కాంగ్రెస్‌, టిడిపిలకు బుద్ధి చెప్పండి

మర్రిగూడెం (నల్గొండ జిల్లా), 9 ఫిబ్రవరి 2013: ప్రజా సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ‌అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల దుమ్మెత్తిపోశారు. మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా ఆమె శనివారం రాత్రి 7 గంటలకు మర్రిగూడలో నిర్వహించిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. యువతకు ఉద్యోగాలు లేవు, మహిళలకు ఉపాధి లేదు, నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని, ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

శ్రీశైలం నీరు తప్పకుండా నల్గొండిజిల్లాకు తీసుకురావాలని దివంగత మహానేత డాక్టర్‌ రాజశేఖరరెడ్డి ఎస్‌ఎల్‌బిసి ప్రాజెక్టును చేపట్టారు. ఫ్లోరోసిస్‌ బారిన పడి అనేక కష్టాలు ఎదుర్కొంటున్న జిల్లా వాసులను దాని బారి నుంచి తప్పించాలని, సాగునీరు, తాగునీరు అందించాలని ఎంతగానో తపించారు. అయితే, ఆయన ఆకస్మిక మరణంతో ఆ ప్రాజెక్టు పూర్తిగా ఆగిపోయిందని శ్రీమతి షర్మిల ఆవేదన వ్యక్త చేశారు. శ్రీశైలం సొరంగ మార్గం ద్వారా జిల్లాకు నీరు తేవాలని ఆ మహానేత ఒక్కరే ఆలోచించి మొదలుపెట్టారన్నారు. ఆయన మరణం తరువాత ఒక్క గ్రామానికంటే ఒక్క గ్రామానికి కూడా ఈ ప్రభుత్వం నీళ్ళు ఇవ్వడంలేదని దుయ్యబట్టారు. జగనన్న ముఖ్యమంత్రి అయితేనే గానా ఎస్‌ఎల్‌బిసి నీళ్ళు వచ్చే పరిస్థితి లేదని శ్రీమతి షర్మిల అన్నారు.

చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఫ్లోరైడ్‌ పీడిత ప్రాంతాల కోసం రూ. 9 కోట్లు మాత్రమే ఖర్చుచేశారని, అదే వైయస్‌ఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్ళలోనే 375 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి 450 గ్రామాలకు క్రిష్ణా నీళ్ళు సరఫరా చేశారని శ్రీమతి షర్మిల గుర్తుచేశారు. వైయస్‌ బ్రతికి ఉంటే నల్గొండజిల్లాలోని మిగిలిన 550 గ్రామాలకు కూడా నీళ్ళు వచ్చేసేవి అన్నారు. విద్యుత్‌ లేదని, నీళ్ళు లేవని, ఎలాగోలా పంట పండిస్తే మద్దతు ధర లేదని, ఎరువుల ధరలు మాత్రం కొండెక్కి కూర్చున్నాయని ఏ రైతును కదిలించినా బోరున విలపిస్తున్నారని శ్రీమతి షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. రాజశేఖరరెడ్డి బ్రతికి ఉన్నప్పుడు రైతు మహరాజుల బ్రతికాడని ఆమె పేర్కొన్నారు. తనను ప్రేమించేవాడు, గౌరవించేవాడు అధికారంలో ఉన్నాడని రైతన్న తల ఎత్తుకుని తిరిగేవాడని అన్నారు.

మహానేత వైయస్‌ 1300 కోట్ల రూపాయల విద్యుత్‌ బకాయిలను మాఫీ చేసిన ఉదంతాన్ని ఈ సందర్భంగా శ్రీమతి షర్మిల ప్రస్తావించారు. అన్నదాతకు అనుకూలంగా అన్ని రకాల ఆలోచనలు చేసింది ఒక్క వైయస్‌ఆర్‌ అన్నారు. 12 వేల కోట్లతో లక్షల మందికి రుణ మాఫీ కూడా ఆయన చేశారని తెలిపారు. మహిళలు, విద్యార్థులు, వికలాంగులు, వితంతువులు, వయోధికులను కూడా మహానేత వైయస్‌ మంచిగా చూసుకున్నారన్నారు. ప్రతి ఇంటిలోని బిడ్డలు గొప్ప చదువులు చదివి మంచి మంచి ఉద్యోగాలు చేయాలని ఆయన కలలు కన్నారని గుర్తుచేశారు. కుటుంబాలు ఆర్థికంగా ఎదగాలంటే ప్రతి కుటుంబంలోని బిడ్డలు ఉన్నత చదువులు చదవాలని ఆయనకు తెలుసు కనుకే వారు ఏది కావాలంటే అది చదువుకునేలా ప్రోత్సహించారన్నారు. కానీ, ప్రస్తుత ప్రభుత్వం నిర్వాకం వల్ల ఎంతో మంది చదువులు మధ్యలోనే వదిలేసి కూలిపనికి వెళ్ళాల్సిన దుస్థితి వచ్చిందని శ్రీమతి షర్మిల ఆవేదన వ్యక్తంచేశారు. ఈ పాపం కాంగ్రెస్‌ ప్రభుత్వానికి కాదా అని నిలదీశారు.

చదువుకున్న వారికేమో ఈ ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించడంలేదని, తీవ్రమైన కరెంటు కోత వల్ల వేలాది పరిశ్రమలు మూతపడిపోయి, లక్షలాది మంది కార్మికులు రోడ్డున పడిపోతున్నారని శ్రీమతి షర్మిల విచారం వ్యక్తంచేశారు. ఒక పక్కన ఉపాధి కల్పించలేని ప్రభుత్వానికి ఉన్న పని కూడా ఊడగొట్టే అధికారం ఎవరిచ్చారని నిలదీశారు. మహిళలకు పావలా వడ్డీ అందడం లేదు. రెండు రూపాయల వడ్డీ వసూలు చేస్తున్నారని, ఎందుకు తీసుకున్నాం పావలా వడ్డీ రుణం అని మహిళలు వాపోతున్నారన్నారు. ప్రభుత్వం ఇష్టానుసారం పెంచేస్తున్న విద్యుత్‌ బిల్లులు కట్టేందుకు ఇంటిలోని సామాను, బంగారు నగలు అమ్ముకోవాల్సిన దుస్థితి దాపురించిందన్నారు.

