హైదరాబాద్ః
తనపై జరిగిన హత్యాయత్నం కేసుకు సంబంధించి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హత్యాయత్నం కేసు దర్యాప్తులో కుట్రకోణాన్ని ఏపీ పోలీసులు విస్మరించారని పిటిషన్‌లో వైయస్ జగన్ తెలిపారు. ఈ కేసు విచారణను సక్రమంగా జరపడంలో ఏపీ సర్కారు విఫలమైందని ఆయన తెలిపారు. ఈ కేసులోని కుట్రకోణంపై సజావుగా దర్యాప్తు జరిపించాలని వైయస్ జగన్ హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు.
ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతటా పాదయాత్ర చేస్తూ.. ఏపీ ప్రభుత్వ తప్పిదాలను, పాలకుల అక్రమాలను ప్రజల్లోకి తాను తీసుకెళుతున్నానని వైయస్ జగన్ తన పిటిషన్‌లో స్పష్టం చేశారు. చంద్రబాబు సర్కారు, టీడీపీ దుర్మార్గాలపై ఎప్పటికప్పుడు ఎండగడున్న నేపథ్యంలో ఆపరేషన్ గరుడ పేరుతో ఓ కొత్త నాటకాన్ని తెరపైకి తెచ్చారని, ఏపీ ప్రభుత్వాన్ని కేంద్రం పడగొట్టే ప్లాన్ ఇది అంటూ ప్రచారం చేశారని వైయస్ జగన్ తన పిటిషన్‌లో హైకోర్టు దృష్టికి తెచ్చారు. ‘టీడీపీ సానుభూతిపరుడైన సినీ నటుడు శివాజీయే ఆపరేషన్ గరుడ పాత్రధారి.. పాదయాత్రలో భాగంగా నాపై దాడి జరుగుతుందని శివాజీ గతంలో ప్రకటించారు. టీడీపీ ప్రభుత్వ పతనానికి అది దారితీస్తుందని శివాజీ చెప్పారు’ అని వైయస్ జగన్ తెలిపారు. తాజా పరిణామాలు చూస్తుంటే ఇదొక భారీ కుట్ర అని అర్థమవుతోందని, ప్రతిపక్ష నేతను హత్య చేసి.. అది ఆపరేషన్ గరుడలో భాగమని చెప్పే ప్రయత్నం జరుగుతున్నట్టు కనిపిస్తోందని ఆయన పేర్కొన్నారు.
అక్టోబర్ 25న ఇద్దరు భద్రతా సిబ్బందితో విశాఖ ఎయిర్‌పోర్టుకు తాను వచ్చానని, విమానాశ్రయం లాంజ్‌లో కూర్చుని ఉండగా రెస్టారెంట్‌లో పనిచేసే ఓ వ్యక్తి సెల్ఫీ తీసుకుంటానంటూ దగ్గరికి వచ్చి.. తనపై దాడి చేయబోయాడని వైఎస్ జగన్ వెల్లడించారు. పదునైన కత్తితో దుండగుడు తనపై దాడి చేశాడని, ఈ దాడి నుంచి తాను త్రుటిలో తప్పించుకున్నానని, తాను కిందికి వంగడంతో గొంతుకు తగలాల్సిన కత్తి భుజంలోకి గుచ్చుకుందని, దీంతో ప్రాణాపాయం తప్పిందని వైయస్ జగన్ పిటిషన్‌లో తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఏపీ డీజీపీ ఠాగూర్, విశాఖ సీపీ, స్టేషన్ ఎస్ హెచ్‌వోలతో పాటు మరో నలుగురిని పిటిషన్‌లో ప్రతివాదులుగా చేర్చారు.