ఇంకెన్నాళ్లు మీ దుర్మార్గాల్ని సహించాలి బాబు

టీడీపీ పాలనలో రాష్ట్రానికి తీరని అన్యాయం
చంద్రబాబు నిర్వాకంతో ఏడారిగా మారుతున్న ఏపీ
తెలంగాణ ప్రాజెక్ట్ లతో రాష్ట్రానికి తీవ్ర నష్టం 
బాబుకు సొంత వ్యాపారాలు తప్ప ప్రజల బాధలు పట్టడం లేదు
ప్రజలారా మేల్కొండి..వైయస్ జగన్ దీక్షకు కదలిరండిః బుగ్గన

హైదరాబాద్ః టీడీపీ పాలనలో ఏపీకి తీరని అన్యాయం జరుగుతోందని, రాష్ట్రం ఎడారిగా మారుతోందని వైయస్సార్సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు. ఎగువ రాష్ట్రాలు ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ప్రాజెక్ట్ లు కడుతుంటే చంద్రబాబు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం, ఫారెన్ టూర్ పేరుతో మార్కెటింగ్ వ్యాపారం, ప్రాజెక్ట్ ల పేరుతో వ్యాపారాలు చేస్తూ బాబు రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని తూర్పారబట్టారు. హైదరాబాద్ లో పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో బుగ్గన మాట్లాడారు. 

రాష్ట్ర సమస్యలపై ప్రతిపక్ష నేత వైయస్ జగన్ పోరాడితే  తప్ప స్పందించని అసమర్థ ప్రభుత్వముందని బుగ్గన టీడీపీపై ధ్వజమెత్తారు. కృష్ణా, గోదావరి నదులపైనే ఆధారపడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చంద్రబాబు నిర్వాకం కారణంగా నీటికొరతతో అల్లాడుతోందని బుగ్గన ఆరోపించారు.  ఆనాడు కేంద్రంలో మిత్రపక్షంగా ఉండి కూడా ఆల్మట్టి, బాబ్లీ ప్రాజెక్ట్ లను అడ్డుకోకుండా ఏపీకి అన్యాయం చేసిన చంద్రబాబు....ఇవాళ మళ్లీ అదే సీన్ రిపీట్ చేస్తున్నారని బుగ్గన ఫైరయ్యారు. పాలమూరు‍‍‍-రంగారెడ్డి, డిండి ప్రాజెక్ట్ లకు ....కృష్ణా నది, శ్రీశైలం ప్రాజెక్ట్ ల నుంచి 120 టీఎంసీల నీటిని వాడుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైనా ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్టైనా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

తెలంగాణ ప్రభుత్వం  పాలమూరు-రంగారెడ్డి, డిండి పథకాలకు 2015 జులైలో శంకుస్థాపన చేస్తే, సంవత్సరం అయ్యే వరకు కూడా చంద్రబాబు వాటి గురించి పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ప్రభుత్వ నిర్వాకం కారణంగానే ఇవాళ ఏపీ ఎడారిగా మారిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈదుర్మార్గమైన చర్యను ప్రతిపక్ష నేత వైయస్ జగన్  వెలికితీసి.....ప్రజలందరినీ ఎడ్యూకేట్ చేసి, అన్ని డిపార్ట్ మెంట్ లకు, కేంద్రానికి తెలియజేసేందుకు సిద్ధమవ్వడంతో....ఇప్పుడు మేం చూస్తామంటూ టీడీపీ నేతలు ముందుకు రావడం హాస్యాస్పదమన్నారు. అంనంతలో కరవుతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వైయస్ జగన్ యాత్ర చేపట్టాక...అప్పుడు పరిహారం ఇస్తామంటూ ముందుకు వచ్చారని, అది కూడా ఇప్పటివరకు ఇచ్చిన దాఖలాలే లేవని విమర్శించారు. 