ప్రజల కష్టాలను అటు ప్రభుత్వం, ఇటు ప్రతిపక్ష నేత చంద్రబాబు పట్టించుకోవడం లేదని శ్రీమతి షర్మిల తీవ్రస్థాయిలో విమర్శలు సంధించారు. కిరణ్ ప్రభుత్వం చేసే తప్పులు ‌చంద్రబాబుకు కనపడవట. తన మీద ఉన్న కేసులను కాంగ్రెస్‌ ప్రభుత్వం బయటికి తీయకుండా ఉండేందుకే ఆ తప్పులు ఆయనకు కనిపించవట అని విమర్శించారు. కిరణ్ ప్రభుత్వాన్ని చంద్రబాబు కాపాడు‌తున్నారని, అందుకే అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టరని అన్నారు. ఇది తుగ్లక్‌ పరిపాలన అంటూ చంద్రబాబు కల్లబొల్లి శాపనార్థాలు పెడతారు. దేశంలో ఎక్కడ చూసినా ఆయన హెరిటేజ్‌ దుకాణాలున్నాయి. సింగపూర్‌, మలేషియాల్లో ఆయనకు హొటళ్ళు, అస్తులు ఎన్నో ఉన్నాయని చెప్పారు.

చంద్రబాబు మీద చాలా అవినీతి ఆరోపణలు, కేసులు ఉన్నాయని, వాటిని కాంగ్రెస్‌ ప్రభుత్వం విచారణ పెట్టకుండా ఉండడం కోసం ఆయన అవిశ్వాస తీర్మానం పెట్టరట. ఆపద్ధర్మి ముఖ్యమంత్రిగా చంద్రబాబు వందల వేల కోట్ల రూపాయల విలువైన భూములను తన బినామీలకు, కావలసిన వారికి అప్పనంగా కట్టబెట్టేశారు. అయినా, ఆయనపై కేసులు పెట్టరట అని శ్రీమతి షర్మిల నిప్పులు చెరిగారు. చీకట్లో చిదంబరాన్ని కలవడం చంద్రబాబు నైజం అని విమర్శించారు. వేలాది మంది చిల్లర వ్యాపారుల పొట్ట కొట్టే విధంగా చంద్రబాబు ఎఫ్‌డిఐ బిల్లుకు పరోక్షంగా మద్దతిచ్చిన వైనాన్ని పేర్కొన్నారు.

అధికార, ప్రతిపక్షాలు ఏకమైపోవడం మన రాష్ట్రానికి పట్టిని శాపం అని దుమ్మెత్తిపోశారు. ఎన్నికల్లో ఆ రెండు పార్టీలో లోపాయికారీ ఒప్పందాలతో పని చేసుకుంటున్నాయన్నారు. ఆ రెండు పార్టీలకు శ్రీ జగన్‌ ఒక్కరే టార్గెట్‌ అన్నారు. జగనన్న అంటే వారికి హడల్ అన్నారు. రాజన్న వారసుడని, జనం కోసం అహరహం శ్రమిస్తాడని, ఇచ్చిన మాట కోసం ఎంతకైనా నిలబడతాడని, ప్రజల గుండెల్లో గూడు కట్టుకుంటున్నారని కాంగ్రెస్‌, టిడిపి నాయకులు బెంబెలెత్తిపోతున్నారని అన్నారు. ఆ రెండు పార్టీలకు మనుగడ ఉండదని, దుకాణాలు మూసేసుకోవాల్సి వస్తుందని, జగనన్నను కుట్ర చేసి జైలుకు పంపించడమే కాకుండా బెయిల్‌ కూడా రాకుండా చేస్తున్నారని దుయ్యబట్టారు.

కేంద్ర ప్రభుత్వం చేతిలో సిబిఐ కీలుబొమ్మలా వ్యవహరిస్తోందని శ్రీమతి షర్మిల విమర్శించారు. జగనన్న కాంగ్రెస్‌లోనే ఉంటే కేంద్రమంత్రి అయ్యేవారని, సిఎం కూడా అయ్యేవారని గులాం నబీ ఆజాద్‌ స్వయంగా చేసిన వ్యాఖ్యలను ఆమె ఉటంకించారు. కాంగ్రెస్‌తో విభేదించినందువల్లే జగనన్న ఈ రోజు ఇన్ని కష్టాలు పడుతున్నారని అన్నారు. కానీ, దేవుడనే వాడున్నాడని, మంచివాళ్ళ పక్షాన ఆయన తప్పకుండా నిలబడతాడన్నారు. ఉడయించే సూర్యుడ్ని ఎవ్వరూ ఎలా ఆపలేరో జగనన్నను కూడా ఆపలేరని శ్రీమతి షర్మిల ధీమాగా చెప్పారు. జగనన్న బయటికి వస్తారని, మనందర్నీ రాజన్న రాజ్యం దిశగా నడిపిస్తాడని అన్నారు. అంతవరకూ జగనన్నను ఆశీర్వదించాలని, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని బలపరచాలని, తమతో కలిసి కదం తొక్కాలని శ్రీమతి షర్మిల పిలుపునిచ్చారు. షర్మిల ప్రసంగం ఆసాంతం అభిమానులు, స్థానికులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ విన్నారు.
Back to Top