రాహుల్ కోస‌మే సోనియా రాష్ట్ర విభజన

హైదరాబాద్, 5 అక్టోబర్ 2013:

ఓట్లు, సీట్ల కోసం, తన కొడుకు రాహుల్‌గాంధీని ప్రధానమంత్రిని చేయడం కోసమే సోనియా గాంధీ రాష్ట్రాన్ని విభజిస్తున్నారని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆరోపించారు. కేంద్రంలోని వాళ్ళు బుద్ధి లేకుండా విభజిస్తుంటే.. మీరెందుకయ్యా మద్దతిస్తున్నారని చంద్రబాబు నాయుడిని ఆయన ప్రశ్నించారు. సమస్యకు పరిష్కారం ఎప్పుడూ కన్న తండ్రిలా ఆలోచించి చేయాలని సూచించారు. అలా పరిష్కరించలేనప్పుడు యధాతథ స్థితినే కొనసాగించాలన్నారు. లోటస్‌పాండ్‌లోని తన క్యాంపు కార్యాలయం ఆవరణలో శనివారం ఉదయం 'సమైక్య దీక్ష' ప్రారంభించారు. అనంతరం శ్రీ జగన్‌ మీడియాతో మాట్లాడారు.

చంద్రబాబు నాయుడు నిరాహార దీక్ష ఎందుకు చేస్తున్నారని శ్రీ జగన్మోహన్‌రెడ్డి సూటిగా ప్రశ్నించారు. ఇదే ప్రశ్నను చంద్రబాబును అడగాలని మీడియాకు ఆయన విజ్థప్తి చేశారు. విభజనకు వ్యతిరేకమని చెబుతూ.. సమైక్యాంధ్రకు అనుకూలంగా లేఖ ఇచ్చిన తరువాతే దీక్ష చేయాలని చంద్రబాబు నాయుడికి ఆయన సూచించారు. అలా చేస్తే తాను కూడా ముందుకు వచ్చి చంద్రబాబుకు మద్దతు ఇస్తానని చెప్పారు.

రాష్ట్రం ఒక్కటిగా ఉన్నప్పుడే మహారాష్ట్ర అవసరాలు తీరిన తరువాత కానీ మన రాష్ట్రానికి నీళ్ళు రావడంలేదని, కర్నాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్‌ డ్యాంలు నిండితేనే తప్ప నీరు కిందికి రాని పరిస్థితి ఉందని శ్రీ జగన్‌ గుర్తుచేశారు. మధ్యలో ఇంకొక రాష్ట్రం వస్తే.. శ్రీశైలం ప్రాజెక్టుకు నీళ్ళెలా వస్తాయని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. దాని దిగువన ఉన్న నాగార్జునసాగర్‌కు కూడా నీళ్ళెలా వస్తాయన్నారు. కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా సముద్రపు నీళ్ళు తప్ప మంచినీళ్ళెక్కడ ఉన్నాయని ప్రశ్నించారు.

ఇలాంటి పరిస్థితుల మధ్యలో మంత్రుల బృందం (జిఒఎం) ఆరు వారాల్లో పరిష్కారం చూపుతారట! అని శ్రీ జగన్‌ వ్యాఖ్యానించారు. ఆరు వారాల్లో చూపించే పరిష్కారం ఎలా ఉంటుందంటే.. ట్రిబ్యునల్‌ను వేస్తారని, ఆ ట్రిబ్యునల్‌ ఉంటుంది కాబట్టి ఇక సమస్య ఉండదని అంటారన్నారు. ఇప్పటికే ట్రిబ్యునల్సు లేవా అని ఆయన ప్రశ్నించారు. ట్రిబ్యునల్సు ఉండగానే కావేరి నదీ జలాల విషయంలో తమిళనాడు - కర్నాటక ప్రతి సంవత్సరమూ కొట్టుకుంటున్నాయని శ్రీ జగన్మోహన్‌రెడ్డి సూటిగా ప్రశ్నించారు. అదే విధంగా ట్రిబ్యునల్సు ఉండగానే మహారాష్ట్ర అవసరాలు తీరితేనే కాని కృష్ణా జలాలు మన రాష్ట్రానికి రావన్నారు. ఈ ట్రిబ్యునల్సు ఉండగానే ఆల్మట్టి, నారాయణపూర్‌ డ్యాంలు నిండితేనే కానీ శ్రీశైలం, నాగార్జునసాగర్‌లకు నీళ్ళు వచ్చే పరిస్థితి ఉండబోదని ఆందోళన వ్యక్తంచేశారు.

