ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత

అమర్నాథ్ దీక్షకు వెల్లువలా మద్దతు
హామీలు విస్మరించిన టీడీపీ,బీజేపీలపై ఆగ్రహం

విశాఖపట్నంః చంద్రబాబు తన స్వలాభం కోసం రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెడుతున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ కొలగట్ల వీరభద్రస్వామి మండిపడ్డారు.  విభజన హామీలపై బాబు కేంద్రాన్ని నిలదీయకపోవడం దారుణమన్నారు.  ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు విశాఖకు రైల్వే జోన్ వస్తుందని  ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూశారని  వీరభద్రస్వామి అన్నారు. కానీ అధికారంలోకి వచ్చాక టీడీపీ, బీజేపీలు ఇచ్చిన వాగ్దానాలను విస్మరించాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. హామీలపై బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా తాము అనేకసార్లు సామరస్యపూర్వకంగా కేంద్రానికి విన్నవించామని కొలగట్ల చెప్పారు. అంబేద్కర్ జయంతి లోపు విశాఖకు రైల్వే జోన్ ప్రకటించాలని జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ కూడా డిమాండ్ చేశారని తెలిపారు. ప్రభుత్వాలు పట్టించుకోని కారణంగానే ఆరోగ్యాన్ని పణంగా పెట్టి దీక్షకు కూర్చున్నారన్నారు. 

అమర్నాథ్ కు ఏం జరిగినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలని కొలగట్ల హెచ్చరించారు.  విజయనగరం జిల్లా తరపున అమర్నాథ్ కు సంఘీభావంగా ఒకరోజు దీక్షలో కూర్చొంటామని కొలగట్ల ప్రకటించారు. విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్ వస్తే ..సరుకుల రవాణా పెరిగి వ్యాపారంగా అభివృద్ధి జరుగుతుందన్నారు.  నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని వీరభద్రస్వామి చెప్పారు. 

రానున్న రోజులన్నీ మనవే..
సింహాద్రి అప్పన్న, తిరుపతి వెంకన్న, శ్రీశైలం మల్లన్న, భద్రాద్రి రామన్న తాలూక దివ్య ఆశీస్సులు గుడివాడ అమర్నాథ్ కు ఉండాలని,  దీక్ష విజయవంతం కావాలని కరణం ధర్మశ్రీ అన్నారు . కురుక్షేత్ర యుద్ధంలో అభిమన్యుడు ఏవిధంగా పోరాటం చేశారో....ప్రభుత్వం కుటిల రాజకీయాలను ఎండగడుతూ అధ్యక్షులు   వైఎస్ జగన్ రాష్ట్ర సమస్యలపై ఎనలేని పోరాటం చేస్తున్నారన్నారు. రానున్న రోజులన్నీ మనవేనని,  చేయి చేయి కలిపి ఐక్యంగా ముందుకు సాగి...విశాఖకు రైల్వే జోన్ సాధించుకుందామని పిలుపునిచ్చారు. అమర్నాథ్ దీక్షకు సంఘీభావం తెలిపిన ప్రతి ఒక్కరికీ ధర్మశ్రీ ధన్యవాదములు తెలిపారు. అదేవిధంగా జీవీఎంసీ గుర్తింపు యూనియన్  అమర్నాథ్ దీక్షకు సంఘీభావం ప్రకటించింది. ఒకరోజు విధులు బహిష్కరించి దీక్షలో కూర్చుంటామని యూనియన్ నాయకులు ప్రకటించారు.

వైఎస్ జగన్ నాయకత్వాన్ని బలపరుస్తాం..
విభజన సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కేంద్రంలోని పెద్దలు, రాష్ట్రంలోని నాయకులు అశ్రద్ధ చేస్తున్నారని వైఎస్సార్సీపీ బీసీ సెల్ అధ్యక్షుడు ధర్మాన క్రిష్ణదాస్ మండిపడ్డారు. ఇచ్చిన వాగ్దానాలకు న్యాయం చేయని రీతిలో ప్రభుత్వాలున్నాయని, వాటిని సాధించేందుకు జననేత వైఎస్ జగన్ అనేక సందర్భాల్లో ఉద్యమిస్తున్నారని ధర్మాన చెప్పారు. ఇప్పటికే అనేక అంశాలపై ఎనలేని పోరాటాలు చేశారన్నారు.  విశాఖకు రైల్వే జోన్ సాధనే లక్ష్యంగా ప్రభుత్వం కళ్లు తెర్పించేందుకు... జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ తీసుకున్న నిర్ణయాన్ని యావత్ ప్రజానీకం హర్షిస్తోందని ధర్మాన అన్నారు. గుడివాడ గుర్నాథరావు ఒరవడిని కొనసాగిస్తూ అమర్నాథ్ జిల్లాలో ప్రజాసమస్యలపై పోరాడుతున్నారని చెప్పారు. అమర్నాథ్ దీక్షకు అండగా నిలుస్తూ వైఎస్ జగన్ నాయకత్వాన్ని బలపరుస్తామని ధర్మాన చెప్పారు. 

Back to Top