జేసీ ట్రావెల్స్ యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలి

గరిడేపల్లి(హుజూర్‌నగర్‌): తెలంగాణలో దివాకర్‌ ట్రావెల్స్‌ను పూర్తిస్థాయిలో నిషేధించి ప్రమాదానికి కారణమైన ట్రావెల్స్‌ యాజమాన్యంపై క్రిమినల్‌ కేసులు పెట్టి అరెస్టు చేయాలని వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్‌ గట్టు శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. కృష్ణా జిల్లాలో జరిగిన ట్రావెల్స్‌ బస్సు ప్రమాదంలో మరణించిన సోదరులు డాక్టర్‌ శేఖర్‌రెడ్డి, కృష్ణారెడ్డిల మృతదేహాలను సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కోదండరాం పురంలో బుధవారం ఆయన సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం మృతుల తల్లిదండ్రులు శేషిరెడ్డి, కమలమ్మలను పరామర్శించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ కేవలం యజమాని నిర్లక్ష్యం, డ్రైవర్‌ అజాగ్రత్త వల్లే ఈ ప్రమాదం జరిగి 11 ప్రాణాలు పోయాయన్నారు. 

దివాకర్‌ ట్రావెల్స్‌ యాజమాన్యం.. మృతులకు ఒక్కొ క్కరికి రూ. 25 లక్షల నష్ట పరిహారం అందించాలని, ఘటనకు దివాకర్‌ ట్రావెల్స్‌ పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. ప్రమాదస్థలానికి చేరుకొని మృత దేహాలను పరామర్శించేందుకు వెళ్లిన తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని టీడీపీ ప్రభుత్వం అడ్డుకోవటం సిగ్గుచేటన్నారు.  జగన్‌ పట్ల అధికారులు వ్యవహరించిన తీరు బాధాకరమన్నారు. చంద్రన్న బీమా పథకం ఉంటే ఎక్స్‌గ్రేషియా ఇస్తామ నడం బాధాకరమన్నారు.  తెలంగాణ ప్రభుత్వం స్పందించి మృతుల కుటుం బాలకు ఒక్కొక్కరికి రూ. 20 లక్షల చొప్పున నష్ట పరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు.   ఆయన వెంట వైయస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శులు వేముల శేఖర్‌రెడ్డి, దొంతిరెడ్డి సైదిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్త రామకృష్ణారెడ్డి, చిత్తలూరి సోమయ్య గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.
Back to Top