విశ్వసనీయతకు వారసుడు జగన్‌ ఒక్కరే

హైదరాబాద్:

రాష్ట్రంలో విశ్వసనీయతకు వారసత్వంగా ఉన్న నాయకుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి ఒక్కరే అని, అందుకే ఆయన నాయకత్వంలో పనిచేయాలని టీడీపీలో పదవిని వదులుకుని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరానని చిత్తూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు జంగాలపల్లి శ్రీనివాసులు తెలిపారు. టీడీపీకి గుడ్‌బై చెప్పిన శ్రీనివాసులు శ్రీ వైయస్‌ జగన్‌ సమక్షంలో మంగళవారం వైయస్ఆర్‌సీపీలో చేరారు. తన అనుచరులతో వచ్చిన శ్రీనివాసులును శ్రీ జగన్‌ సాదరంగా ఆహ్వానించి పార్టీ కండువాలను వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ చేరిక సందర్భంగా రాజంపేట లోక్‌సభా నియోజకవర్గం వైయస్ఆర్‌సీపీ సమన్వయకర్త పి.మిథున్‌రెడ్డి కూడా ఉన్నారు.

విశ్వసనీయతే లేని చంద్రబాబు: జంగాలపల్లి

చంద్రబాబు ఏ మాత్రం విశ్వసనీయత లేని నాయకుడని, అసలు ఆయనకు మనుషులంటే అభిమానమే లేదని, ఎవరినీ ఆదరించే తత్వం లేదని జంగాలపల్లి శ్రీనివాసులు విమర్శించారు. చిత్తూరు జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో చంద్రబాబు అనుసరిస్తున్న అస్తవ్యస్త విధానాలను పార్టీ నేతలు, కార్యకర్తలందరూ ముక్త కంఠంతో ఖండిస్తున్నామన్నారు. చంద్రబాబు నాయుడు చేసిన తప్పులు, అన్యాయాలను తప్పకుండా ప్రజలకు చాటి చెబుతామని అన్నారు. చంద్రబాబులో విశ్వసనీయత లేదని, విశ్వసనీయతకు శ్రీ వైయస్ జగ‌న్‌ వారసుడని పేర్కొన్నారు. వైయస్ఆర్‌సీపీలో తాను చేరడానికి ఇదే ప్రధాన కారణమని చెప్పారు. ‘ఇకపై శ్రీ జగన్ ఏం చెబితే జిల్లాలో అది చేస్తాం. ఆయన ముఖ్యమంత్రి అయ్యేందుకు అన్ని విధాలా గట్టిగా కృషి చేస్తాం’ అని శ్రీనివాసులు స్పష్టం చేశారు.

Back to Top