శ్రీశైలం ప్రాజెక్ట్ లో 854 అడుగుల నీటి మట్టం ఉంటేనే  కృష్ణాడెల్టాకు, రాయలసీమకు సంబంధించిన ప్రాజెక్ట్ లకు, ప్రకాశం వెలిగొండకు గానీ నీళ్లందే అవకాశం ఉంటుందని బుగ్గన చెప్పారు. అది కూడా సమృద్ధిగా అందే అవకాశం లేదని,  870 అడుగులు ఉంటేనే అది సాధ్యపడుతుందన్నారు. కానీ,  800 అడుగులు ఉండగానే తెలంగాణ సర్కార్  పాలమూరు‍- రంగారెడ్డి, డిండిలకు పంపింగ్ చేస్తామని చెబుతోందని...అదే గనుక జరిగితే ఏపీకి తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. 

1996లో  చంద్రబాబు 854 నుంచి 834 అడుగులకు నీటి మట్టం తగ్గించడంతో ఇబ్బందులు తలెత్తాయని, దాన్ని గమనించిన వైయస్సార్ తన హయాంలో ఆరు జిల్లాలకు నీరందించే ఉద్దేశ్యంతో 2005 తర్వాత నీటిమట్టాన్ని 854 అడుగులకు పెంచారని గుర్తు చేశారు.  కానీ మళ్లీ ఈమధ్యకాలంలో చంద్రబాబు దానిని 834 అడుగులకు తగ్గించారన్నారు. 834 అడుగులు చేస్తే హంద్రీనీవా సుజల స్రవంతికి ఏవిధంగా నీళ్లు ఇస్తారని ప్రభుత్వాన్ని నిలదీశారు.  

హంద్రీనావా, గాలేరు నగరి ప్రాజెక్ట్ లకు వేల కోట్లు వెచ్చించి  వైయస్సార్ 90 శాతం పనులు పూర్తి చేస్తే....మిగిలిపోయిన 10 శాతం పనులకు ముష్టిగా 12,13 కోట్లు పడేసి ఆప్రాజెక్ట్ లు మేమే కడుతున్నామంటూ ప్రభుత్వం చెప్పుకోవడం దుర్మార్గమన్నారు. టీడీపీ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా పాలమూరు-రంగారెడ్డి, డిండి పథకాలకు నీటి మళ్లింపును అడ్డుకోవాలన్నారు. అక్రమ ప్రాజెక్ట్ లను అడ్డుకునేందుకు బాబు కనీస ప్రయత్నాలు చేయకపోవడం బాధాకరమన్నారు. 

రాష్ట్రంలో ప్రజలు తాగునీటి కోసం అల్లాడుతుంటే ప్రభుత్వానికి ఏమాత్రం పట్టడం లేదని బుగ్గన ఆగ్రహించారు. సాగునీరు అడిగేత ఇంకుడు గుంతలు కొట్టండని మాట్లాడుతున్నారు. తాగేందుకు నీళ్లు లేవంటే చంద్రన్న మజ్జిగ తాగండంటారు. ఇదేనా బాబు మీరిచ్చే సలహా. టీడీపీ పాలన చూసి అందరూ నవ్వుకుంటున్నారని బుగ్గన ఎధ్దేవా చేశారు. పోలవరం పూర్తి అయితే లక్షలాది ఎకరాలకు నీరు అందడంతో పాటు వేయి మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చని.....వైజాగ్  నగరానికి తాగునీటిని సరఫరా చేసుకోవచ్చని బుగ్గన చెప్పారు. కానీ అధికార టీడీపీకి పోలవరం పూర్తి చేసేందుకు చిత్తశుద్ధి లేదన్నారు.

మేలు చేసే పోలవరాన్ని పక్కనబెట్టిన పట్టిసీమతో నీళ్లిస్తామంటూ రాయలసీమ ప్రజలను మభ్యపెడుతున్నారని బుగ్గన మండిపడ్డారు.  పసుపు పచ్చ రంగు కల్పడం కెనాల్ లో మునిగి మునిగి స్నానం చేయడం తప్ప బాబు రాష్ట్రానికి చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. పునర్విజన చట్ట ప్రకారం పోలవరం కేంద్రానికి సంబంధించిన ప్రాజెక్ట్ అని బుగ్గన చెప్పారు. పోలవరాన్ని తామే పూర్తి చేస్తామని కేంద్రం ముందుకు వస్తుంటే...కాంట్రాక్ట్ లు రాకుండా పోతాయని చంద్రబాబు దాన్ని కేంద్రానికి ఇవ్వడం లేదన్నారు. ఓ పక్క రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉందంటూనే పోలవరానికి  1200,1500 కోట్లు పెడతామనడంలో ఆంతర్యమేంటని నిలదీశారు. ప్రాజెక్ట్ ల్లో గోల్ మాల్ చేస్తూ చంద్రబాబు  రాష్ట్రానికి ఎనలేని అన్యాయం చేస్తున్నారని బుగ్గన ఆగ్రహించారు. రాష్ట్రంలో ఎన్నో పెండింగ్ ప్రాజెక్ట్ లుండగా, అవి పూర్తి చేయకుండా  కొత్త వాటికోసం ఎందుకు వెతుకులాడుతున్నారని నిలదీశారు. ఎంతకాలం మీరు చేసే ఈదుర్మార్గాలను సహించాలని నిప్పులు చెరిగారు. 

టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఏపీ ఏడారి కాబోతోందని బుగ్గన అన్నారు. ఇప్పటికే  అనంత జిల్లాలో తాలుకాలు అన్నీ ఎడారిగా మారుతున్నాయని, కర్నూలు కు నీటి సరఫరా లేదని, ట్యాంకర్లతో సరఫరా చేస్తున్న పరిస్థితి నెలకొందని చెప్పారు. వీటిపై శ్రధ్ద చూపకుండా బాబు తన సొంత వ్యాపారాలు చూసుకుంటున్నారని ఫైరయ్యారు. మిగతా రాష్ట్రాల్లో నీళ్లకు సంబంధించిన సమస్య వస్తే అన్ని పార్టీలు కలిసివస్తాయని, కానీ తెలుగుదేశం పార్టీకి అటువంటి ఆలోచనే లేకపోవడం దురదృష్టకరమన్నారు. 

చంద్రబాబు స్పెషల్ ప్యాకేజీలు, పర్సనల్  ప్యాకేజీల కోసం పాకులాడుతూ హోదాను అటకెక్కించారని బుగ్గన ఆరోపించారు. రెండేళ్లుగా హోదా కోసం వైయస్ జగన్ ఎనలేని పోరాటాలు చేస్తున్నారు. కలిసి పోరాడుదామని ఏనాడైనా మాట్లాడారా బాబు. కేంద్రం వద్దకు తీసుకుపోయే ప్రయత్నం చేశారా అంటూ బుగ్గన ధ్వజమెత్తారు. రాష్ట్రంలో బాబు చేస్తున్న అవినీతి వ్యాపారాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. పొద్దున లేచింది మొదలు నీతి, నిజాయితీ, నా అంత అనుభవం ఎవరికీ లేదని చంద్రబాబు మాట్లాడుతారని...ఎమ్మెల్యేలను కొనడమేనా బాబు మీ నీతి, చట్టాలను బేఖాతరు చేయడమేనా మీ అనుభవం అంటూ చురక అంటించారు. బాబు బండారాన్ని చూసి దేశమంతా ఆశ్చర్యపోతోందన్నారు.  ఏపీలో అసలు ప్రజాస్వామ్యం ఉందా అని ముక్కున వేలేసుకుంటున్నారని అన్నారు. చంద్రబాబు అందరి క్యారెక్టర్ లు చెడగొడుతున్నారని విరుచుకుపడ్డారు. 

విభజనతో నష్టపోయిన ఏపీని చంద్రబాబు మరోసారి దగా చేస్తున్నారని బుగ్గన నిప్పులు చెరిగారు. ప్రజలు మేల్కోవాలన్నారు. రాష్ట్రంలో పరిపాలన జరుగుతుందో , వ్యాపారం జరుగుతుందో గమనించాలన్నారు.   రాష్ట్ర ప్రయోజనాల కోసం కర్నూలులో వైయస్ జగన్ ఈనెల 16 నుంచి మూడ్రోజుల పోటు జలదీక్ష చేపట్టనున్నారని బుగ్గన ప్రకటించారు.  రాబోయే కాలంలో ఏపీ ప్రజలకు ఎలాంటి అన్యాయం జరగకూడదన్న ఉద్దేశ్యంతోనే జననేత దీక్షకు పూనుకున్నారని చెప్పారు.   ప్రతి ఒక్కరూ దీక్షలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 


Back to Top