అగళి:
జననేత వైయస్ జగన్‌మోహన్ రెడ్డి జనంలోనే ఉన్నారని, కార్యకర్తలెవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యనిర్వాహక మండలి(సీఈసీ) సభ్యుడు వై. విశ్వేశ్వరరెడ్డి, జిల్లా నేత ఎల్‌ఎం మోహన్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రజలందరి హృదయాల్లో జగన్‌పై అభిమానం గూడు కట్టుకుందని చెప్పారు. ‘గడప గడపకు వైయస్ఆర్ సీపీ’ కార్యక్రమం ముగింపు సందర్భంగా శుక్రవారం పట్టణంలోని వైయస్ఆర్ సర్కిల్‌లో మండల కన్వీనర్ స్టూడియో శ్రీనివాస్, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు హనుమంతరాయప్ప ఆధ్వర్యాన బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో విశ్వేశ్వరరెడ్డి, ఎల్‌ఎంతో పాటు పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు లింగాల రమేష్, జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు భాస్కరరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధులు వైసీ గోవర్దన్‌రెడ్డి,వీరన్న , జిల్లా నాయకులు ఆదినారాయణరెడ్డి, మీసాల రంగన్న, జిల్లా విద్యార్థి విభాగం ఉపాధ్యక్షుడు ప్రతాప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విశ్వేశ్వరరెడ్డి, ఎల్‌ఎం మాట్లాడుతూ ఆనాడు మహానేత వైయస్ పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలు తెలుసుకుని, సీఎం అయ్యాక అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. మహానేత స్ఫూర్తితో జననేత జగన్ సూచన మేరకు షర్మిల పాదయాత్ర చేపడుతున్నట్లు వివరించారు. చంద్రబాబు అధికార దాహంతోనే పాదయాత్ర చేస్తున్నారని దుయ్యబట్టారు. పాదయాత్ర మధ్యలో జనం వెళ్లిపోకుండా మద్యం సీసాలను పంచుతున్నారని విమర్శించారు. చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో మడకశిర నియోజకవర్గంలో ఒక్క భూమిపూజ కూడా చేయలేదన్నారు. రాహుల్‌గాంధీ ‘ఐరన్ లెగ్’ అని, ఎక్కడ కాలుపెట్టినా కాంగ్రెస్ ఓడిపోతోందని గుర్తు చేశారు. సోనియాగాంధీ అల్లుడు వాద్రా రూ.3 వేల కోట్లు అక్రమంగా సంపాదించారని, దానిపై దర్యాప్తు ఎందుకు చేపట్టడం లేదని ప్రశ్నించారు. జగన్‌ను సీఎం చేసేందుకు ఆనాడు 150 మంది ఎమ్మెల్యేలతో మంత్రి రఘువీరా సంతకాలు చేయించారని, అవి ఎక్కడికి పోయాయో చెప్పాలని డిమాండ్ చేశారు.
పార్టీలో చేరిక.. అగళి మండలం కదిరేపల్లి, గుడిబండ మండలం కరికెర గ్రామాలకు చెందిన 100 మంది కాంగ్రెస్, టీడీపీ కార్యకర్తలు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరిని పార్టీ జిల్లా నాయకులు సాదరంగా ఆహ్వానించారు. పార్టీలోకి చేరిన వారిలో కరికెర కాంతరాజుతో పాటు కదిరేపల్లికి చెందిన నాయకులు, వారి అనుచరులు ఉన్నారు. మహానేత వైయస్‌పై అభిమానంతో పార్టీలోకి చేరినట్లు వారు తెలిపారు.