ఉద్యమాన్ని నీరుగారిస్తే చరిత్ర హీనులవుతారు

హైదరాబాద్ 17 అక్టోబర్ 2013:

క్యాబినెట్ నోట్ తయారు కాక ముందే అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటుచేయాలని ముఖ్యమంత్రిగారికి తమ పార్టీ రాసిన లేఖలు అరణ్య రోదన అయ్యాయని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. లోటస్ పాండ్‌లోని నివాసంలో గురువారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడారు. గురువారం ఉదయం తాను గవర్నరు నరసింహన్‌ను కలిసి తక్షణం అసెంబ్లీని సమావేశ పరచాల్సిందిగా విజ్ఞప్తి చేశానని ఆయన తెలిపారు. విభజనకు వ్యతిరేకంగా సమైక్యానికి అనుకూలంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని కూడా కోరామన్నారు. తాను చేసిన ప్రస్తావన అరణ్య రోదనయ్యిందన్నారు. క్యాబినెట్ నోట్ కూడా వచ్చేసిందన్నారు. ఈ నేపథ్యంలోనే తాను గవర్నరును కలిశానన్నారు. అసెంబ్లీని తక్షణం సమావేశ పరచాలని కోరుతూ శుక్రవారం ముఖ్యమంత్రి ఇంటి వద్ద తమ పార్టీ ఎమ్మెల్యేలు ధర్నా చేస్తారని వెల్లడించారు. స్పీకరు గారిని కూడా కలుస్తారన్నారు. ఇప్పటికైనా డ్రాఫ్టు బిల్ తయారుకాకముందే అసెంబ్లీని తక్షణం సమావేశపరచాలని శ్రీ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఉద్యమాన్ని ఎందుకు నీరు గారుస్తున్నారని ముఖ్యమంత్రిని నిలదీశారు. చంద్రబాబు ఢిల్లీకి వెళ్ళి విభజించమని కోరుతూ నిరాహార దీక్ష చేస్తారన్నారు. వెంటనే ముఖ్యమంత్రి ఇక్కడ ఉద్యోగ సంఘాల నేతలను పిలిచి భయపెట్టి, ఉద్యమ బాట నుంచి తప్పించే యత్నం చేస్తున్నారన్నారు.

మొన్నటి దాకా సమైక్యానికి కట్టుబడి ఉన్న కేంద్ర మంత్రులంతా ఈరోజు సమైక్యం కాదు ప్యాకేజీలు కావాలని అడిగే స్థితికి వచ్చారని చెప్పారు. మీరసలు మనుషులేనా అని వారిని ప్రశ్నిస్తున్నానన్నారు. తన కుమారుణ్ణి ప్రధాన మంత్రిని చేసేందుకు సోనియాగాంధీ గారు మన జీవితాలతోనూ, మన పిల్లల జీవితాలతోనూ చెలగాటమాడుతోందని శ్రీ జగన్ మండిపడ్డారు. ఆమెకు చంద్రబాబు నాయుడు వంత పాడుతున్నారన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అయితే సోనియా ఏమి చెబితే అది తుచ తప్పకుండా పాటిస్తున్నారని పేర్కొన్నారు. మీరంతా మనుషులేనా అని వారిని ప్రశ్నిస్తూ, చరిత్ర హీనులుగా మిగిలిపోవద్దని సూచించారు. వైయస్ఆర్ కాంగ్రెస్, సీపీఎం, ఎమ్ఐఎమ్ సమైక్యాంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి మద్దతు పలుకుతున్నాయన్నారు. చంద్రబాబు ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోవాలని సూచించారు. ఆయన కూడా తమ మూడు పార్టీల వైపునకు వచ్చి సమైక్యానికి మద్దతు పలకాలని హితవు పలికారు. ఇలా అందరం ఒకటైతేనే సమైక్యాంధ్ర ప్రదేశ్ లక్ష్య సాధన సాధ్యమవుతుందని శ్రీ జగన్మోహన్ రెడ్డి స్పష్టంచేశారు. చరిత్ర హీనులుగా మిగిలిపోవద్దని చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డిలకు ఆయన విజ్ఞప్తిచేశారు. ఇప్పటికైనా కళ్ళు తెరవకపోతే..కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా ఎడారవుతుందని హెచ్చరించారు. చదువుకున్న ప్రతి పిల్లవాడు హైదరాబాద్ వచ్చి తిరస్కరణకు గురైనప్పుడు వారు తిట్టే ప్రతి తిట్టులోనూ చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డిల పేర్లుంటాయని చెప్పారు. ఈ విషయాన్ని వారిద్దరూ మరిచిపోరాదనీ, తమకు అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాలనీ శ్రీ జగన్మోహన్ రెడ్డి సూచించారు. కాబట్టి అసెంబ్లీని వెంటనే సమావేశపరిచి సమైక్యానికి అనుకూలంగా తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు.

