'కాంగ్రెస్‌ కుట్రలకు ప్రజలే గుణపాఠం చెబుతారు'

పొదలకూరు (పిఎస్‌ఆర్‌ నెల్లూరు జిల్లా): వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ జగన్మోహన్‌రెడ్డిపై కుట్రలు, కుయుక్తులు పన్నుతున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలే సరైన బుద్ధి చెబుతారని వైయస్‌ఆర్‌సిపి నెల్లూరు జిల్లా కన్వీనర్ కాకాణి గోవర్ధ‌న్‌రెడ్డి పేర్కొన్నారు. పొదలకూరులో బుధవారం జరిగిన పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

శ్రీ జగన్మోహన్‌రెడ్డికి రోజురోజుకూ పెరుగుతున్న ప్జల ఆదరణను చూసి ఓర్వలేని కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని అ‌డ్డు పెట్టుకుని కుయుక్తులు పన్నుతోందన్నారు. శ్రీ జగన్మోహన్‌రెడ్డిని ఎలాగైనా అణచివేయాలని చూస్తోందని దుయ్యబట్టారు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలే‌నట్లే వెల్లువలా దూసుకుపోతున్న శ్రీ జగన్‌ కూడా ఆపలేరనే విషయం కాంగ్రెస్ పార్టీ తెలుసుకోవాల‌ని సూచించారు. శ్రీ జగన్మోహన్‌రెడ్డిపై ఇదే వైఖరి కొనసాగిస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉనికి కూడా ఉండద‌ని కాకాణి హెచ్చరించారు. శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డికి ప్రజలు అండగా ఉన్నంత కాలం ఎవ్వరూ ఏమీ చేయలేరన్నారు.

కాంగ్రెస్ పార్టీ తన అధికార దాహానికి ‌సిబిఐ పరువును కూడా గంగ పాలుచేసిందని కాకాణి గోవర్ధన్‌రెడ్డి విమర్శించారు. శ్రీ జగన్మోహన్‌రెడ్డిని అరెస్టు చేసి బెయిల్ రాకుండా చేసినందుకు ‌సిబిఐ కూడా త్వరలో తగిన ఫలితం అనుభవించాల్సి వస్తుందన్నారు. సిబిఐపై ప్రజల్లో విశ్వసనీయత సన్నగిల్లిందన్నారు.

ఇప్పటికైనా శ్రీ జగన్మోహన్‌రెడ్డి విషయంలో కుట్ర పూరిత ఆలోచనలకు స్వస్తి పలకాలని కాకాని అన్నారు. శ్రీ జగన్మోహన్‌రెడ్డికి బెయిల్ రాకుండా అడ్డుకుంటున్న కాంగ్రె‌స్, ‌సిబిఐకు గుణపాఠం నేర్పడానికే కోటి సంతకాల సేకరణ చేపట్టినట్లు తెలిపారు.
Back to Top