ప్రభుత్వానిది లెక్కలేని తనం: విజయమ్మ

శ్రీకాకుళం/ విజయనగరం :

‘రాష్ట్రంలో వరదలు బీభత్సం సృష్టించాయి. కోస్తా జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 53 మంది భారీ వర్షాలు, వరదలకు మృత్యు కౌగిట్లోకి చేరారు. భారీ వర్షాలు కురిసి వారం రోజులు దాటుతున్నా ఇప్పటికీ కొన్ని కాలనీలు నీటిలోనే మునిగి ఉన్నాయి. ఈ ప్రభుత్వానికి మానవత్వం లేదు. ప్రజల సమస్యలంటే లెక్క అంతకన్నా లేదు. నష్టాల వివరాలను అధికారులు సేకరించలేదు. భారీ వర్షాలు వచ్చిన వారం రోజుల తరువాత ముఖ్యమంత్రి ముఖం చూపించారు. కనీసం ఏరియల్ సర్వే కూడా చేయలేదు. బాధితులకు తక్షణ సాయం అందించాలని ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం’ అని వై‌యస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు‌ శ్రీమతి వైయస్ విజయమ్మ అన్నారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో‌ భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయిన ప్రాంతాల్లో బుధవారం పర్యటించిన శ్రీమతి విజయమ్మ బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా శ్రీకాకుళంలో నిర్వహించిన మీడియా సమావేశంలో శ్రీమతి విజయమ్మ మాట్లాడారు.

వరుసగా వచ్చిన నాలుగు తుపాన్‌లతో అన్ని వర్గాల వారు నష్టపోయారని‌ శ్రీమతి విజయమ్మ విచారం వ్యక్తం చేశారు. నీలం తుపాను బాధితులకు ఇంతవరకు ఇన్‌ఫుట్ సబ్సిడీ కూడా ఇవ్వలేదని ప్రభుత్వాన్ని విమర్శించారు. కృష్ణా, ఉభయ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల పర్యటన సందర్భంగా పలువురు రైతులు ఈ విషయాన్ని తన దృష్టికి తీసుకు వచ్చారన్నారు. గతంలో వచ్చిన లైలా, జల్, నీలం తుపానుల కంటే ‌కొద్ది రోజుల క్రితం వచ్చిన పై-లీన్ తుపాన్, భారీ వర్షాలతో నష్టం తీవ్రంగా ఉందన్నారు.

మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో తుపాన్‌లు వస్తున్నాయంటేనే ముందస్తు జాగ్రత్తలు తీసుకునేవారని శ్రీమతి విజయమ్మ గుర్తుచేశారు. దానితో ఆస్తి, ప్రాణనష్టం అంతగా జరిగేది కాదన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోగా, బాధితులకు పరిహారం అందజేయడంలో కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, వారు కనీసం పరామర్శకు కూడా నోచుకోవడం లేదని ఆరోపించారు. ఎంత నష్టం జరిగిందో కూడా అధికారులు ఇప్పటికీ తెలుసుకోలేకపోయారు, కనీసం మత్స్యకారులు, ఇళ్లు కూలిపోయినవారికి కిరోసిన్, 20 కిలోల బియ్యం ఇచ్చే సంప్రదాయాన్ని కూడా పాటించలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.

కిరణ్‌ ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదో అర్థం కావడం లేదని శ్రీమతి విజయమ్మ వ్యాఖ్యానించారు. హుడా కమిటీ చెప్పినట్టు ఎకరాకు 10 వేలు పరిహారం, తిరిగి పంటలు వేసుకోడానికి ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వాలని కోరారు. రంగుమారిన ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు. ఇళ్లు, సామాన్లు కోల్పోయిన వారి పిల్లల పాఠశాల ఫీజులు ప్రభుత్వమే భరించాలని డిమాండ్‌ చేశారు. వరదలు, కరవు వల్ల నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 6 వేలు ఉత్పాదక రాయితీ అందించాలన్నారు. రైతుల పక్షాన వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పోరాడి రుణ మాఫీ చేయించేలా చూస్తుందని భరోసా ఇచ్చారు.

ప్రభుత్వం, ప్రధానికి నష్టాల నివేదిక :
భారీ వర్షాల కారణంగా ఎక్కడెక్కడ ఎంత నష్టం జరిగిందనే వివరాలతో రాష్ర్ట ప్రభుత్వంతో పాటు, ప్రధాని, కేంద్ర వ్యవసాయ మంత్రికి కూడా నివేదిక అందజేస్తామని శ్రీమతి విజయమ్మ పేర్కొన్నారు. బాధిత రైతుల కష్టనష్టాలను అసెంబ్లీలో ప్రస్తావిస్తామని, వారికి పూర్తి న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తామన్నారు. ‘జగన్‌బాబు అధికారంలోకి వచ్చిన వెంటనే అందరినీ ఆదుకుంటారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయస్ఆర్‌ మాదిరిగా రైతులకు మేలు చేస్తారు. కోర్టు షరతుల కారణంగా జగన్‌బాబు బాధితులను పరామర్శించడానికి స్వయంగా రాలేకపోయారు. కష్టాల్లో ఉన్న ప్రజలను పరామర్శించి, ధైర్యం నింపాలని నన్ను ఇక్కడికి పంపించారు. అందరూ ధైర్యంగా ఉండాలని చెప్పారు. కష్టాల్లో, బాధల్లో జగనెప్పుడూ అండగా ఉంటారు. మీ కోసమే ఆలోచన చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అందరికీ న్యాయం చేస్తారు’ అని ప్రజలకు శ్రీమతి విజయమ్మ భరోసా ఇచ్చారు.

శ్రీమతి విజయమ్మ పర్యటనలో వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ కో ఆర్డినేటర్‌ కొణతాల రామకృష్ణ, ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త సుజయకృష్ణ రంగారావు, విజయనగరం జిల్లాల కన్వీనర్‌ పెనుమత్స సాంబశివరాజు, పార్టీ శాసనసభా పక్ష ఉప నాయకుడు ధర్మాన కృష్ణదాస్, పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు కణితి విశ్వనాథం, నియోజకవర్గాల సమన్వయకర్తలు, పార్టీ పరిశీలకులు తదితరులు పాల్గొన్నారు.

Back to Top