స్విస్ చాలెంజ్ వెనుక లోకేష్ చాలెంజ్

 • రాజధాని మాటున దోచుకుంటున్నారు
 • లక్షల కోట్ల అవినీతికి పాల్పడుతున్నారు
 • ప్రజలు, ప్రతిపక్షాల మీద గౌరవం లేదు
 • నారాయణ కోచింగ్ సెంటర్ లా కేబినెట్ మీటింగ్
 • బాబు రైతులను పూర్తిగా గాలికొదిలేశాడు
 • చేతగాని ముఖ్యమంత్రి, మంత్రులు
 • టీడీపీ సర్కార్ పై ధ్వజమెత్తిన పార్థసారథి

 • విజయవాడః దోపిడీ కోసమే ప్రభుత్వం స్విస్ చాలెంజ్ విధానాన్ని అవలంభిస్తోందని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి పార్థసారథి మండిపడ్డారు. కేంద్రం నియమించిన కేల్కర్ కమిటీ స్విస్ ఛాలెంజ్ విధానం దేశానికి మంచిది కాదని, దాన్ని తొలగించాలని చెప్పినా వినకుండా చంద్రబాబు ఎందుకు కొనసాగిస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలన్నా, ప్రజాస్వామ్యమన్నా, ప్రతిపక్షాలన్నా చంద్రబాబుకు ఏమాత్రం గౌరవం లేదని పార్థసారథి ఫైర్ అయ్యారు.  రాష్ట్ర ప్రజలు  ఇచ్చిన ఓ సువర్ణవకాశం రాజధాని నిర్మాణం అని , లక్షల కోట్ల అవినీతికి పాల్పడుతూ దాన్ని దుర్వినియోగం చేయొద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 

  పునర్విభజన చట్టాన్ని ఉల్లంఘించి రాష్ట్ర హక్కులను కేంద్రం తిరస్కరించిందా...? లేక  మీరే ఉద్దేశ్యపూర్వకంగా కేంద్రం నుంచి  హక్కుగా రాష్ట్రానికి రావాల్సిన నిధుల్ని కావాలని వద్దని నిర్ణయం తీసుకున్నారా..? ప్రజలకు తెలియపర్చాలన్నారు. పునర్విభజన చట్టంలో రాష్ట్రానికి కల్పించిన హక్కుల్లో ఒకట్ రాజధాని నిర్మాణం అని, దాని గురించి చంద్రబాబు ఎందుకు మాట్లాడడం లేదని నిలదీశారు. రాజధాని గురించి ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలతో చర్చించకుండా ఇష్టానుసారం చేసుకోవడం దారుణమన్నారు. ఐదుకోట్ల మంది ఆంధ్రులు మెచ్చేవిధంగా రాజధాని నిర్మించాలన్న ఆలోచన బాబుకు లేకపోవడం బాధాకరమన్నారు. కేవలం లక్షల కోట్లు దోచుకోవడం కోసం, మునిమనువడి వరకు కావాల్సిన నిధులు ఏర్పాటు చేసుకోవడం కోసం, టీడీపీ నాయకుల అక్రమ సంపాదనే లక్ష్యంగా  రాజధాని నిర్మిస్తున్నట్లుగా ఉందని పార్థసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు.  

  స్విస్ చాలెంజ్  విధానంలో పారదర్శకత లేదు, అందరికీ సమాన హక్కులుండవు, అవకతవకలున్నాయని కేల్కర్ కమిటీ స్పష్టంగా చెప్పిన విషయాన్ని పార్థసారథి గుర్తు చేశారు. ఈవిధానం దేశానికి మంచిది కాదని కేల్కర్ కమిటీ చెప్పినా కూడా  బాబు దీన్నిఎందుకు అమలు చేస్తున్నారో రాష్ట్రానికి తెలియపర్చాలన్నారు. అమరావతి రాజధానికి వైయస్ జగన్ అడ్డుపడుతున్నారు, కేంద్రం నుంచి నిధులు అందడం లేదు, చాలామంది ఇబ్బంది పెడుతున్నారని బాబు నిస్సిగ్గుగా వయసుకు తగకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.  మీరు  కుట్రలు, కుతంత్రాలతో చేస్తున్న దోపిడీకి ప్రజలు, ప్రతిపక్షాలు ఆమోదించి మీరు చెప్పినట్టు తలాడించాలా అని బాబుపై నిప్పులు చెరిగారు.  