26న సమైక్య శంఖారావం
26న సమైక్య శంఖారావం పూరిస్తానని చెప్పారు. ఆరోజు సభ నిర్వహణకు పోలీసుల అనుమతి లభించిందన్నారు. సమైక్యమంటే తెలంగాణ, కోస్తా, రాయలసీమ మూడు ప్రాంతాలుంటాయన్నారు. ఈ మూడు ప్రాంతాలకు న్యాయం చేయడానికి తాను ముందుంటానని చెప్పడానికే సమైక్య శంఖారావం పూరిస్తున్నట్లు తెలిపారు. రాజకీయాలను పక్కన పెట్టి ఈ వ్యవస్థలోకి నిజాయితీని తీసుకురావాలని పిలుపునిచ్చారు. అందరూ ఒకటి కావలసిన అవసరాన్ని విస్మరిస్తే చరిత్ర హీనులవుతామనే పరిస్థితి వస్తుందని గుర్తెరగాలని ఆయన హితవు పలికారు.

రాజమోహన్ రెడ్డి, ఎస్పీవై రెడ్డి, తాను తమ రాజీనామాలను ఆమోదింపజేసుకుంటామని శ్రీ జగన్ చెప్పారు. మా పార్టీలో చేరిన వారు, చేరబోయేవారు కూడా ఇదే పని చేస్తారన్నారు. తన రాజీనామాను ఆమోదించాలని స్పీకరును కోరుతూ రాజమోహన్ రెడ్డి వెంట ఓ లేఖను రేపు ఢిల్లీకి పంపుతున్నట్లు చెప్పారు.

దిగ్విజయ్ సింగ్, కిరణ్ కుమార్ రెడ్డి సోనియాకు కుడి, ఎడమ భుజాలుగా వ్యవహరిస్తున్నారని శ్రీ జగన్ మండిపడ్డారు. సీమాంధ్రలో ఉద్యమం తగ్గిపోయిందని దిగ్విజయ్ అంటారనీ, కిరణ్ కుమార్ ఉద్యోగులను బెదిరించి సమ్మె విరమింపజేస్తారనీ, కాంగ్రెస్ ఏజెంటుగా చంద్రబాబు ఏకంగా దీక్షలే చేస్తారనీ ఎద్దేవా చేశారు. ఇదంతా మనం చేసుకున్న ఖర్మన్నారు. దేవుడు ఇదంతా చూస్తున్నాడన్నారు. ఉద్యమాన్ని కచ్చితంగా ఉద్ధృతం చేస్తామని స్పష్టంచేశారు.

ఎవరు నిజాయితీగా ఉన్నారో గుండెలమీద చేయి వేసుకుని ఆలోచించాలన్నారు. ఎవరు అన్యాయంగా 16 నెలలు  జైలులో ఉన్నారు, ఎవరు బయట ఉండి కుట్రలు చేశారు.. విప్ జారీ చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడారో అందరికీ తెలుసన్నారు. నేను జైలులో ఉండి నిజాయితీ రాజకీయాలు చేశాననీ, చంద్రబాబు బయట ఉండి కాంగ్రెస్ పార్టీని కాపాడారని చెప్పారు. లగడపాటి అనే మనిషి గురించి మాట్లాడడమంటే పెంట మీద రాయి వేసినట్లేనని శ్రీ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. సమైక్య శంఖారావం సభకు ప్రతి ఒక్కరినీ ఆహ్వానిస్తున్నానని తెలిపారు.

Back to Top