జాక్‌పాట్‌ సీఎంకు జనం సమస్యలు తెలుస్తాయా?

నగరి (చిత్తూరు జిల్లా), 26 సెప్టెంబర్‌ 2012: జాక్‌పాట్‌ కొట్టినట్లుగా ముఖ్యమంత్రి మంత్రి పదవిని పొందిన కిరణ్‌ కుమార్‌ రెడ్డికి జనం సమస్యలు ఎలా తెలుస్తాయని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి సెల్వమణి రోజా ఎద్దేవా చేశారు. ఆర్టీసీ బస్సు చార్జీల పెంపునకు నిరసనగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం నాడు చిత్తూరుజిల్లా నగరిలో రోజా నాయకత్వంలో నగరిలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. పెంచిన డీజిల్‌ ధరలు, ఆర్టీసీ చార్జీలు, విద్యుత్‌ చార్జీలను ఉపసంహరించాలని ఈ ధర్నాలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్తీ శ్రేణులు నినాదాలు చేశారు. మండుటెండను సైతం లెక్క చేయకుండా పార్టీ శ్రేణులు ఈ ధర్నాలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రజల పార్టీ అన్నారు. సమస్యలపై ప్రజల పక్షాన నిలబడి నిరంతరం పోరాటాలు చేస్తుందన్నారు. తన రెక్కల కష్టంతో మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి తీసుకువచ్చిన ప్రభుత్వాన్ని ప్రస్తుత పాలకులు సరిగా నిర్వహించలేక నిర్వీర్యం చేశారని దుయ్యబట్టారు. దివంగత వైయస్‌ఆర్‌ ఆశయాలను ప్రజలకు అందించాలన్న ఏకైక లక్ష్యంతోనే జగన్మోహన్‌రెడ్డి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని స్థాపించారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెంచిన ఆర్టీసి బస్సు చార్జీలను తక్షణమే ఉపసంహరించాలని రోజా డిమాండ్‌ చేశారు.

డీజిల్‌ ధర పెరిగిన కారణంగా ఆర్టీసీపై ఆర్థిక భారం పెరిగిందన్న సాకు చూపించి నిరుపేదలు, సామాన్యులు ప్రయాణించే బస్సుల చార్జీలను పెంచేయడం సరికాదని రోజా తప్పుపట్టారు. డీజిల్‌ ధర పెంపుతో రాష్ట్ర ఖజానాకు అదనంగా వచ్చే వ్యాట్‌ను రద్దు చేయడం ద్వారా ఆర్టీసీపై పడే భారాన్ని ప్రభుత్వం‌ తగ్గించవచ్చని సూచించారు. ఏవో కుంటిసాకులు చూపించి ఇప్పటికే అనేక సమస్యలతో సతమతం అయిపోతున్న సామాన్య, నిరుపేద జనం నడ్డిని మరింతగా విరగ్గొట్టడం ఈ చేతకాని ప్రభుత్వానికే చెల్లిందని నిప్పులు చెరిగారు. డీజిల్‌పై వ్యాట్‌ను వెంటనే ఎత్తివేయాలని ఆమె డిమాండ్‌ చేశారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వాలు ఒక వైపున వంట గ్యాస్‌ ధర పెంచాయని, మరో పక్కన పెట్రోలు, డీజిల్‌ రేట్లను పెంచాయని, ఇప్పుడు పేదలు ఎక్కే బస్సు చార్జీలు పెంచేశాయని రోజా దుయ్యబట్టారు. ధనవంతులు వినియోగించే డీజిల్‌ ధరనే పెంచామని, పేదలు, సామాన్యులపై ఆ భారం పడబోదంటూ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మాట్లాడడం మన దురదృష్టం కాకపోతే మరేమిటని రోజా అపహాస్యం చేశారు. ధనవంతులు మాత్రమే తిరిగే విమాన చార్జీలను ఎందుకు పెంచలేదని ఆమె నిలదీశారు.

ఇందిరమ్మ బాట పేరుతో సీఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డి వెళ్ళిన చోటల్లా క్రికెట్‌, బ్యాడ్మింటన్‌ లాంటి ఆటలు ఆడుతున్నారని, ప్రజల‌ జీవితాలతో కూడా ఆయన అదే విధంగా ఫుట్‌బాల్‌ ఆడుకుంటున్నారని రోజా నిప్పులు చెరిగారు. ప్రజల కష్టాలు పట్టించుకోవాలన్న ఇంగితం తెలియని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని అవసమైతే పడగొట్టేందుకైనా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సిద్ధం అని రోజా స్పష్టం చేశారు. జనాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం నానా అవస్థలు పెడుతున్నప్పటికీ ప్రజల పక్షాన నిలబడి గట్టిగా ప్రతిఘటించలేదని ఆమె విమర్శించారు. ప్రభుత్వం మెడలు వంచి, ప్రజల పక్షాన నిలబడి పోరాడేది వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఒక్కటే అని రోజా పేర్కొన్నారు.
Back to Top