ఓట్లు, సీట్ల కోసం, తన కొడుకును ప్రధానమంత్రిని చేయడం కొరకు రాష్ట్రంలోని బిడ్డలతో చెలగాటం ఆడుతున్న సోనియాగాంధీగారిని కూడా ప్రశ్నించదలచుకున్నాం అని శ్రీ జగన్‌ అన్నారు. అయ్యా! వాళ్ళు బుద్ధి లేకుండా విభజిస్తుంటే.. మీరెందుకయ్యా మద్దతిస్తున్నారని చంద్రబాబును కూడా అడగదలచుకున్నాం అన్నారు. ఎప్పుడైనా సమస్యకు పరిష్కారం ఎలా ఉండాలంటే.. ఒక తండ్రికి ఇద్దరు పిల్లలు ఉంటారు. నాన్నా నీ పరిష్కారం వల్ల నాకు అన్యాయం జరుగుతోందని కూతురు వచ్చి అడిగినప్పుడు.. లేదా కొడుకు వచ్చి తనకు అన్యాయం జరుగుతోందని తండ్రిని అడిగినప్పుడు.. ఆ తండ్రి ఏం చేయాలి? పరిష్కారం చూపలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు.. ఆ పరిస్థితిని తండ్రి యధాతథంగా వదిలేయాలని శ్రీ జగన్‌ అన్నారు. సమస్యను సామరస్యంగా, న్యాయంగా పరిష్కరించాలనుకున్న తండ్రే అయితే ఒక ట్రస్టును ఏర్పాటు చేస్తాడని, ఆస్తిని ఎవరూ అమ్ముకోకుండా.. కలిసే ఉండండని అంటాడని అన్నారు.

కానీ ఇప్పుడు ఏం జరుగుతోంది? ఓట్లు, సీట్ల కోసం రాష్ట్రాన్ని ఇష్టం వచ్చినట్లు విభజిస్తున్నారని శ్రీ జగన్‌ విమర్శించారు. తాగడానికి పరిస్థితుల్లో కూడా మేమున్నామంటే పట్టించుకునే వారే లేరని ఆరోపించారు. కృష్ణా ఆయకట్టులో నీటి కోసం రోజూ గొడవలు జరుగుతాయంటే వినే నాథుడే లేడన్నారు. కృష్ణా ఆయకట్టు అంటే దిగువన ఉన్న కేవలం 8 జిల్లాలు మాత్రమే కాదని శ్రీ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. అటు వైపున మహబూబ్‌నగర్, ఖమ్మం, నల్గొండ జిల్లాలు కూడా ఉన్నాయన్నారు. ఈ ఆయకట్టులో రోజూ తన్నుకునే, కొట్టుకునే పరిస్థితి ఉందన్నారు. రాష్ట్రం ఒక్కటిగా ఉన్నప్పుడే ఇలా ఉందన్నారు. రాష్ట్రం ఒక్కటిగా ఉంటేనే పోలవరానికి నీళ్ళు వస్తాయన్నారు. మన రాష్ట్రాన్ని రెండుగా విడగొడితే పోలవరానికి నీళ్ళెక్కడి నుంచి వస్తాయని ఆయన ప్రశ్నించారు. రోజూ కొట్టుకునే పరిస్థితి రాదా? అన్నారు.

హైదరాబాద్‌ విషయానికి వస్తే.. రాష్ట్రంలో చదువుకున్న ప్రతి పిల్లవాడూ ఉద్యోగం కోసం ఇక్కడికే రావాల్సిన పరిస్థితి ఉందని శ్రీ జగన్‌ అన్నారు. ఇలాంటి హైదరాబాద్‌ నుంచి పదేళ్ళలో వెళ్ళిపోవాలని చెబితే.. ఎలా పోగలుగుతాం? ఎక్కడికి పోతాం? ఎలా బ్రతకగలుగుతాం? అని ఆయన ప్రశ్నించారు. ఓట్లు, సీట్ల కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేయడం సమంజసమేనా? అన్నారు.

రాష్ట్ర విభజనకు వ్యతిరేకం, సమైక్యానికి కట్టుబడి ఉన్నానంటూ ఒక్క లేఖ చంద్రబాబు నాయుడు ఇవ్వాలని శ్రీ జగన్మోహన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. అప్పుడు చంద్రబాబు నాయుడు నిరాహార దీక్షకు కూర్చుంటే.. తాను కూడా మద్దతు ఇస్తానని అన్నారు. 'అమ్మా! సోనియా గాంధీగారూ.. మీ కొడుకును ప్రధానమంత్రిని చేయడానికి ఇక్కడ మా అందరి జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు' ఇలా చేయడం తగదని అన్నారు. మేమంతా కూడా ఈ దేశానికి సంబంధించిన పిల్లలమే అన్నారు. తాగడానికి నీళ్ళు లేని పరిస్థితుల్లో ఇవాళ వీధులకెక్కి ఉద్యమాలు చేస్తున్నామని ఆయన గుర్తుచేశారు. కాస్త మా గురించి కూడా ఆలోచించమని సోనియాకు శ్రీ జగన్‌ విజ్ఞప్తిచేశారు. కాస్త ఆలోచన చేయమని చంద్రబాబు నాయుడిని, బిజెపిని కూడా కోరుతున్నామన్నారు.

