స్థిరాస్తి వ్యాపారం చేస్తే ఊరుకోం

హైదరాబాద్, డిసెంబర్ 9: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త రాజధాని నిర్మాణం పేరుతో చంద్రబాబు ప్రభుత్వం  స్థిరాస్తి (రియల్ ఎస్టేట్) వ్యాపారాన్ని ప్రోత్సహిస్తే ఊరుకోబోమని తీవ్రంగా ప్రతిఘటిస్తామని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు హెచ్చరించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ధర్మాన మాట్లాడారు. రాజధాని నిర్మాణానికిగాను భూసేకరణ విధానాన్ని ఆయన తప్పుబట్టారు. ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతి, తీసుకున్న నిర్ణయాలు తమ పార్టీకి ఆమోదయోగ్యం కాదన్నారు. 

ల్యాండ్ పూలింగ్ విధాన ప్రకటనను తమ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుందని, రాజధాని ప్రయోజనాలు పూర్తిగా అక్కడి రైతులకే చెందాలి తప్ప, ప్రైవేటు సంస్థలకు కాదన్నారు. చంద్రబాబు విధాన ప్రకటన చూస్తే రైతుల నుంచి భూమిని తీసుకుని ఆ ప్రయోజనం ప్రైవేటు వ్యాపారులకు కట్టబెట్టాలన్న యోచనగా ఉందన్నారు. రాజధాని నిర్మాణం ఏపీ ప్రభుత్వం-సింగపూర్ ప్రభుత్వం కలసి నిర్మిస్తాయని ఇంతవరకూ ప్రజలను నమ్మిస్తూ వచ్చారని కానీ.. 2 పెద్ద కంపెనీలకు ఈ నిర్మాణ పనులు అప్పగిస్తామని చంద్రబాబే ప్రకటించారని పేర్కొన్నారు. 

ప్రైవేటు వ్యక్తులకు మేలు చేసేలా బాబు ప్రభుత్వం వ్యవహరిస్తుందని తాము తొలి నుంచీ చెబుతున్నామని, ఇప్పుడు అదే నిజమైందని ధర్మాన నొక్కి చెప్పారు. రాజధానికిగాను భూములు కోల్పోతున్న రైతులకు 1000 గజాలిస్తాం, 1300 గజాలిస్తామని చెప్పడం వెనుక ప్రభుత్వ వ్యాపార ధోరణి, ప్రైవేటు సంస్థలకు ప్రయోజనం చేకూర్చాలనే వైఖరి కనిపిస్తోందన్నారు. రాజధాని నిర్మాణంలో విపక్షాలను భాగస్వాములు చేయడానికి, ప్రజాస్వామ్య బద్ధంగా చర్చించడానికి ఎందుకు భయపడుతున్నారని బాబును ప్రశ్నించారు. 

రాజధాని సరిహద్దు చుట్టుపక్కల బడాబాబులు వందలాది ఎకరాలు ముందుగానే కొనేయలేదని చెప్పగలరా? అని ఆయన సవాలు విసిరారు. కేంద్ర ప్రభుత్వం మాదిరిగానే రాష్ట్ర ప్రభుత్వ ఆదాయవ్యయాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని కోరుతూ శ్రీ వైఎస్ జగన్ రాసిన లేఖకు సానుకూలంగా స్పందించి అంతర్జాలంలో పొందుపర్చాలన్నారు.


Back to Top