'మహానేత కుటుంబాన్ని విమర్శిస్తే సహించం'

హైదరాబాద్, 3 ఏప్రిల్‌ 2013: మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి కుటుంబాన్ని విమర్శించే అర్హత టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి లేదని నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైయస్ కుటుంబంపై ఆరోపణలు చేస్తే ఊరుకునేదిలేదని ‌ఆయన హెచ్చరించారు. చంద్రబాబు చరిత్ర మొత్తం చిత్తూరు ప్రజలకు బాగా తెలుసన్నారు. రెండు ఎకరాలు ఆసామి చంద్రబాబు వేల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించారని ఆయన మండిపడ్డారు. అసమర్థ, ప్రజా కంటక కాంగ్రెస్‌ ప్రభుత్వానికి రక్షణ కవచంలా కాపాడుతున్నది చంద్రబాబే అని ప్రసన్నకుమార్ రెడ్డి ఆరోపించారు.

తొమ్మిదేళ్ళ పాలనలో ఎనిమిది సార్లు విద్యుత్ ‌ఛార్జీలు పెంచిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని ప్రసన్న కుమార్‌రెడ్డి విమర్శించారు. చంద్రబాబును రెండుసార్లు ప్రతిపక్షంలో కూర్చోబెట్టిన ప్రజలు మూడవసారి ఆ పదవిని కూడా పీకేయడం ఖాయమన్నారు. చంద్రబాబు అవినీతిని భరించలేకే తెలుగుదేశం పార్టీ నుంచి నేతలు బయటకు వస్తున్నారని ఎద్దేవా చేశారు. ‌ఎన్టీఆర్ భవన్ను‌ త్వరలో హెరిటేజ్ భవ‌న్గా మార్చుకోక తప్పదని‌ ప్రసన్న జోస్యం చెప్పారు.
Back to Top