చంద్రబాబు పైనా విచారణ కోరండి: కొణతాల

హైదరాబాద్ 25 సెప్టెంబర్ 2013:

క్షుద్ర రాజకీయ క్రీడలో లోక్ సత్తా నేత జయప్రకాశ్ నారాయణ్ ఓ పావుగా మారారనిపిస్తోందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమన్వయకర్త కొణతాల రామకృష్ణ అభిప్రాయపడ్డారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో బుధవారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడారు. నిరాధార ఆరోపణలు చేయడంలో ఆయన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో పోటీపడుతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు మాదిరిగానే జగన్ గారి కేసును నిర్భయ కేసుతో పోలుస్తూ ఫాస్టు ట్రాక్ కోర్టులో పెట్టాలని డిమాండ్ చేశారన్నారు. గతంలో చంద్రబాబుపై వచ్చిన ఆరోపణలపై జేపీ సీబీఐ దర్యాప్తును డిమాండ్ చేస్తారా అని ప్రశ్నించారు. తమ పార్టీ అధ్యక్షుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి బయటకు రావడంతో కొన్ని పార్టీల గుండెల్లో రైళ్ళు పరుగెడుతున్నాయని చెప్పారు. ఫాస్టు ట్రాక్ కోర్టులో విచారిస్తే ఆయన సత్వరమే నిర్దోషిగా బయటకు వస్తారని కొణతాల పేర్కొన్నారు. జయప్రకాశ్ నారాయణ్ వైఖరి చూస్తుంటే జగన్ గారి కేసు ఒక్కటే అవినీతి కేసనీ, మిగిలిన అన్ని రాజకీయ పార్టీలు లేదా వ్యక్తులూ నీతిగా ఉన్నారన్నట్లుందని చెప్పారు. ఐఎమ్జీ భారత్ అనే విదేశీ ఫేక్ కంపెనీకి చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కొన్ని వందల ఎకరాలు అప్పజెప్పారనీ, ఆ కంపెనీ మోసం తర్వాత బయటపడిన సంగతిని జయప్రకాశ్ మరిచారా అని కొణతాల నిలదీశారు. ఇది కాక ఇమార్, తదితర అంశాల్లో కొన్ని వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందన్నారు. వీటిమీద కూడా జయప్రకాశ్ నారాయణ్ విచారణ కోరి ఉంటే సంతోషించి ఉండేవారమన్నారు. 2006లో మార్గదర్శి ఫైనాన్సు అంశంలో రిజర్వు బ్యాంకు నోటీసులిచ్చినప్పుడు జయప్రకాశ్ నారాయణ్ ఇది చాలా అన్యాయమంటూ మాట్లాడిన సందర్భాన్ని గుర్తుచేసుకోవాలని సూచించారు. వ్యాపార సంస్థల మీద దర్యాప్తు చేయిస్తే దేశ ప్రయోజనాలకే భంగం కలుగుతుందని ఆయన అప్పట్లో చెప్పారన్నారు. 11-11-2006లో జయప్రకాశ్ నారాయణ్ మాట్లాడింది ప్రచురించారని చెబుతూ దాన్ని చదివి వినిపించారు.

జగన్మోహన్ రెడ్డి గారికి బెయిలు రాగానే రాష్ట్రంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కిందని కొణతాల చెప్పారు. ఈనాడులో సంపాదకీయం రాయడం, చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ విమర్శలు గుప్పించండం దీనికి తార్కాణమన్నారు. అధికార కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీల గుండెల్లో రైళ్ళు పరుగెడుతున్నాయని చెప్పారు.

Back to Top