు నీటి అవసరాలు తీర్చేందుకు డాక్టర్ వైయస్ రూ.150 కోట్లు కేటాయించారన్నారు. ‘1972-73లో పటాన్‌చెరు పారిశ్రామికవాడలో 1,100 ఎకరాల్లో 530 పరిశ్రమలు ఉండేవి. రోడ్డు, డ్రైనేజీ వంటి మౌలిక సౌకర్యాలు లేకపోవడంతో మహానేత అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.10.50 కోట్లు కేటాయించారని చెప్పారు.

ఐఐటీ మహానేత కృషి ఫలితమే
     'డాక్టర్ వైయస్ చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు తక్కువ ధరకు విద్యుత్తును సరఫరా చేశారు. 2008-09లో విద్యుత్తు సంక్షోభం నెలకొన్న సమయంలో యూనిట్‌కు రూ.15 చొప్పున పొరుగు రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసి యూనిట్ రూ.3.50 చొప్పున పరిశ్రమలకు ఇచ్చి కాపాడారు. ప్రస్తుతం పరిశ్రమలకు నెలలో 16 నుంచి 20 రోజులు పవర్ హాలిడే అంటూ విద్యుత్ కోతలు విధిస్తున్నారు. పరిశ్రమలు మూతపడటంతో లక్షలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారని’ విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. ‘పటాన్‌చెరులోని నిజాం కాలం నాటి ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా మార్చారు. అత్యంత ప్రతిష్టాత్మక విద్యా సంస్థ ఐఐటీ మెదక్ జిల్లాకు రావడం మహానేత కృషి వల్లే సాధ్యమైందని’ విజయమ్మ అన్నారు.

అదనపు భారం పడకుండా చూశారు
     ‘దివంగత మహానేత డాక్టర్ వైయస్ ప్రజల క ష్టాలూ, కన్నీళ్లూ తెలిసిన వ్యక్తి.  ప్రజల మీద అదనపు భారం పడొద్దని ఉచిత కరెంటు, మున్సిపల్ పన్నులు, నీటి చార్జీలపై అదనపు భారం పడకుండా చూశారు. ఉన్నత దశకు చేరే లక్ష్యంతో అనేక సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు మీ ముందుకు తెచ్చారు. అధికారంలో ఉన్న ఐదేళ్ల మూడు నెలల కాలం లో పన్నులు, కష్టాలు లేకుండా చూశారు. మహానేత రెక్కల కష్టం మీద అధికారంలోకి వచ్చినవారు పథకాలకు తూట్లు పొడిచే ప్రయత్నం చేస్తున్నారు. ఆర్టీసీ టికెట్ రేట్లు మూడుసార్లు పెంచడం ద్వారా రూ.1,700 కోట్ల భారం మోపారు. మరోమారు ఆర్టీసీ సర్‌చార్జీల రూపంలో భారం మోపేందుకు సిద్ధమవుతున్నారు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోంది’ అని విజయమ్మ విమర్శించారు. ‘పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్ బయట ఉండి ఉంటే ఈ రోజు మీ కష్టాల్లో పాలుపంచుకునేవారు. ఆయనను ఆశీర్వదించండి. కోటి సంతకాలు చేసి మీ అందరూ ఇది అన్యాయం అని చెప్పండి’ అంటూ శ్రీమతి విజయమ్మ బహిరంగ సభకు హాజరైనవారికి విజ్ఞప్తి చేశారు. పార్టీ జిల్లా పరిశీలకుడు కొండా రాఘవరెడ్డి, డాక్టర్ శ్రావణ్ కుమార్ రెడ్డి, అంజిరెడ్డి, అధికార ప్రతినిధులు ప్రభుగౌడ్, ఆవుల గోపాల్‌రెడ్డి, హనుమంతరావు, సతీష్ గౌడ్, బాసిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, మక్బూల్ బేగ్, నర్రా భిక్షపతి, గౌరిరెడ్డి శ్రీధర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, జశ్వంత్, ఫారూక్, కృష్ణవేణి, మల్లయ్య యాదవ్, బాలకృష్ణారెడ్డి, రామాగౌడ్, రాధాకృష్ణ దేశ్‌పాండే, శ్రీధర్ గుప్తా తదితర జిల్లా నేతలు బహిరంగ సభలో పాల్గొన్నారు.

Back to Top