మానవత్వం లేని కిరణ్‌ ప్రభుత్వం: శ్రీకాంత్‌రెడ్డి

హైదరాబాద్‌ : కిరణ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అమానవీయంగా వ్యవహరిస్తోందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే జి. శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర నీటిఎద్దడిని పట్టించుకోకుండా ‌సిఎం కిరణ్‌, మంత్రులు ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ పదవులు కాపాడుకోవడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు తప్ప ప్రజా సమస్యలను పరిష్కరించాలన్న చిత్తశుద్ధి లేదని శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. శాసనసభ ఆవరణలో ఆయన బుధవారంనాడు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

రాష్ట్రమంతటా ప్రజలు తాగు నీరు లేక అల్లాడిపోతున్నారని శ్రీకాంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. సిఎం సొంత నియోజకవర్గం, జిల్లాలోనూ ఈ సమస్య తీవ్రంగా ఉందని నిరూపించడానికి తాము సిద్ధంగా ఉన్నాం అని ఆయన అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఈ సమస్యపై ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. ప్రజలకు ప్రభుత్వం మంచినీరు కూడా సరఫరా చేయలేకపోతోందని గత నెలలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మానవ హక్కుల సంఘానికి(హెచ్‌ఆర్సీ) ఫిర్యాదు చేసిందన్నారు. దీనిపై వివరణ ఇవ్వాలని హెచ్‌ఆర్సీ ఆదేశించగా ప్రభుత్వం నివేదిక ఇచ్చిందని, 70 పట్టణాల్లో రెండు రోజులకోసారి, 15 పట్టణాల్లో మూడు రోజులకోసారి, 5 మునిసిపాలిటీల్లో నాలుగు రోజులకోసారి నీరిస్తున్నామని తెలిపిందన్నారు. అధికారిక నివేదికలే ఇలా ఉంటే వాస్తవ పరిస్థితులు ఇంకా ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు అని అన్నారు.

మంచినీటి సరఫరాలో విఫలమైనందుకే ప్రభుత్వం స్థానిక ఎన్నికలకు వెళ్లేందుకు జంకుతోందని శ్రీకాంత్‌రెడ్డి ఆరోపించారు. ప్రజా సమస్యలపై నిత్యం స్పందించాలని తమ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చార‌ని శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు.
Back to Top