ప్రతిపక్ష నేత ప్రసంగానికి ఆటంకాలు

అమరావతిః ఆంధ్రప్రదేశ్ కొత్త అసెంబ్లీలో కూడా ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రసంగానికి ఆటంకాలు తప్పలేదు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో రెండోరోజు నీటిపారుదల రంగంపై అడిగిన ప్రశ్నకు మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ఇచ్చిన సమాధానంపై వివరణ ఇచ్చేందుకు విపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి లేచి మాట్లాడుతుండగా మధ్యలోనే ఆపి, స్పీకర్ మరో ప్రశ్నకు వెళ్లిపోయారు. అదే టీడీపీ ఎమ్మెల్యేలకు, మంత్రికి మాత్రం లేని పనులు జరిగినట్లు చెబుతున్నా ఇష్టానుసారం వారికి మైక్ ఇస్తున్నారు. పులివెందులకు నీళ్లిచ్చామని మంత్రి పదే పదే చెబుతున్నారని, స్థానిక ఎమ్మెల్యేగా మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని కోరగా స్పీకర్ ససేమిరా అన్నారు. గాలేరు నగరిలో అంతర్భాగామే పులివెందుల అని, దానికి ప్రభుత్వం ఇచ్చిన లెక్కలనే తాను ప్రస్తావిస్తున్నానని తెలిపారు.

చంద్రబాబు ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత మూడేళ్లలో.. అంటే 2014-15, 15-16, 16-17లో కలిపి గాలేరు నగరి ప్రాజెక్టుకు 400 కోట్ల రూపాయలు కేటాయించారని వైయస్ జగన్ చెప్పారు. అయితే, ఇదే ప్రాజెక్టుకు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలో 4వేల కోట్లు ఖర్చుచేసి 80 శాతం పనులు పూర్తి చేశారని, ఆ విషయం మొత్తం ప్రభుత్వం సభకు ఇచ్చిన కాగితాల్లోనే ఉందని చెప్పారు. అందులో మంత్రి చెప్పినట్లు కేవలం మట్టిపనులే కాక కాంక్రీటు పనులు, లైనింగ్ పనులు, ప్రాజెక్టు పనులు, గేట్లు పెట్టినవి అన్నీ ఉన్నాయన్నారు. ఈ విషయాన్ని ఆయన వివరిస్తుండగానే సప్లిమెంటరీ ప్రశ్నలు మాత్రమే అడగాలని సూచిస్తూ స్పీకర్ మరో ప్రశ్నకు వెళ్లిపోయారు.

ఇంతకుముందు పాత అసెంబ్లీలో కనీసం మైకు ఆన్ అయితే తెలిసేదని, ఇప్పుడు అది కూడా తెలియడం లేదని ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. అందువల్ల ఇప్పుడు దీనివైపు చూడాలో.. మీవైపు చూడాలో తెలియడం లేదని స్పీకర్‌తో అన్నారు. దీంతో ఒక్కసారిగా సభలో నవ్వులు వెల్లివిరిశాయి. కొత్త పరిజ్ఞానం కారణంగా సెన్సర్లతో కూడిన మైకులు కావడం, వాటి నియంత్రణ మొత్తం స్పీకర్ వద్ద ఉండటంతో ఈ విషయాన్ని ఆయన ప్రస్తావించారు.

ఇక ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు 50 యూనిట్ల వరకు కరెంటు ఉచితంగా ఇస్తున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారని, కానీ.. ఈ పథకం కింద ఎస్సీ ఎస్టీలకు ముష్టి వేసినట్లు 58 కోట్లు, 18.5 కోట్ల చొప్పున ఇస్తూ.. ఇదేదో పెద్ద గొప్పగా చేసినట్లు ప్రకటిస్తున్నారని విమర్శించారు. నిరుపేద కుటుంబాలకు ఇచ్చేది ఇంత చిన్న మొత్తం అయినా.. ఏదో చాలా గొప్పగా చేసినట్లు చెబుతున్నారని అన్నారు. కరెంటు బిల్లులు ముట్టుకుంటే షాక్ కొడుతున్నాయని తెలిపారు. ఇంతకుముందు నెలకు బిల్లు 150 రూపాయలు మాత్రమే వస్తే, చంద్రబాబు సీఎం అయ్యాక 500 రూపాయల కరెంటు బిల్లులు వస్తున్నాయని చెప్పారు. దీంతో ఏం చేయాలో అర్థంకాని పరిస్థితిలో ఎస్సీ ఎస్టీలు ఉన్నారన్నారు. ఈ పరిస్థితికి నిరసనగా వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించారు. దాంతో వైయస్ఆర్‌సీపీ సభ్యులంతా సభ నుంచి వాకౌట్ చేశారు.




Back to Top