కోటి ఎకరాలకు జగనన్న నీరిస్తాడు

మహబూబ్‌నగర్:

కొద్దికాలం ఓపిక పట్టండి.. జగనన్న అధికారంలోకి వస్తాడు రాజన్న రాజ్యం తెస్తాడు. అందరి కష్టాలూ తీరుస్తాడు... అంటూ మహానేత వైయస్ఆర్ తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన వైయస్ షర్మిల భరోసా ఇచ్చారు. మహబూబ్‌నగర్ జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో పాదయాత్రను పురస్కరించుకుని ఆమె శుక్రవారం వివిధ ప్రాంతాలలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై జగనన్నను జైల్లో పెట్టించాయని ఆమె ఆరోపించారు. ఉదయించే సూర్యుడిని ఎలాగైతే ఆపలేమో.. జగనన్నను కూడా ఎవరూ ఆపలేరన్నారు. అన్న బయటకు వస్తాడనీ,  మనందరినీ రాజన్న రాజ్యంవైపు తీసుకెళతాడనీ చెప్పారు. రాజన్న రాజ్యం స్థాపిస్తాడని తెలిపారు. ఆ రాజ్యంలో రైతన్నను రాజులా చూస్తామనీ, రాజన్న కల అయిన కోటి ఎకరాలకు నీటిని జగనన్న ఇస్తాడనీ వివరించారు. ఆ రాజ్యంలో వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ఉంటుందన్నారు. రైతన్న గిట్టుబాటు ధరకే తమ ఉత్పత్తులను అమ్ముకోవడానికి వీలుగా రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తారని వెల్లడించారు. రైతులకు, మహిళలకు వడ్డీ లేని రుణాలు అందిస్తాడని షర్మిల ఉద్ఘాటించారు.

ప్రభుత్వం శ్రమ దోపిడీ చేస్తోంది..
     ‘ఉపాధి హామీతో రాష్ట్ర ప్రభుత్వం శ్రమ దోపిడీ చేస్తోందని ఆమె ఆరోపించారు.  ఈ పథకం కింద వైయస్ఆర్ ఉన్నప్పుడు రోజుకు రూ.90 నుంచి 120 ఇచ్చేవారు. ఇప్పుడు రోజుకు కనీసం రూ.30 కూడా అందటం లేదని, కొన్ని ప్రాంతాల్లో అయితే రూ.18 కూడా ఇవ్వడం లేదని అక్కా చెల్లెళ్లు చెబుతుండడమే దీనికి తార్కాణమని  తెలిపారు. అవి కూడా రెండు వారాలకు ఒకసారి, మూడు వారాలకొకసారి ఇస్తున్నారట.. దీంతో ఆ అక్కాచెల్లెళ్లు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందని షర్మిల ఆవేదన వ్యక్తంచేశారు. ‘జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక ప్రజల కష్టాలన్నీ తీరుస్తాడు. పిల్లలను పనికి కాకుండా బడికి పంపే తల్లుల ఖతాలో డబ్బులు వేస్తాడు. ‘అమ్మ ఒడి’ పథకం ద్వారా తల్లి బ్యాంకు ఖాతాలో పదో తరగతి వరకు రూ. 500, ఇంటరైతే రూ. 700, డిగ్రీకి వెయ్యి చొప్పున వేస్తాడు. వృద్ధులకు, వితంతువులకు రూ. 700, వికలాంగులకు రూ. 1000 పింఛనిస్తాడు. రాజన్న చెప్పినవీ చేశాడు.. చెప్పనివీ చేశాడు. జగనన్న కూడా మాట మీద నిలబడే మనిషి. చెప్పినవే కాకుండా ప్రజల అవసరాలను గమనించి అన్నీ సమకూరుస్తాడు. మైనారిటీలకు వీలైనంత ప్రయోజనం కల్పించాలన్నదే వైఎస్ లక్ష్యం. అదే లక్ష్యంతో జగనన్న పనిచేస్తాడు..’ అని ఆమె హామీ ఇచ్చారు.

Back to Top