దేవాలయాల విధ్వంసానికి ప్రభుత్వానిదే బాధ్యత

టీడీపీ నేతల ఆస్తులు కాపాడేందుకే ఆలయాల కూల్చివేత
నాని నోరు అదుపులో పెట్టుకో
ఇష్టారాజ్యంగా గుళ్లు, మసీదులు కూలగొడతారా?
అభివృద్ధి పేరుతో ఆలయాలు కూల్చడం దారుణం
వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి పార్థసారథి 

హైదరాబాద్ః అభివృద్ధి పేరుతో హిందువుల మ‌నోభావాలు దెబ్బ‌తినేలా దేవాల‌యాల‌ను కూల్చడాన్ని వైయస్సార్సీపీ తీవ్రంగా ఖండిస్తుందని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి పార్థసారథి అన్నారు. టీడీపీ నాయ‌కుల ఆస్తుల‌ను కాపాడుకోవ‌డం కోస‌మే కృష్ణుడి దేవాల‌యాన్ని ధ్వంసం చేశార‌ని పార్థసారథి 'అధికార టీడీపీపై ధ్వజమెత్తారు.  దీనికి చంద్ర‌బాబే బాధ్య‌త వ‌హించాల‌న్నారు. టీడీపీ ఎంపీ నాని దేవాలయాలను కూల్చేశామన్న మనస్తాపం కూడా లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని హెచ్చరించారు. 

బ‌ల‌హీన వ‌ర్గాల‌ను కించ‌ప‌ర్చే విధంగా  మాట్లాడ‌డం టీడీపీ నేతలకు అల‌వాటుగా మారింద‌ని పార్థ‌సార‌థి పైర్ అయ్యారు. ఎస్సీలుగా ఎవ‌రు పుట్ట‌ాలని కోరుకుంటారని బాబు,  గోశాలలు తీసేసి గ‌డ్డి తిన‌మ‌ంటూ నాని లాలూ ప్రసాద్ యాదవ్ లాగా మాట్లాడడం  సిగ్గు చేట‌న్నారు. రోడ్ల విస్తరణ కోసం ఇష్టారాజ్యంగా గుళ్లు, మసీదులు పగలగొట్టేస్తామంటుంటే.. అసలు ఈ ప్రభుత్వం ఎలా పనిచేస్తోందో అర్థం కావట్లేదని చెప్పారు. దేవాలయాలను ధ్వంసం చేసిన దానికి ప్రభుత్వానిదే బాధ్యత అని అన్నారు. 

ఓ పక్క హిందూమ‌త సంప్ర‌దాయాల్లో భాగమైన పుష్కరాలను నిర్వహిస్తూ, మ‌రోప‌క్క  హిందు దేవాల‌యాల‌ను కూల్చివేయ‌డం ఎంత‌వ‌ర‌కు స‌మంజ‌స‌మ‌న్నారు.  టీడీపీ నాయ‌కులు చేసే ఏప‌నిపైనా  చిత్త‌శుద్ధి లేదని ఎద్దేవా చేశారు. పుష్క‌రాల‌ నిర్వాహణ కూడా తెలుగుత‌మ్ముళ్ల జేబులు నింపుకోవ‌డానికేన‌ని ఆరోపించారు. అభివృద్ధి పేర మ‌త క‌ట్ట‌డాల‌ను ధ్వంసం చేసినప్పుడు దానికి వ్య‌తిరేకంగా జ‌రిగే ప్ర‌తి పోరాటానికి వైయస్సార్సీపీ మద్దతు ఉంటుందని తెలిపారు. 
Back to Top