గ్రానైట్ పరిశ్రమ‌కు షర్మిల అభయం

ముదిగొండ (ఖమ్మం జిల్లా), 25 ఏప్రిల్‌ 2013: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి అధికారంలోకి వస్తే గ్రానైట్ పరిశ్రమను అన్ని విధాలా ఆదుకుంటామని శ్రీమతి షర్మిల అభయం ఇచ్చారు.‌ మరో ప్రజాప్రస్థానం 131వ రోజు గురువారంనాడు ఆమె ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ముదిగొండలో గ్రానైట్ నిర్వాహకులు, కార్మికుల కష్టసుఖాలను గురువారం అడిగి తెలుసుకున్నారు. శ్రీమతి షర్మిల ఖమ్మం జిల్లాలో చేస్తున్న పాదయాత్ర గురువారం నాడు నాలుగవ రోజుకు చేరుకుంది. ఈ సందర్బంగా ముదిగొండ సమీప గ్రామాల్లోని గ్రానైట్ పరిశ్రమ నిర్వాహకులు, కార్మి‌కులతో శ్రీమతి షర్మిల రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు.

గ్రానైట్ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై పరిశ్రమ నిర్వాహక సంఘం ప్రతినిధులు శ్రీమతి షర్మిలకు వినతిపత్రాన్ని అందజేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అసెంబ్లీలో పోరాడాలని వారు విజ్ఞప్తిచేశారు. దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి హయాంలో పరిశ్రమను ఆదుకునేందుకు అనేక సబ్సిడీలు ఇచ్చారని‌, ఇప్పుడు కిరణ్‌ కుమార్‌రెడ్డి ప్రభుత్వం ఆ సబ్సిడీలను నిలిపివేసిందంటూ పరిశ్రమ నిర్వాహకులు వాపోయారు. కరెంట్ కోతలతో పరిశ్రమలను నిర్వహించుకోలేక మూసివేయాల్సిన ‌దుస్థితి ఏర్పడిందని యజమానులు ఆందోళన చెందారు.

మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి 2009లో గ్రానైట్‌ పరిశ్రమ కష్టాల్లో ఉందని రూ. 1700 ఉన్న రాయల్టీని 40 శాతం సబ్సిడీ ఇచ్చి రూ. 1,050 చేశారని చెప్పారు. ఆ రోజు 30 రోజులు నడిపించినప్పటికీ క్యూబిక్‌ మీటర్‌ గ్రానైట్‌ తయారీకి వెయ్యి రూపాయలు రాయల్టీ కట్టేవారమన్నారు. ఇప్పుడు పది రోజులు నడిపిస్తున్నా రూ. 2 వేలు కట్టాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాయల్టీ పెరిగిందని, విద్యుత్‌ బిల్లులు రెట్టింపు అయ్యాయని పరిశ్రమను నడిపించే పరిస్థితే లేకుండాపోయిందని విచారం వ్యక్తంచేశారు. ప్రభుత్వ నిబంధనల కారణంగా ఈ చిన్నతరహా పరిశ్రమ మూతపడే దుస్థితి ఎదురైందన్నారు. 2009 - 10లో లక్షా 20 వేల నుంచి 30 వేలు వరకూ కరెంటు బిల్లు వచ్చేదని కానీ ఇప్పడు 10 నుంచి 12 రోజులకే రూ.2 లక్షల వరకూ వస్తోందని వాపోయారు. ఖర్చులు, సమస్యలు పెరిగిపోయిన కారణంగా గ్రానైట్‌ ధర పెంచాల్సి వచ్చిందన్నారు. దీనితో కొనుగోలుదారులు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.

గ్రానైట్ పరిశ్రమ సంక్షోభంలో పడడటంతో పనులు లేక తాము పస్తులు‌ ఉంటున్నామని కార్మికులు శ్రీమతి షర్మిల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. కరెంట్‌ కోతల కారణంగా ఒక రోజు పని ఉంటే మరో రోజు ఉండడంలేదని తెలిపారు. మహానేత వైయస్‌ ఉన్నప్పుడు కూలీ రోజుకు రూ. 300 వరకూ పడేదన్నారు. కానీ ఇప్పుడు రోజుకు రూ. 100 నుంచి రూ. 150కి మించి రావడంలేదని వాపోయారు. వారి సమస్యలు శ్రద్ధగా విన్న శ్రీమతి షర్మిల పై విధంగా స్పందించారు.
Back to Top