  అందరికీ ఆమోదయోగ్యమైన రాజధాని కావాలన్నదే వైయస్సార్సీపీ, వైయస్ జగన్ అభిమతమని పార్థసారథి చెప్పారు. రాష్ట్రాభివృద్ధికి, రాజధానికి తాము అడ్డంకి కాదని, అభివృద్ధి ముసుగులో ప్రభుత్వం చేస్తున్న దోపిడీ, లోపాయికారి ఒప్పందాలకు మాత్రమే తాము వ్యతిరేకమని పార్థసారథి స్పష్టం చేశారు.  ఏ ప్రైవేటు ప్రాపర్టీ చూసుకున్నా ఓనర్ కు ఎక్కువ పర్సెంట్ ఇచ్చి వ్యాపారులకు తక్కువ ఇస్తారని, కానీ  42 పర్సెంట్ సీఆర్డీఏకు, 58 పర్సెంట్ సింగపూర్ కంపెనీలకు ఇవ్వడం దుర్మార్గమన్నారు.   స్విస్ చాలెంజ్ వెనుక లోకేష్ ఛాలెంజ్ ఉన్నందునే దాని గురించి చంద్రబాబు ఇంతగా తహతహలాడుతున్నారని పార్థసారథి దుయ్యబట్టారు. సింగపూర్ కంపెనీకి ఇచ్చే షేర్లలో నిర్మాణ బాధ్యతలు చేపట్టి వారికి 2,3 పర్సెంట్ ఇచ్చి...58లో 56 పర్సెంట్ తీసుకొని సొంత కంపెనీల జేబు నింపుకునేందుకు బాబు తాపత్రయ పడతున్నారన్నారు. ఎల్ అండ్ టీ లాంటి పెద్ద సంస్థలను కాదని బాబు రాజధాని మాటున ఏ స్థాయిలో అక్రమంగా సంపాదిస్తున్నాడో ప్రజలు గమనించాలన్నారు. 

  కేబినెట్ మీటింగ్ నారాయణ కోచింగ్ సెంటర్ లాగా ఉందని పార్థసారథి ఎద్దేవా చేశారు. ప్రజల గురించి కాకుండా స్వలాభం కోసం ఆలోచిస్తున్నారని మండిపడ్డారు. సీజనల్ సమస్యల ద్వారా ప్రజలు ఎదుర్కునే దాని గురించి కేబినెట్ లో  చర్చించకపోవడం బాధాకరమన్నారు. ఇసుక, నీరు-చెట్టు ఇలా వాటి ద్వారా ఎలా సంపాదించాలన్న ధ్యాసే తప్ప ...ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలపై ఆలోచన చేయకపోవడం దురదృష్టకరమన్నారు. రైతులు పంటలు వేసుకోవాలంటే రాష్ట్రంలో ప్రభుత్వాన్ని చూసి భయపడుతున్న పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ప్రభుత్వం చెప్పిన అబద్ధాల వల్ల నీళ్లు ఇవ్వకపోవడంతో రైతాంగం ఇదివరకే పంటలు కోల్పోయి వేల కోట్లు నష్టపోయిందన్నారు. 

  ఖరీఫ్ సీజన్ మొదలైనా ఇంతవరకు రైతులకు విత్తనాలు అందుబాటులో ఉంచిన పాపాన పోలేదు. నారుమళ్లు పోసుకునేందుకు నీళ్లు ఎప్పుడు ఇస్తారో కూడా ప్రకటన చేయలేని దుస్థితిలో ప్రభుత్వం ఉండడం సిగ్గుచేటని పార్థసారథి ధ్వజమెత్తారు. చంద్రబాబు రైతులను పూర్తిగా గాలికొదిలేశారని మండిపడ్డారు. నధుల అనుసంధానం అయిపోయిందని చెబుతున్న మీరు పంటలకు నీళ్లు ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు.  ముఖ్యమంత్రి, మంత్రులు చేతగాని వాళ్లని ప్రజలు నిర్ణయించుకున్నారని పార్థసారథి తెలిపారు. ఇప్పటికైనా రైతాంగానికి విత్తనాలు ఎలా ఇస్తారు...? ఎరువులు ఇవ్వడంలో సంసిద్ధత ఏంటి..? నీళ్లు ఎప్పుడు ఇస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. స్విస్ ఛాలెంజ్ ద్వారా కాకుండా పారదర్శకంగా రాజధాని నిర్మాణం చేయాలని ప్రభుత్వానికి హితవు పలికారు. ఎంతసేపు జగన్ జగన్ అని జపం చేయకుండా ఆయన సూచనలు కూడా తీసుకొని ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలని బాబుకు సూచించారు.
Back to Top