కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు బాబు రక్షణ

పులివెందుల (కడప జిల్లా),

22 మే 2013: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజా సంక్షేమం పట్టడంలేదని శ్రీమతి విజయమ్మ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌, టిడిపి కుమ్మక్కై జగన్‌బాబును బయటికి రానివ్వకుండా అడ్డుకుంటున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. అన్ని విషయాల్లోనూ ప్రజలపై ఆర్థిక భారాలు మోపుతున్నాయని విమర్శించారు. కిరణ్‌ కుమార్‌రెడ్డి ప్రభుత్వం మైనార్టీలో పడిందని వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు‌ శ్రీమతి వైయస్ విజయమ్మ వ్యాఖ్యానించారు. అయినా ఈ మైనార్టీ ప్రభుత్వాన్ని ‌టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విప్ జారీ చేసి కాపాడారని ఆమె అన్నారు. రాష్ట్రంతో పాటు కేంద్రాన్ని కూడా ‌చంద్రబాబు నాయుడే కాపాడుతున్నారని శ్రీమతి విజయమ్మ ఆరోపించారు. ప్రభుత్వానికి నిరంతరం చెక్‌ చెప్పాల్సిన  ప్రధాన ప్రతిపక్షం దానికే వంత పాడుతోందని నిప్పులు చెరిగారు. తన సొంత నియోజకవర్గం పులివెందుల పర్యటనలో ఉన్న శ్రీమతి విజయమ్మ బుధవారంనాడు మీడియా సమావేశంలో మాట్లాడారు.

ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి చంద్రబాబు కాంగ్రెస్తో దోస్తీ కట్టార‌ని శ్రీమతి విజయమ్మ ఆరోపించారు. కాంగ్రెస్-‌టిడిపి కుమ్మక్కై జగన్‌బాబును జైల్లో పెట్టించాయని అన్నారు. చంద్రబాబు తనపై విచారణ జరగకుండా చేసుకునేందుకే శ్రీ జగ‌న్‌ను టార్గెట్ చేశారని ఆరోపించారు. అవినీతి మంత్రులంటూ చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని‌ శ్రీమతి విజయమ్మ మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో జరిగిన అక్రమాలపై విచారణ జరగాలని ఈ సందర్భంగా శ్రీమతి విజయమ్మ డిమాండ్‌ చేశారు. ఢిల్లీలో చంద్రబాబు కాంగ్రెస్‌ పెద్దలతో రహస్యంగా మంతనాలు సాగించారని ఆరోపించారు. ఏలేరు కుంభకోణం మొదలు చంద్రబాబు హయాంలో జరిగిన అనేక కుంభకోణాలపై విచారణ జరగకుండా స్టేలు తెచ్చుకుని మేనేజ్‌ చేసుకుంటున్నారని శ్రీమతి విజయమ్మ విమర్శించారు.

విద్యుత్‌ చార్జీల పెంపు పేరుతో కిరణ్‌ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలపై రూ. 32 వేల కోట్ల భారం మోపిందని శ్రీమతి విజయమ్మ విమర్శించారు. దానితో పాటు చార్జీలు, ధరలు పెంచేసిందన్నారు. ఏ వ్యవస్థనూ సరిగా నడిపించే స్థితిలో ఈ ప్రభుత్వం లేదన్నారు. వివాదాస్పద 26 జిఓలు సక్రమమా కాదా అన్నదానిపై కిరణ్‌ ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేయకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిందని దుయ్యబట్టారు. అఫిడవిట్‌ ఆ రోజే వేసి ఉంటే ఈ రోజు మంత్రులకు ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. 'చెడపకురా చెడేవు' సామెత మాదిరిగా కాంగ్రెస్‌ మంత్రుల తీరు ఉందన్నారు. ఆనాడు ఆ జిఓలపై నోరు విప్పని మంత్రులు అవన్నీ నిబంధనల ప్రకారమే జరిగాయంటూ ఇప్పుడు చెబుతున్నారని అన్నారు.

అవినీతి మంత్రులంటేనే వారు అంతలా బాధపడిపోతున్నారని... అయితే మరణించిన రాజశేఖరరెడ్డిపై అలాంటి ఆరోపణలు చేయడం ఎంతవరకూ సబబని శ్రీమతి విజయమ్మ నిలదీశారు. జగన్‌బాబును సెక్రటేరియట్‌లో ఏ రోజైనా చూశారా? అని ఆమె సూటిగా ప్రశ్నించారు. మంత్రికాదు, ఎంపి కాదు, ఎమ్మెల్యే కాదు, అధికారి కాదు అలాంటి‌ శ్రీ జగన్మోహన్‌రెడ్డి అవినీతికి ఎలా పాల్పడగలరని శ్రీమతి విజయమ్మ నిలదీశారు. పోనీ పలానా పని చేయండి అని ఏ అధికారికి గాని, మంత్రికి గానా జగన్‌బాబు కనీసం ఫోన్‌ కూడా చేయలేదని ఆమె తెలిపారు.

రాజ్యాంగం కల్పించిన బెయిల్‌ పొందే హక్కును కూడా జగన్‌బాబు విషయంలో ఈ ప్రభుత్వం కాలరాచిందని శ్రీమతి విజయమ్మ ఆరోపించారు. జగన్‌బాబు ఏ తప్పూ చేయలేదని, కడిగిన ముత్యంలా బయటికి వస్తారని ఆమె ధీమాగా చెప్పారు. జగన్‌బాబు బయటికి వస్తారని, మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ఆశయాలన్నింటినీ నెరవేరుస్తారని శ్రీమతి విజయమ్మ పేర్కొన్నారు. జగన్‌బాబు అధికారంలోకి వచ్చిన తరువాత హామీలన్నింటినీ నెరవేరుస్తారన్నారు.

Back to Top