ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి

రాష్ట్ర ప్రభుత్వంపై  వైయస్ జగన్ మండిపాటు
రైతులకు నాసిరకం విత్తనాల సరఫరాపై ఆగ్రహం
విత్తనాలు మొలకెత్తకపోవడంతో రైతులు పంటను దున్నేస్తున్నారని ఆవేదన
15వ తేదీ లోపు కొత్త విత్తనాలు ఉచితంగా ఇవ్వాలని డిమాండ్
 ఇనగలూరులో పంట పరిశీలన..వ్యవసాయాధికారులతో సమీక్ష
 పరిస్థితిపై కలెక్టర్‌కు ఫోన్‌లో వివరణ
వైయస్సార్ జిల్లాలో జననేత విస్తృత పర్యటన

వైయస్సార్ కడప: ఏపీ ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ వైయస్సార్ కడప జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రజాసమస్యలు తెలుసుకుంటూ, పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటూ ముందుకు సాగుతున్నారు. ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ వారి సాధకబాధలను అడిగి తెలుసుకుంటున్నారు. వైయస్సార్ జిల్లా పర్యటనలో భాగంగా రైతులతో కలిసి వేరుశనగ పంటల్ని పరిశీలించిన వైయస్ జగన్ అన్నదాతలు పడుతున్న బాధలు చూసి చలించిపోయారు. ఈసందర్భంగా రైతుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిపై మండిపడ్డారు. 
‘ప్రభుత్వం రైతులకు సరఫరా చేసిన వేరుశనగ విత్తనాల్లో నాణ్యత లేదు. పురుగుపట్టిన విత్తనాలు సరఫరా చేశారు. పంటవేస్తే మొలకెత్తడం లేదు. తక్కువ శాతం మొలకలు రావడం, వచ్చిన మొలకలు కూడా వేరుకుళ్లుతో ఎండిపోతుండటంతో రైతులు పంటను దున్నేస్తున్నారు. ఈ పరిస్థితిని చూసి ప్రభుత్వం సిగ్గుతో తలవంచుకోవాలి..’ అని  వైయస్ జగన్‌ ధ్వజమెత్తారు. వైయస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని ఇనగలూరు గ్రామంలో సక్రమంగా మొలకెత్తని వేరుశనగ పంటను బుధవారం సాయంత్రం కడప ఎంపీ వైయస్ అవినాష్‌రెడ్డితో కలసి ఆయన పరిశీలించారు. రైతు దశరథరామిరెడ్డిని పంట దెబ్బతినడానికి గల వాస్తవ కారణాలను ఆరా తీశారు. రైతులు పొలాలు దున్నేస్తున్నారనే విషయం తెలుసుకుని చలించిపోయిన ఆయన పొలంలోనే వ్యవసాయాధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

 
విత్తనాలు వేసి 15 రోజులు అవుతున్నా సక్రమంగా మొలకెత్తడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నాసిరకం విత్తనాలు సరఫరా చేయడంతోనే ఈ దుస్థితి దాపురించిందని మండిపడ్డారు. తొండూరు, పులివెందుల మండలాల్లో నాసిరకం విత్తనాల కారణంగా రైతులు నష్టపోయారని, వారికి కొత్త విత్తనాలు ఉచితంగా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ వరకు రుతుపవనాలు ఉండే అవకాశం ఉన్నందున జూలై 15లోపు కొత్త విత్తనాలు ఇవ్వాలన్నారు. అనంతరం కలెక్టర్ కేవీ సత్యనారాయణతో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని వివరించారు. వ్యవసాయాధికారులతో నివేదిక తెప్పించుకుని తక్షణమే కొత్త విత్తనాలు ఉచితంగా ఇవ్వాలని కోరారు. జూలై 15లోపు సరఫరా చేస్తేనే రైతులకు ఉపయోగమని, తర్వాత ఇచ్చినా ప్రయోజనం లేదని కలెక్టర్‌కు వివరించారు.

