కేశ‌వ‌రెడ్డి బాధితుల పోరాటం ఉధృతం

నంద్యాల‌: కేశవరెడ్డి విద్యాసంస్థల అధినేత కేశ‌వ‌రెడ్డి చేసిన మోసానికి వ్య‌తిరేకంగా చేప‌ట్టిన ఉద్య‌మం ఉధృత‌మ‌వుతోంది.  పిల్లల భవిషత్తుతో ఆట‌లాడిన కేశ‌వ‌రెడ్డిని ప్ర‌భుత్వం వెనుకేసుకొని రావ‌డంతో బాధితులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఇప్ప‌టికే ప‌లుమార్లు ధ‌ర్నాలు, ఆందోళ‌న కార్య‌క్ర‌మాలు చేప‌ట్టిన బాధితుల సంఘం మ‌రోమారు ఆందోళ‌న బాట ప‌ట్టింది. ఇవాళ నంద్యాల‌లో ధ‌ర్నా చేప‌ట్టిన బాధితులు త‌మ పోరాటానికి మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షమైన వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత‌ల‌ను కోరారు. మంగ‌ళ‌వారం బాధితుల సంఘం నాయ‌కులు నంద్యాల‌లో పార్టీ సీనియ‌ర్ నేత బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, ఎమ్మెల్సీ గంగుల ప్ర‌భాక‌ర్‌రెడ్డిల‌ను క‌లిశారు.  పిల్ల‌ల‌ను ఉన్న‌తంగా చ‌దివించుకునేందుకు జిల్లావ్యాప్తంగా కేశవరెడ్డి స్కూల్ లో తమ పిల్లలను చేర్పించామ‌ని వాపోయారు. పిల్లల చదువుకోసం కేశ‌వ‌రెడ్డి లక్షల రూపాయలను డిపాజిట్ చేయించుకున్నార‌ని, మ‌రి కొంత మంది వ‌ద్ద  అఫ్పులు కూడా తీసుకున్నార‌ని తెలిపారు. పెద్ద సంస్థ మాసొమ్ము ఎక్కడికి పోతుందిలే అనుకొని ప్రజలు అడిగినకాడికి అప్పజెప్పామ‌ని వైయ‌స్ఆర్‌సీపీ నేత‌ల‌కు ఫిర్యాదు చేశారు. స్కూల్లో డిపాజిట్ చేసిన డబ్బు అప్పుగా తీసుకున్న డబ్బుతో కేశవరెడ్డి అంచెలంచెలుగా ఎదిగారని,రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థలను నెలకొల్పి కోట్లకు పడగలెత్తార‌ని చెప్పారు. అయితే  విద్యాసంస్థల అభివృద్ధికి  మా వ‌ద్ద తీసుకున్న డబ్బు ఇవ్వ‌కుండా మోసం చేశార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. పిల్లల  పేరుమీద డిపాజిట్ అమౌంట్ ను మెచ్యూరిటీ టైం అయిపోయిన తర్వాత నెలనెలా తిరిగి ఇవ్వాల్సి ఉండ‌గా,  కొద్దినెలలు డబ్బు ఇచ్చిన కేశవరెడ్డి ఆ తరువాత మెహం చాటేశార‌ని చెప్పారు.  కేశవరెడ్డిని అరెస్ట్ చేశారుకానీ మాకు రావాల్సిన డబ్బు ఇంతవరకు అందలేదని వారు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. కేశవరెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత కేసును సీఐడీకి అప్పగించారని పలుసార్లు సీఐడీ కార్యాలయానికి వెళ్లి బిల్లు సమర్పించినా మాకు ఇంతవరకు డబ్బు రాలేదని వారు వాపోతున్నారు. కేశవరెడ్డిని అరెస్ట్ చేస్తే ఆయన జైల్లో ఎంజాయి చేస్తున్నారని ఆయన కొడుకు స్కూళ్లను యధావిధిగా నడుపుతున్నారని డబ్బుకట్టిన మేముమాత్రం రోడ్డున పడ్డామని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేశవరెడ్డికి ప్రభుత్వ అండ ఉంది కాబట్టే మా సమస్య పరిష్కారం కావడంలేదని వారు ఆరోపించారు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసిన ప్రభుత్వం మా సమస్యను ఎందుకు పట్టించుకోవడం లేదని వారు ప్రశ్నిస్తున్నారు. ఆదుకోవాల్సిన పాలకులే ఆదుకోలేద‌ని మండిప‌డ్డారు. మీరే మా పక్షాన నిలబడి మా సమస్యను ప్రభుత్వానికి తెలియజేయాల‌ని  బాధితులు వైయ‌స్ఆర్‌సీపీ నేత‌ల‌ను కోరారు. బాధితుల‌కు న్యాయం జ‌రిగే విధంగా వైయస్ఆర్ సిపి  పార్టీ అండ‌గా ఉంటుంద‌ని నాయకులు భరోసా ఇచ్చారు.




Back to Top