అసెంబ్లీ తీర్మానం లేకుండా రాష్ట్రాన్ని విడగొట్టే పరిస్థితి దేశంలో మరెక్కడా లేదని శ్రీ జగన్మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. బోడోలాండ్‌ కోసం, గూర్ఖాలాండ్‌ కోసం గొడవలు జరుగుతున్నా పట్టించుకోరని, విదర్భం కోసం అసెంబ్లీ తీర్మానం చేసినా పట్టించుకోరని కానీ మన రాష్ట్రానికి వచ్చేసరికే అడ్డగోలుగా ముక్కలు చేయడానికి సిద్ధమైపోయారని శ్రీ జగన్‌ విమర్శించారు. అసెంబ్లీ తీర్మానం లేకపోయినా.. ఆరు నెలల్లో ఎన్నికలు వస్తాయని తెలిసినా.. ఓట్లు, సీట్ల కోసం మన రాష్ట్రాన్ని విడగొడతారా? అని ఆగ్రహం వ్యక్తంచేశారు.

ఆంధ్రప్రదేశ్‌ విభజనకు పొరపాటున కూడా మద్దు ఇవ్వవద్దని బిజెపి సహా అన్ని పార్టీల ఎంపీలకూ చేతులు జోడించి మరీ విజ్ఞప్తిచేస్తున్నానని శ్రీ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర విభజన విషయంలో బిజెపి తీరు కూడా సరిగాలేదని శ్రీ జగన్
‌వ్యాఖ్యానించారు. కేవలం 17 లోక్‌సభ సీట్ల కోసం కాంగ్రెస్‌ పార్ టీఇలా
చేయడం సరికాదన్నారు. ఈ అడ్డగోలు విభజనకు వ్యతిరేకంగా దేశమంతా ఒక్కతాటిపై
నిలవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం సమైక్యంగా ఉంటుందని ఆశిస్తున్నాను,
దీని కోసమే పోరాడుతున్నానని శ్రీ జగన్మోహన్‌రెడ్డి చెప్పారు. తాగడానికి కూడా నీళ్ళు లేని పరిస్థితి సీమాంధ్రలో వస్తుందన్న వాస్తవాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక్కసారి ఆలోచన చేయాలని కోరారు. ఇప్పుడు ఈ రాష్ట్రంలో జరిగిన విభజనను ఒప్పుకుంటే.. ఓట్లు, సీట్ల కోసం మన దేశాన్నే ముక్కలు ముక్కలు చేసే పరిస్థితి ఎదురవుతుందని పార్లమెంటులోని అన్ని పార్టీల ఫ్లోర్‌ లీడర్లకూ శ్రీ జగన్మోహన్‌రెడ్డి హెచ్చరించారు. మా జీవితాలను నాశనం చేయొద్దండీ అని కోరారు.

కేబినెట్‌ నోట్‌ కన్నా ముందు మన రాష్ట్ర అసెంబ్లీలో సమైక్య తీర్మానం ఆమోదించి ఉంటే.. దేశం మొత్తం చూసేదని.. ప్రజల మనోభావాలను ప్రతిస్పందిస్తూ.. తీర్మానం చేసి ఉంటే.. ఈ సమస్య దేశం మొత్తానికి తెలిసేది అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమా‌ర్‌రెడ్డి సమైక్య రాష్ట్రం కావాలని కోరుకుంటే
అసెంబ్లీని సమావేశపరచి విభజనకు వ్యతిరేకంగా తీర్మానం ఎందుకు చేయలేదు? అని
ప్రశ్నించారు. సిఎంకు చిత్తశుద్ధి ఉంటే ముందుగా ఎందుకు రాజీనామా చేయలేదని
అడిగారు. ఒకవేళ కిరణ్‌రెడ్డి రాజీనామా చేసి ఉంటే దేశమంతా ఆలోచించేదన్నారు.
తద్వారా విభజన ప్రక్రియ జరిగి ఉండేది కాదని శ్రీ జగన్మోహన్‌రెడ్డి
అభిప్రాయపడ్డారు. కేబినెట్‌ నోట్‌ అనేది తొలి ప్రక్రియ అని, దానికి ముందే అసెంబ్లీ తీర్మానం చేసి ఉంటే బాగుండేదన్నారు. విభజన ప్రక్రియలో కేంద్రం తొలి అడుగు వేసింది కాబట్టి.. మిగతా కార్యక్రమాలు కూడా జరిగిపోతాయేమో.. ఇప్పటికైనా ముందుకు రండి అని తాను అన్ని పార్టీలకూ కోరుతున్నానన్నారు. రాష్ట్ర విభజన జరిగితే.. తాగడానికి నీళ్ళు లేక ఈ రాష్ట్రమే అల్లకల్లోలం అయిపోతుందని శ్రీ జగన్‌ ఆందోళన వ్యక్తంచేశారు.

Back to Top