 
 బిజీబిజీగా ప్రతిపక్ష నేత
వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం పులివెందులలో బిజీబిజీగా గడిపారు. జిల్లాతో పాటు నెల్లూరు, అనంతపురం జిల్లాలకు చెందిన నేతలు పలువురు ఆయనను కలిశారు. మధ్యాహ్నం వరకు కార్యాలయంలో గడిపిన జననేత ఆ తర్వాత సింహాద్రిపురం మండలం చెర్లోపల్లెలో వాటర్‌ప్లాంటు ప్రారంభించారు. సాయంత్రం తొండూరు మండలం ఇనగలూరులో వేరుశనగ పంటను పరిశీలించారు. అనంతరం మల్లేలలో వాటర్‌ప్లాంటును ప్రారంభించారు. మల్లేల దర్గాలో ముస్లిం సోదరులతో కలసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. విపక్ష నేతను కలసిన వారిలో కడప ఎమ్మెల్యే అంజద్‌బాషా, ఎమ్మెల్సీ గోవిందరెడ్డి, మేయర్ సురేష్‌బాబు, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, నెల్లూరు జిల్లా గూడూరుకు చెందిన బత్తిన విజయ్‌కుమార్ తదితరులు ఉన్నారు.


 
 దళిత హక్కుల పరిరక్షకుడు బాబూజగ్జీవన్‌రామ్
సమాజంలో వివక్షకు గురై సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన దళిత, గిరిజనులకు రాజ్యాంగంలో ప్రత్యేక హక్కులను కల్పించి వారి జీవితాల్లో వెలుగు నింపిన చైతన్యదీప్తి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అయితే, ఆ హక్కులను పరిరక్షించేందుకు జీవితాంతం పోరాడిన దళిత జనోద్ధారకుడు బాబూ జగ్జీవన్‌రామ్ అని వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి కొనియాడారు. బుధవారం జగ్జీవన్‌రామ్ 30వ వర్ధంతి సందర్భంగా  పులివెందులలోని తన కార్యాలయంలో జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

కేంద్రమంత్రిగా, దేశ ఉప ప్రధానిగా, సీనియర్ పార్లమెంటేరియన్‌గా పనిచేసిన జగ్జీవన్‌రామ్ తుదిశ్వాస వరకు దళితుల హక్కుల పరిరక్షణే ధ్యేయంగా వ్యవహరించారని తెలిపారు. నేటితరం రాజకీయ నాయకులకు జగ్జీవన్‌రామ్ స్ఫూర్తిదాయకుడు అని అన్నారు. ఎంపీ వైయస్ అవినాష్‌రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 మా పక్షాన పోరాటం చేయండి
ప్రతిపక్ష నేతకు అగ్రిగోల్డ్ ఏజెంట్ల మొర
తమ పక్షాన పోరాటం చేయాల్సిందిగా అగ్రిగోల్డ్ ఏజెంట్లు వైయస్ జగన్‌కు విజ్ఞప్తి చేశారు. బుధవారం ఉదయం పులివెందుల కార్యాలయంలో విపక్ష నేతను కలసి వారు తమ సమస్యలు విన్నవించారు. ‘రాష్ట్ర ప్రభుత్వం సీఐడీ విచారణ పేరుతో ఇప్పటికే రెండేళ్ల కాలయాపన చేసింది. డబ్బులు కట్టి మోసపోయిన వినియోగదారులకు సమాధానం చెప్పలేక.. కంపెనీకి చెల్లించిన సొమ్ము అందక అనేకమంది ఏజెంట్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరికొంతమంది ఒత్తిడి తట్టుకోలేక ఊరు వదిలి వెళుతున్నారు. 40 లక్షలమంది వీధిన పడ్డా, ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదు. మీరే మమ్మల్ని ఆదుకోవాలి’ అంటూ మొరపెట్టుకున్నారు. ఇ-ఆక్షన్ ద్వారా అగ్రిగోల్డ్ ఆస్తులన్నింటినీ ఒకే విడతలో విక్రయించి బాధితులకు డబ్బులు చెల్లించేలా చూడాలని కోరారు. సీఆర్‌డీఏ పరిధిలోని ఆస్తుల వేలానికి వెంటనే అనుమతులు మంజూరు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని విజ్ఞప్తి చేశారు.


 
అగ్రిగోల్డ్ సంస్థకు రూ.11వేల కోట్ల ఆస్తులు ఉంటే, రూ.6,300 కోట్లు మాత్రమే అప్పులు ఉన్నాయని తెలిపారు. 20 ఏళ్లుగా ఉన్న సంస్థ కావడంతో పెన్షన్‌దారులు సైతం పొదుపు చేసుకున్నారని వివరించారు. వారి ఆవేదనను ఓపికగా విన్న వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి.. వారి తరఫున ప్రభుత్వంపై పోరాటం చేస్తానని, న్యాయపోరాటానికి కూడా సిద్ధమవుతున్నట్లు తెలిపారు.

తాజా ఫోటోలు

Back to Top