మహానేతపై బురద జల్లితే సహించం

హైదరాబాద్, 16 మే 2013:

దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డిపై అవాకులు చెవాకులు పేలుతున్న  రాష్ట్ర ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిపడింది. పార్టీ అధికార ప్రతినిధి జనక్ ప్రసాద్ గురువారం సాయంత్రం పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రామనారాయణ రెడ్డి ఎన్ని పార్టీలు మారిందీ అందరికీ తెలిసిందేనన్నారు.  నెల్లూరు, సూళ్ళూరుపేట.. తాజాగా విజయవాడలో మహానేతపై నోటికొచ్చినట్లు మాట్లాడారని తెలిపారు. నెల్లూరు, సూళ్ళూరు పేటలలో మాట్లాడిన మాటలపై తమ పార్టీ ఆనంకు లీగల్ నోటీసులు ఇచ్చిందనీ, ఇంతవరకూ వాటికి సమాధానం లేదనీ చెప్పారు. చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి తమ పార్టీ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. గురువారం విజయవాడలో ఆనం మరోసారి మహానేతపై విషం కక్కారని ఆరోపించారు. మంత్రిగా ఉండి, రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన మీరు తమకేమీ తెలియదు.. డాక్టర్ వైయస్ఆర్, ఆయన కుమారుడు శ్రీ జగన్మోహన్ రెడ్డిపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఆనంకు మంత్రిగా ఉండే అర్హత లేదని జనక్ ప్రసాద్ స్పష్టంచేశారు. 26 జివోలు సక్రమమైనవా కాదా అని ప్రశ్నించారు. చట్టబద్ధమైన జీవోలిచ్చి.. జగన్మోహన్ రెడ్డికి లబ్ధి చేకూరేలా వాటిని మంజూరు చేశారని చేస్తున్న ఆరోపణకు ఆయన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

వానపాముల్లా ఉన్నవారు తాచుపాములయ్యారు


మహానేత ఉన్న రోజుల్లో వానపాముల్లా ఉన్నవారు ఆయన మరణానంతరం తాచుపాముల్లా బుసలు కొడుతున్నారని మండిపడ్డారు. రాజశేఖరరెడ్డిగారు జీవించి ఉంటే మీకు ఆయన కళ్ళల్లోకి చూసే ధైర్యం కూడా ఉండేది కాదన్నారు. ఎవరి మెప్పుకోసమో ఇలాంటి ఆరోపణలకు దిగొద్దని హితవు పలికారు. మా తప్పేమీ లేదని చెప్పి ఉంటే ఆరుగురు మంత్రులకూ జీవోల విషయంలో నోటీసులు వచ్చేవి కాదు కాదా అని ప్రశ్నించారు. చట్టబద్ధంగా జీవోలిచ్చి తెరవెనుక భాగోతాలు నడిచాయనడాన్ని జనక్ ప్రసాద్ తప్పుబట్టారు. మహానేత, జగన్మోహన్ రెడ్డిగారి మీద అనవసరంగా బురద జల్లితే సహించమని ఆయన హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలు విశ్వాసం కోల్పోయారనీ, రాజీనామ చేయడం మాని వ్యక్తులపై బురద జల్లడం ఆపాలని జనక్ ప్రసాద్ డిమాండ్ చేశారు.

Back to Top