నీరు విడుదల చేస్తారా లేదా...

ఈస్ట్‌గోదావరి:  కొత్తపేట నియోజకవర్గంలోని సాగు భూమికి అవసరమైనంత నీరు సరఫరా చేయాల్సిందేనని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఇరిగేషన్ శాఖ అధికారులను ఆదేశించారు. అలా చేయకపోతే తానే స్వయంగా లాకుల వద్ద కూర్చుంటానని, నీటి మట్టాన్ని క్రమబద్దీకరించి కోటా ప్రకారం నీటిని సరఫరా చేస్తానని స్పష్టం చేశారు.  రబీ సీజన్‌లో వరి చేలకు సాగునీరందక ఇబ్బందులు పడుతున్నామని వివిధ ప్రాంతాల రైతులు ఎమ్మెల్యేకు  మొరపెట్టుకున్నారు.  అధికారులతో కలసి పలు లాకులను, అక్కడ నీటి మట్టాలను పరిశీలించారు. బొబ్బర్లంక-గుత్తెనదీవి బ్యాంక్ కెనాల్‌పై కొత్తపేట మండలం వాడాపాలెం లాకుల్లో తగిన స్థాయిలో నీటి మట్టం కట్టకుండానే నీరు కిందకి వదిలేస్తున్నారని దీంతో మెరక  భూముల మాట అటుంచి పల్లానికి కూడా నీరందడం లేదని రైతులు ఆయనకు చెప్పారు. డీఈ సీహెచ్ గోపీనాథ్, లాకుల సూపర్ వైజర్ పి. రమేష్, ఐసీ అసిస్టెంట్ ఎ.లక్ష్మీనారాయణ, లస్కర్లతో అక్కడికక్కడే ఎమ్మెల్యే పరిస్థితిని సమీక్షించారు. నియోజక వర్గం మీదుగా మళ్లిస్తూ, ఇక్కడి భూములకు నీరివ్వకపోతే చూస్తూ ఊరుకోబోనని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అధికారులకు తేల్చిచెప్పారు. చానల్ చివరి ఎకరాకు కూడా సాగు నీరందాలన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో సాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకున్నారని, అయితే నేటి ప్రభుత్వం సాగునీటి కొరతపై నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని ఆయన ధ్వజమెత్తారు. రుణాలు ఇవ్వరు, అప్పులు చేసి సాగుచేస్తుంటే నీరూ ఇవ్వనంటే ఎలా? అని అసహనం వ్యక్తం చేశారు. వైఎస్‌ఆర్‌సీపీ  రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గొల్లపల్లి,  జిల్లా  సేవాదళ్ అధ్యక్షుడు  గంగాధరావు, నాయకులు  మూర్తి, నేలపూడి భీమరాజు పాల్గొన్నారు.
Back to Top